పాక్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై : పాకిస్తాన్ కవ్వింపు చర్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుంటామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ‘ఒకవేళ భారత్‌పై కన్నెత్తి చూస్తే.. ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఊహించడం కూడా కష్టమే’అని ఘాటుగా హెచ్చరించారు. గత చరిత్రను గుర్తు చేస్తూ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 55 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిని అవలంభించడం వల్లే ఆ దేశం రెండుగా విడిపోయిందని గుర్తు చేశారు. 1971 యుద్ధంలో భారత సైన్యం అండతో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించిందన్నారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడికి దిగితే తాము కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటామని ఖవాజా ఆసిఫ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి. అనవసరమైన ప్రకటనలతో ఉద్రిక్తతలను పెంచవద్దని ఇస్లామాబాద్ పాలకులకు రాజ్ నాథ్ హితవు పలికారు. పాకిస్తాన్ తన పరిమితులను తెలుసుకుని మెలగాలన్నారు. బెంగాల్ వంటి సున్నితమైన ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేనిపక్షంలో 1971 కంటే ఘోరమైన పరాభవం ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.





