విశాఖపట్నం : దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని కొందరు అనకూడని మాటలు అంటుంటే నాకు ఎంతో దుఃఖం వేస్తోంది. రాత్రింబవళ్లు కష్టపడే నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్, ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. తన్ను తిట్టిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించిన వ్యక్తి మోదీ అని, ఆయన సంస్కారానికి, ఉదారతకు జోహార్లు అర్పిస్తూ మోదీ పాదాలకు నమస్కరిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారాన్ని నేర్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని నడిపించడం అనేది ఒక బృహత్కార్యమని, అది సామాన్యమైన విషయం కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న ఈ పని ‘రామకార్యం’ లాంటిదని కొనియాడారు. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానికి మనం తిరిగి ఏమి ఇవ్వగలమని ప్రశ్నించారు. “పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు పడతాయి” అన్న చందంగా, అహర్నిశలు పనిచేస్తున్న మోడీపైనే కొందరు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
నరేంద్ర మోడీ నాయకత్వంపై పవన్ కళ్యాణ్ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “ప్రధాని మోదీ స్వయంగా తనంతట తానే అధికారం వద్దు అని అనుకునే వరకు, ఈ దేశ పరిపాలనా పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉండాలి. అందుకు మేమంతా శాయశక్తులా కృషి చేస్తాం,” అని స్పష్టం చేశారు. వర్తమాన భారతదేశంలో మోడీని మించిన మహానాయకుడు మరొకరు లేరని ఉద్ఘాటించారు. దేశ ప్రయోజనాల కోసమే ఏపీలో కూటమి ఏర్పాటు కోసం తాను ఎంతో తపన పడ్డానని గుర్తుచేశారు. దేశం కోసం నిలబడే నాయకుడికి అండగా ఉంటే ఎలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందో ఈ భోగాపురం ఎయిర్‌పోర్టే ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
ప్రధాని మోదీ దేశాన్ని ‘వికసిత్ భారత్’ దిశగా వేగంగా నడిపిస్తున్నారని, 140 కోట్ల భారతీయ ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న ఏకైక నేత ఆయనేనని పవన్ కళ్యాణ్ కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు “తెలుగు జాతి ఎవరికీ తలవంచదు” అని గర్జించిన వీరభూమి ఇది అని స్మరించుకున్నారు. అల్లూరి పేరుతో సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.





