ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై డిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (38 బంతుల్లో 63) ధాటిగా ఆడి మంచి పునాది వేసినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో ఆర్సీబీ భారీ స్కోరు చేయలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసి బెంగళూరును కట్టడి చేశారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. కేఎల్ రాహుల్ (57), ట్రిస్టన్ స్టబ్స్ (60 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధ సెంచరీలతో లక్ష్యం వైపు సాగింది. అయితే చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 15 పరుగులు అవసరమైన వేళ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. రొమారియో షెఫర్డ్ వేసిన ఆ ఓవర్లో డేవిడ్ మిల్లర్ (22 నాటౌట్) వరుసగా రెండు సిక్సర్లు, ఒక ఫోరు బాది ఒక్క బంతి మిగిలి ఉండగానే ఢిల్లీని విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో ఢిల్లీ తన మూడో విజయాన్ని నమోదు చేసుకోగా, బెంగళూరుకు ఇది రెండో ఓటమి.





