జాతీయం : ఆజాద్ కశ్మీర్ పాక్‌లో భాగం కాదు : ఎంక్యూఎం

0
6
National: 'Azad Kashmir' is not part of Pakistan: MQM
National: 'Azad Kashmir' is not part of Pakistan: MQM

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అక్కడి స్థానిక ప్రజలపై పాకిస్తాన్ భద్రతా బలగాలు సాగిస్తున్న అణచివేత చర్యలపై ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (ఎంక్యూఎం) వ్యవస్థాపకుడు, లండన్ దేశ బహిష్కరణలో ఉన్న కీలక నేత అల్తాఫ్ హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఓకేలో పాక్ సైన్యం జరుపుతున్న దాడులను, బలప్రయోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ సైనిక చర్య ఇలాగే కొనసాగితే మిగిలి ఉన్న పాకిస్తాన్‌ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పీఓకేలోని రావాలాకోట్ సహా ఇతర ప్రాంతాల నుంచి అక్కడి స్థానికులు తనకు ఫోన్ చేసి, పాక్ మిలిటరీ చేస్తున్న దారుణాల గురించి వివరించారని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, కర్ఫ్యూలు విధించి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కశ్మీరీలపై పాక్ రేంజర్లు, ఫ్రాంటియర్ కార్స్ బలగాలు జరుపుతున్న దాడులను ఆయన ‘యజీది’ తరహా అణచివేతగా అభివర్ణించారు. వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా చూసుకున్నా ఆజాద్ జమ్మూ కశ్మీర్ అనేది పాకిస్తాన్‌లో భాగం కాదని అల్తాఫ్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతానికి ప్రత్యేక రాజ్యాంగ హోదా ఉన్నప్పటికీ ఇస్లామాబాద్ దానిని బలవంతంగా తన నియంత్రణలో పెట్టుకుందని మండిపడ్డారు. గత 80 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని, కశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు కేవలం కశ్మీరీలకే ఉందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన అన్యాయాలు, అణచివేతల వల్లే పాకిస్తాన్ ముక్కలై బంగ్లాదేశ్ ఏర్పడిందని, మళ్లీ పాత తప్పులను పునరావృతం చేయవద్దని హెచ్చరించారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’, ‘ధురంధర్.. ది రివేంజ్’ చిత్రాలలో అల్తాఫ్ హుస్సేన్ పాత్ర ఆధారంగా ‘జమీల్ జమాలి’ అనే పాత్రను సృష్టించి, అతడిని ఇండియాకు స్పైగా వ్యవహరించినట్లు చూపించడం గమనార్హం. ప్రస్తుతం అల్తాఫ్ హుస్సేన్ తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here