అంతర్జాతీయం: పాక్ అణు గుట్టుపై సిప్రి నివేదిక

0
77
International: SIPRI report on Pakistan's nuclear secrets
International: SIPRI report on Pakistan's nuclear secrets

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడులతో పాకిస్తాన్ అణు అహంకారం పూర్తిగా బద్దలైంది. స్వీడన్‌కు చెందిన ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (సిప్రి) తన తాజా నివేదికలో ఈ ఆపరేషన్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించింది. భారత్ అత్యంత వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అణు భద్రతా కవచాన్ని ముక్కలు చేసిందని సిప్రి స్పష్టం చేసింది. పాక్ అణ్వాయుధ వ్యవస్థతో ముడిపడి ఉన్న నిర్దేశిత వైమానిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలను భారత బలగాలు విజయవంతంగా ధ్వంసం చేశాయని పేర్కొంది. ఇందులో భాగంగా పాక్ ప్రధాన అణు కమాండ్, నియంత్రణ కేంద్రంగా పనిచేసే వ్యూహాత్మక ‘నూర్ ఖాన్’ ఎయిర్ బేస్ భారత దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ప్రతిసారీ అణ్వాయుధాలు ఉన్నాయంటూ బెదిరింపులకు దిగే పాక్‌కు భారత్ ఈ ఆపరేషన్ ద్వారా గట్టి బుద్ధి చెప్పింది. ఈ దాడుల్లో పాక్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలతో పాటు.. ఆ దేశ వ్యూహాత్మక అణు మౌలిక సదుపాయాలపై భారత్ నేరుగా విరుచుకుపడింది. ముఖ్యంగా పాక్ తన అణ్వాయుధాలను రహస్యంగా దాచి ఉంచే కిరాణా హిల్స్‌పై భారత్ దాడి చేసినట్లు అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ పొరుగుదేశపు అణు భయాలను పటాపంచలు చేసిందని ప్రకటించగా, ఇప్పుడు సిప్రి అంతర్జాతీయ నివేదిక కూడా అదే విషయాన్ని అధికారికంగా నిర్ధారించడం గమనార్హం. ఈ దాడులతో పశ్చిమ సరిహద్దుల్లో వ్యూహాత్మక సమతుల్యత పూర్తిగా మారిపోయింది.