ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. గుజరాత్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు.. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే (18 ఓవర్లలోనే) 5 వికెట్లు కోల్పోయి ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు జట్టు బ్యాటర్లలో కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి చేజింగ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో కేవలం ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చిన కోహ్లీ.. 75 పరుగులతో చెలరేగిపోయి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 2 వికెట్లతో రాణించగా.. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టినప్పటికీ బెంగళూరు జట్టును నిలువరించలేకపోయారు. ఈ బ్యాక్-టు-బ్యాక్ టైటిల్ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల సంబరాలు మిన్నంటాయి.





