టారిఫ్‌లతోనే భారత్-పాక్ యుద్ధం ఆపా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

0
50
Tariffs averted an India-Pakistan war: US President Donald Trump
Tariffs averted an India-Pakistan war: US President Donald Trump

టారిఫ్‌ల బెదిరింపులతోనే భారత్ – పాకిస్తాన్ దేశాల యుద్ధాన్ని విరమించుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఈ వాదనను భారత్ ఇప్పటికే పలుమార్లు ఖండించిన విషయం తెలిసిందే. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే స్వయంగా జోక్యం చేసుకుని నిలిపివేశానంటూ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాంప్ డేవిడ్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.

టారిఫ్‌ల అస్త్రం: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో రెండు దేశాలపై 250 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఆ బెదిరింపులతోనే మరుసటి రోజు భారత్ పాకిస్తాన్ దేశాలు తమ మధ్య యుద్ధం ఉండదని ఫోన్ చేసి చెప్పాయని ట్రంప్ తెలిపారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య పెద్ద యుద్ధాన్ని అడ్డుకోవడం ద్వారా దాదాపు ఐదు కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు ఫోన్ చేసి చెప్పారని ట్రంప్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి మూడో దేశ జోక్యం లేదని భారత్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ మాట తప్పుతోంది : ఇరాన్‌తో అమెరికా చర్చలు జరుపుతున్నప్పటికీ ఆ దేశంపై తమకు నమ్మకం సడలుతోందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ నాయకులు తరచూ అబద్ధాలు ఆడుతూ, ఇచ్చిన హామీలను ఉల్లంఘిస్తున్నారని, అయినప్పటికీ అమెరికా ప్రతినిధులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై అమెరికా చేపట్టిన చర్యలు తనను రక్షించుకోవడానికి కాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇతర అధికారులను లక్ష్యంగా చేసుకుని ఐసీసీ చేపడుతున్న చర్యలను అడ్డుకోవడానికే ఈ ప్రచారమని ఆయన చెప్పారు.

ఉక్రెయిన్‌కు పేట్రియట్ క్షిపణులు: ఉక్రెయిన్‌కు అత్యాధునిక పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల తయారీ లైసెన్స్ ఇవ్వడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని, తమకు కావాల్సింది శాంతేనని ఆయన పునరుద్ఘాటించారు.