జాతీయం: విద్యావ్యవస్థ ప్రక్షాళన కోసం జైలుకైనా సిద్ధం..

0
6
National: Ready to even go to jail to overhaul the education system...
National: Ready to even go to jail to overhaul the education system...


-బెంగళూరు నిరసనలో ప్రకాశ్ రాజ్, సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ డిప్కే

కేంద్ర విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస అవకతవకలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా ఆదివారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన ఈ ఆందోళనలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే సహా పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో జరిగిన తీవ్ర లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నిరసన సభలో నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, దేశ విద్యాశాఖ మంత్రిగా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఉంటే చూడాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై వాంగ్‌చుక్ స్పందిస్తూ.. కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దేశ భవిష్యత్తు కోసం తనలా ఆలోచించే వాడు కావాలని, అంతే తప్ప తనకు ఆ అధికార పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. దెబ్బతిన్న విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా యువత చేస్తున్న పోరాటానికి కేవలం అండగా నిలిచేందుకే తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే మాట్లాడుతూ, విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నందుకే తమను కొందరు ‘బొద్దింకలు’ అని పిలుస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, వ్యవస్థ ప్రక్షాళన కోసం అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని యువతకు పిలుపునిచ్చారు. బెంగళూరు కంటే ముందు ఉదయం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లోనూ సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ పోరాటం రాజకీయ అధికారం కోసం కాదని, కేవలం ప్రజల్లో అవగాహన పెంచి వారి హక్కులను కాపాడటానికేనని వాంగ్‌చుక్ హైదరాబాద్ సభలో స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీతో పాటు పూణే, లక్నో, అమృత్‌సర్ తదితర ప్రధాన నగరాల్లోనూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. విద్యావ్యవస్థలో మార్పు వచ్చే వరకు తమ పోరాటం ఆగేది లేదని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here