పాకిస్తాన్ లో ‘స్మార్ట్ లాక్ డౌన్’

0
20
'Smart lockdown' in Pakistan
'Smart lockdown' in Pakistan

ఇరాన్-అమెరికా వివాదంతో ప్రపంచమంతా చమురు భూతం కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలంగా కుదిపేస్తోంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో చమురు సరఫరా నిలిచిపోవడంతో, ఇప్పటికే ఆర్థికంగా చితికిపోవడంతో పూర్తిగా చేతులెత్తేసి దేశవ్యాప్తంగా అత్యవసర లాక్ డౌన్ ను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు పాకిస్తాన్ ను పట్టి పీడిస్తున్నాయి. ఇరాన్ వర్సెస్ అమెరికా,ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు హర్మూజ్ జలసంధి మూతపడటంతో ఇంధన దిగుమతులు నిలిచిపోయాయి. పాకిస్తాన్ లో పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లేక దేశం అంధకారంలోకి జారుకుంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా “స్మార్ట్ లాక్ డౌన్” విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచే ఈ కఠిన నిబంధనలు అమలులోకి వచ్చాయి. పాకిస్తాన్ లోని పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ , రాజధాని ఇస్లామాబాద్‌తో సహా అన్ని ప్రధాన నగరాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వాణిజ్య కేంద్రాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలి. హోటళ్లు, రెస్టారెంట్లు ,వివాహ వేడుకలకు కేవలం రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. విద్యుత్తును ఆదా చేయడం పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం మెడికల్ షాపులు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి కేవలం 4 రోజుల పనిదినాలను మాత్రమే ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. భారత్, నేపాల్ వంటి పొరుగు దేశాలు ముందస్తు జాగ్రత్తలతో ఇంధన నిల్వలను సమకూర్చుకున్నప్పటికీ, తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరతతో ఉన్న పాకిస్తాన్ ఈ సంక్షోభాన్ని తట్టుకోలేకపోయింది. ఇంధన కొరత కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో, గిల్గిత్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో ప్రజల కష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం నెల రోజుల పాటు ఉచిత ప్రజా రవాణాను ప్రకటించింది. ఇందుకు అయ్యే భారీ వ్యయం ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఖజానాపై మరింత భారాన్ని పెంచనుంది. యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేత అనేది కేవలం పాకిస్తాన్ కే పరిమితం కాకుండా ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనలోకి నెట్టింది. ఇంధన సరఫరా పునరుద్ధరించబడే వరకు పాకిస్తాన్ వంటి బలహీన ఆర్థిక దేశాలు ‘చీకటి రోజులను’ అనుభవించక తప్పని పరిస్థితి నెలకొంది. చమురు బావుల పై దాడులు, రవాణా మార్గాల దిగ్బంధం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగి సామాన్యుడి బతుకు భారంగా మారనుంది.