దర్శక-నిర్మాత, కథానాయకుడు ఎన్.ఎన్.ఆర్. చౌదరి నేతృత్వంలో రూపొందుతున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను నా లల్లీ’. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కార్యాలయంలో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత వైభవంగా ‘నేను నా లల్లీ’ ఆడియో విడుదల జరిగింది. బిగ్ సీడీని లాంఛ్ చేసిన దర్శకుడు రాజవన్నెం రెడ్డి మాట్లాడుతూ.. నేను నా లల్లీ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పాటలు చాలా బావున్నాయి. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలగజేసింది. హీరో ఎన్.ఎన్.ఆర్. చౌదరి ఈ సినిమా ద్వారా బాలయ్య బాబుని మరోసారి గుర్తు చేస్తారు. చక్కటి నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయం. సినిమా యూనిట్ కి అభినందనలు అన్నారు.
నటుడు అదిరే అభి మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ చూశాను. అదిరిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది. సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు.
విజన్ వి.వి.కె హౌసింగ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సీఎండి వి. విజయకుమార్ మాట్లాడుతూ.. ‘నేను నా లల్లీ’ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఎంతగానో ప్రశంసల వర్షం కురిపించారు. చిత్రం అందర్నీ అలరించే విధంగా రూపుదిద్దుకుంది. హీరో చౌదరి చక్కటి నటనతో అలరించి ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. సినిమా తప్పకూండా మంచి విజయాన్ని అందుకుంటుందన్న గట్టి నమ్మకం నాకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
వి. మహాలక్ష్మి మాట్లాడుతూ ..సినిమా ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కింది. దర్శక-నిర్మాత, కథానాయకుడు ఎన్.ఎన్.ఆర్. చౌదరి నేతృత్వంలో రూపొందుతున్న సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేను నా లల్లీ’ ఘాన విజయాన్ని సాధించాలని యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ వేడుక అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎదర్శక-నిర్మాత, కథానాయకుడు ఎన్.ఎన్.ఆర్. చౌదరి మాట్లాడుతూ.. ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా, ఇంత స్వచ్ఛంగా, నీట్‌గా వచ్చిన ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఇదని, ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించినట్లు ఆయన తెలిపారు. వారి ప్రశంసలు తమకు ఎంతో ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, బాధ్యతను కూడా పెంచాయని అన్నారు. ఈ చిత్రానికి ఒకేసారి దర్శకుడిగా, నిర్మాతగా, కథానాయకుడిగా బాధ్యతలు నిర్వహించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఒక దర్శకుడిగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంతో తృప్తిని ఇస్తోందని చెప్పారు. సినిమా ట్రైలర్ 1 మిలియన్ వ్యూస్ సాధించడం చాలా తృప్తినిచ్చిందని పేర్కొన్నారు. సినిమా ఇంత అద్భుతంగా రావడానికి 24 శాఖలకు చెందిన ప్రతి ఒక్కరి కృషి ఎంతో ఉందని చౌదరి కొనియాడారు. ముఖ్యంగా కో-డైరెక్టర్, డైలాగ్ రైటర్ శ్రీధర్, డీవోపీ శ్రీనివాసచారి, డ్యాన్స్ మాస్టర్ కపిల్, ఫైట్ మాస్టర్ తూఫాన్ మాస్టర్, ఎడిటర్ కృష్ణ, డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజు, మిక్సింగ్ ఇంజనీర్ పద్మారావు, మేకప్ సాంబశివరావులతో పాటు అద్భుతమైన పాటలను అందించిన సంగీత దర్శకుడు ఎం.ఎల్. రాజా, ప్రాణం పోసే నేపథ్య సంగీతాన్ని అందించిన సీఎం ఆదిత్యలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి కుటుంబం కలిసి చూసి మెచ్చుకునేలా ఉండే ఈ ‘నేను నా లల్లీ’ చిత్రాన్ని అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్.ఎన్.ఆర్. చౌదరి ప్రకటించారు.
హీరోయిన్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
ఈ చిత్రంలో హీరోగా ఎన్ఎన్ఆర్ చౌదరి, హీరోయిన్‍గా తస్లీమ్ నటించగా, సీనియర్ నటులు హేమసుందర్, పద్మ జయంతి, పద్మ రెడ్డి, గిరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఎడిటర్ – కృష్ణ. వి, సంగీతాన్ని ఎం.ఎస్. రాజా అందించారు. డీఓపీగా శ్రీనివాసా చార్య, ఫైట్ మాస్టర్‍గా తుఫాన్, డ్యాన్స్ మాస్టర్ గా పిల్, ఆర్ట్ డైరెక్టర్ గా నాని పాండు పనిచేయగా, బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ ని పి.ఎస్. ఆదిత్య అందించారు. ఈ చిత్రానికి పీఆర్ఓ: బాబునాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ & డైరెక్టర్ ఎన్.ఎన్.ఆర్. చౌదరి.







