హైదరాబాద్, ఆగస్టు 2: ఓ బైక్ యాక్సిడెంట్ లో ఇద్దరు వ్యక్తులు గాయాల పాలైతే వారిని రోడ్డుపై వెళుతున్న పోలీస్ అధికారిణి ఎన్ . హిమబిందు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శనివారం రాత్రి నారపల్లి సదాతలిగూడ నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద జరిగిన యాక్సిడెంట్ లో రోడ్డుపై నడచి వెళుతున్న వ్యవసాయకూలీ ఎల్ల మంకయ్య (42)ను ప్రతాప సింగారంకు చెందిన డి.ముత్తయ్య (65) బైక్ ఢీ కొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయాలపాలయ్యారు. రోడ్డుపై పడిన క్షతగాత్రులను స్థానికులు ఎవరూ పట్టించుకోకపోవడంతో అవస్థలు పడుతున్న వారిని అదే సమయంలో డ్యూటీ ముగించుకొని ఇంటికి బైకుపై వెళుతున్న నాగోల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారిణి (రిసెప్సనిస్టు) ఎన్. హిమబిందు (WPC 12924) గాయాల పాలైన ఇద్దరిని చూసి వెంటనే ఒక ఆటోను పిలిచి కొర్రెముల ఎక్స్ రోడ్ వద్ద గల వర ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటనపై స్పందించి క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన పోలీస్ అధికారిణిని అక్కడి ప్రజలంతా మెచ్చుకున్నారు.







