. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
. 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
. ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి లాంచ్ ప్యాడ్‌గా నిలుస్తుంది
. కూటమి పాలనలో రెట్టింపు వేగంతో దూసుకుపోతున్న ఏపీ
విశాఖపట్నం: స్వర్ణాంధ్ర విజన్‌కు ఈ రోజు అత్యంత శుభదినం. రూ.18,000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైంది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమిపై అడుగుపెట్టడం తన అదృష్టమని పేర్కొన్న ప్రధాని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. “అందరికీ నమస్కారం” అంటూ మాతృభాష తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ, శనివారం ప్రారంభించిన ప్రాజెక్టులు విమాన,రోడ్డు అనుసంధానాన్ని విప్లవాత్మకంగా పెంపొందిస్తాయని చెప్పారు.
ఈ రోజు రెండు ప్రధాన రికార్డులు నమోదయ్యాయని ప్రధాని మోదీ సభలో కొనియాడారు. అందులో ఒకటి ప్రపంచస్థాయి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాగా, రెండోది ఒకే వేదికపై 13 వేల మంది గిరిజన కళాకారులు ప్రదర్శించిన ‘థింసా’ నృత్యం అని తెలిపారు. ఈ అద్భుత ప్రదర్శన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు, ప్రణాళికకు నిదర్శనమని అభినందించారు. థింసా నృత్యంలో మన తరతరాల సాంస్కృతిక వారసత్వం స్పష్టంగా కనిపించిందని, ఆదివాసీల హక్కుల కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అమరమైనదని స్మరించుకున్నారు. ఈ కొత్త ఎయిర్పోర్ట్ సమగ్ర ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక ‘లాంచ్ ప్యాడ్’గా, ‘రన్‌వే’గా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గడిచిన పన్నెండేళ్లలో దేశీయ విమానయాన రంగం అసాధారణ వృద్ధిని సాధించిందని ప్రధాని తెలిపారు. 2014 నాటికి దేశంలో కేవలం 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 166కు పెరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టులకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లను పెట్టే సాంప్రదాయాన్ని నడిపాయని, కానీ తమ ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికిందని విమర్శించారు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు మహర్షి వాల్మీకి పేరు, ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్టుకు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని గుర్తుచేశారు. ‘ఉడాన్’ పథకం ద్వారా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెట్టింపు వేగంతో దూసుకుపోతోందని ప్రధాని మోడీ కొనియాడారు. ఈ తీరప్రాంతాన్ని ‘కోస్టల్ ఎకనామిక్ కారిడార్’గా తీర్చిదిద్ది, దేశంలోని ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ‘పీఎం గతిశక్తి’ ద్వారా రైల్వే, పోర్టులు, ఎయిర్‌పోర్టులను సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.సాఫ్ట్వేర్, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఏపీ యువత ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ పరిశ్రమకు శంకుస్థాపన చేశామని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారబోతోందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.





