‘భోగాపురం’తో ఉత్తరాంధ్ర దశాదిశ మారుతుంది

0
49
'Bhogapuram' will transform the future and direction of North Andhra.
'Bhogapuram' will transform the future and direction of North Andhra.

. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధాని
. అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకోవడం ఉత్తరాంధ్ర సత్తాకు నిదర్శనం
. 2027 నాటికి పోలవరం,అమరావతి ఫస్ట్ ఫేజ్ పనులు పూర్తి చేస్తాం
. ప్రధాని మోదీని రోల్ మోడల్‌గా తీసుకున్నా: సీఎం

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన ‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని’ భారత ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల క్రమంలో జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని గుర్తు చేసిన సీఎం, కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వం, సహకారంతోనే రికార్డు సమయంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేయగలిగామని స్పష్టం చేశారు.

సముద్రంలో ఎగిరే ‘ఫ్లయింగ్ ఫిష్’ రూపంలో, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలుగుదనం ఉట్టిపడేలా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పేరు పెట్టుకున్నామని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల సత్తాకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత దశాదిశ పూర్తిగా మారిపోతుందని, వేలాది మంది యువతకు కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గి, ఇతర ప్రాంతాల నుంచే ప్రజలు ఇక్కడికి ఉపాధి కోసం వచ్చే రోజులు వస్తాయని పేర్కొన్నారు.

గడచిన రెండేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో 150కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించామని, ఇవన్నీ పూర్తయితే దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదే వేగంతో రాష్ట్రంలో మిగిలిన కీలక ప్రాజెక్టులను కూడా పరుగులు తీర్పిస్తామని చెప్పారు. 2027 నాటికి ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుతో పాటు రాజధాని అమరావతి మొదటి విడత నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, వాటిని కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని సభాముఖంగా స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సమర్థులైన నాయకుల కోసం వెతుక్కునే పరిస్థితి ఉంటే, భారతదేశంలో గత 25 ఏళ్లుగా ప్రధాని మోదీ ఒక బలమైన నాయకుడిగా సేవలు అందిస్తూ ప్రజాస్వామ్య ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడిగా నిలిచారని సీఎం కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీ వంటి నాయకుడు మరొకరు లేరని, అందుకే ఆయనను తాను ఒక ‘రోల్ మోడల్’గా తీసుకున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారతదేశ రూపురేఖలను మార్చే ‘2047 విజన్’ సాధించాలంటే ప్రధాని మోడీ నాయకత్వం అత్యంత అవసరమని పేర్కొనడంతో, సభకు హాజరైన ప్రజలంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.