. ఢిల్లీలో దద్దరిల్లిన యువత
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో మునుపెన్నడూ లేని విధంగా ‘జెన్ జీ’ యువత చేపట్టిన ఆందోళనల దెబ్బకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన సమకాలీన రాజకీయాలు, సోషల్ మీడియా పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఎవరితో పెట్టుకోకూడదో ఆ పిల్లలతోనే పెట్టుకున్నారని, యువతరం కదం తొక్కితే ప్రభుత్వానికే కాకుండా మీడియాకు కూడా బల్బులు ఎగిరిపోయాయన్నారు.ఢిల్లీలో జరిగిన ఈ పోరాటం ‘వాట్సాప్ అంకుల్స్’కు, ‘ఇన్‌స్టాగ్రామ్ పిల్లల’కు మధ్య జరిగిందని, ఇందులో ఎవరు గెలిచారో యావత్ దేశం చూసిందని కేటీఆర్ అన్నారు. నేటి యువతకు దేశం మీద పట్టింపు లేదని తమ వయసు వారు అనుకుంటారని, కానీ అది నిజం కాదని మొన్నటి ఉద్యమంతో తేలిపోయిందన్నారు. ఈ జెన్ జీ పిల్లలు సీబీఐ, ఈడీలకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. మెయిన్‌స్ట్రీమ్ మీడియా పట్టించుకోని ఆందోళనలతో, ‘నాన్-బయోలాజికల్’ అని చెప్పుకునే వారి మెడలు వంచారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షాలుగా తాము చేయాల్సిన పనిని దేశ యువత చేసి చూపించి మార్గదర్శకంగా నిలిచిందని ప్రశంసించారు.సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) స్వేచ్ఛపై కూడా కేటీఆర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. సోషల్ మీడియాకు హద్దులు ఉండాలని కొందరు అంటున్నారని, అయితే ఆ పరిమితులు విధించేది ప్రభుత్వాలా అని ఆయన ప్రశ్నించారు. స్వేచ్ఛకు హద్దులు పెడితే అది వాక్ స్వాతంత్ర్యం ఎలా అవుతుందని, అలాగని స్వేచ్ఛ అంటే బూతులు మాట్లాడటం కాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాలలో చలనం వచ్చేది కాదన్నారు. ప్రభుత్వాలు మీడియాను మేనేజ్ చేయడం ద్వారా ప్రజల్లో నెరేటివ్ సెట్ చేయవచ్చని భావిస్తున్నాయని ఆయన విమర్శించారు.రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కేటీఆర్ తప్పుబట్టారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి మాట్లాడితే, అదే కార్యక్రమంలో ఉన్న తాను ఆ మాటలను సమర్థిస్తూ మాట్లాడానని గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ‘మా రక్తం కావాలంటూ’ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ భాషను విమర్శించడం మాని, రేవంత్ రెడ్డి తన భాషను అదుపులో పెట్టుకునేలా చూడాలని ఇదే కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు.





