అసెంబ్లీలో విద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలను నిరోధించేందుకు త్వరలోనే ప్రత్యేక చట్టం తీసుకువస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ‘హేట్ స్పీచ్, క్రైమ్ బిల్లు’పై ఏర్పాటైన సెలక్ట్ కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు దానం నాగేందర్, మధుసూదన్ రెడ్డి, యశస్విని రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కోవా లక్ష్మి, కూనంనేని సాంబశివరావు, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతిపాదిస్తున్న బిల్లు ప్రతిలను సభ్యులందరికీ అందించిన చైర్మన్ పొన్నం ప్రభాకర్, పలు కీలక అంశాలపై వారితో సమగ్రంగా చర్చించారు.తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. వారం రోజుల్లో సెలక్ట్ కమిటీ మరోసారి సమావేశమవుతుందని తెలిపారు. వచ్చే భేటీలో సభ్యులందరి నుంచి ప్రాథమిక సూచనలు, సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. శాసనసభలో సభ్యులు పరస్పరం గౌరవప్రదంగా నడుచుకునేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నిరోధించేందుకు పక్కా ప్రణాళికతో కమిటీ నివేదికను సిద్ధం చేస్తుందని వివరించారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ముగిసేలోపే ఈ నివేదికను సభకు సమర్పించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ చట్ట రూపకల్పన కోసం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు సమాజంలోని ప్రముఖులు, మేధావుల సలహాలు కూడా తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యక్తుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడేలా తమ కమిటీ నివేదిక ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఎవరి భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.





