. మువ్వన్నెల వెలుగుల్లో తెలంగాణ
. రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన ఆవిర్భావ సంబరాలు
. ప్రగతి శపథం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ , అమిత్ షా
. కాంగ్రెస్ వైఫల్యాలపై ధ్వజమెత్తిన కేటీఆర్, బండి సంజయ్
. ఉప్పల్ భగాయత్‌లో భూ ఉద్యమం చేస్తామన్న కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పల్లెల నుంచి పట్నాల దాకా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.
ప్రగతి శపథం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రధాన వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని, తమది ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమానికి, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పథకాలను అమలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తాము పూర్తిగా విజయవంతమయ్యామని, రాబోయే రోజుల్లో ‘తెలంగాణ విజన్-2047’ లక్ష్యంగా ముందుకు సాగుతూ అన్నదాతలను ‘వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా’ తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీలకు ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇప్పటికే 67 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీ, టౌన్‌ప్లానింగ్, విద్యాశాఖల్లో మరిన్ని కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం పూట నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్ అందించడంతో పాటు, జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గత 13 నెలల్లో రూ. 22 వేల కోట్లతో 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు సీఎం వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీని కూడా విజయవంతంగా చేపట్టామని పేర్కొన్న ముఖ్యమంత్రి, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పోలీసు అధికారులకు ‘విశిష్టసేవా పురస్కారాలను’ ప్రదానం చేశారు.
పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ: ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి ప్రస్థానానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని వారు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరువురు అగ్రనేతలు సామాజిక మాధ్యమాల వేదికగా ‘తెలుగు’ భాషలోనే ట్వీట్ చేయడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశంలో తెలంగాణ ప్రజల సృజనాత్మకతను, వ్యాపార నైపుణ్యాలను ప్రత్యేకంగా కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన గొప్ప చరిత్రను, వైభవోపేతమైన సంస్కృతిని కలిగి ఉందని ప్రశంసించారు. వికసిత భారత్ అనే మన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ అభ్యుదయానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్తూ, రాష్ట్ర ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం రాష్ట్ర ప్రజలకు తెలుగులోనే శుభాకాంక్షలు పంచుకుంటూ.. దేశ గమనంలో తెలంగాణ పోషిస్తున్న పాత్రను గుర్తుచేశారు. విశిష్టమైన సంస్కృతి, అద్భుతమైన పారిశ్రామిక నైపుణ్యంతో దేశ ఆర్థిక, పారిశ్రామిక పురోగతిలో తెలంగాణ ఎంతో కీలకమైన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో మరిన్ని ప్రగతి శిఖరాలను అధిరోహిస్తూ, భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో మరింత గొప్పస్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంటూ ‘జై తెలంగాణ!’ అని తన సందేశాన్ని ముగించారు. దేశ అగ్రనేతలు ఇద్దరూ తమ అధికారిక సందేశాలను తెలంగాణ ప్రజల మాతృభాష అయిన తెలుగులో అందించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిర్మిస్తాం: డిప్యూటీ సీఎం
సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రకటించారు. అంబేద్కరిజం స్ఫూర్తితో ప్రతి పౌరుడికి ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు కోటి 15 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల ఉచిత బీమా రక్షణ కల్పించే “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని నూతనంగా తెచ్చామన్నారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం అమలు చేయనున్నామని, ఖమ్మం జిల్లాలో 1,187 స్కూళ్లలోని 61,065 మంది విద్యార్థులతో పాటు, 6,300 మంది ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించబోతున్నామని పేర్కొన్నారు.జిల్లాలో ఆరు గ్యారంటీల ప్రగతిని , మౌలిక వసతుల కల్పనను డిప్యూటీ సీఎం గణాంకాలతో వివరించారు. అభయహస్తం కింద జిల్లాలో కొత్తగా 59,448 రేషన్ కార్డులు జారీ చేసి 2.01 లక్షల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని, మహాలక్ష్మి పథకం కింద 2.45 లక్షల మందికి పైగా మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశామని, ఉచిత బస్సు ప్రయాణంతో జిల్లా మహిళలు రూ. 303.55 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి విడతలో 16,243 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటికే రూ. 441 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, రెండో విడత కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇళ్లు ఇస్తామన్నారు. గృహజ్యోతి కింద 2.50 లక్షల కుటుంబాలకు రూ. 236.60 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, నిరంతరాయ సరఫరా కోసం రూ. 145 కోట్లతో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 427 కిలోమీటర్ల రోడ్లను రూ. 1,230 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, మున్నేరు నదిపై రూ. 180 కోట్లతో ప్రతిష్టాత్మక తీగల వంతెన నిర్మాణం సాగుతోందని వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులను, అమరవీరుల కుటుంబాలను సత్కరించి, లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టిఎస్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు.
పుష్కర తెలంగాణ.. ముష్కరుల పాలు : మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల ప్రగతితో వెలిగిపోయిన పుష్కర తెలంగాణ… నేడు ముష్కరుల పాలైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆర్ ఒక ‘లివింగ్ లెజెండ్’ అని, ఎత్తిన జెండా దించనని, ఒకవేళ దించితే రాళ్లతో కొట్టి చంపమని నాడు ఉద్యమ క్షేత్రంలో శపథం చేసిన ఏకైక వీరుడు కేసీఆర్ మాత్రమేనని గుర్తుచేశారు. కొందరు అల్పులు ఇవాళ నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నెత్తురు పారిన నేలపై సాగు నీళ్లు పారించి, స్వరాష్ట్రంలో లక్షా 65 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్రంలో ప్రస్తుత పాలన అధ్వాన్నంగా మారిందని, దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుంటుంటే ఇక్కడ మాత్రం ఆ పార్టీ తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మారుస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులు సాగునీరు, సాయం కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దౌర్భాగ్య దుస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ గురువుకు గురుదక్షిణగా కృష్ణా, గోదావరి నదీ జలాల హక్కులను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్‌నగర్ వచ్చి నిరుద్యోగులకు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుబంధు రావడం లేదు కానీ, ఢిల్లీకి మాత్రం ‘రాహుల్ గాంధీ బంధు’ పేరిట నిధులు టింగ్ టింగ్ మంటూ వెళ్తున్నాయని ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఆయన మంత్రులు కానీ ప్రజల్లోకి వచ్చే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. తెలంగాణ తల్లి ఒడ్డాణం, కిరీటాన్ని ఈ ప్రభుత్వం దోచుకుపోతోందని ఆరోపించిన కేటీఆర్, 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ఆకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ప్రాంతాల పరంగా మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. ఎంతో ఘనమైన చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ.. భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని చంద్రబాబు కోరుకున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధిలో పరస్పరం పోటీ పడుతూ దేశంలోనే దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతి నగరాలు భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి తెలుగు కుటుంబానికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు దక్కాలని, అందరూ అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలని కాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘వికసిత్ భారత్-2047’ లక్ష్య సాధనలో మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి కీలక పాత్ర పోషించాలని, తద్వారా ప్రపంచ వేదికపై తెలుగువారి వైభవాన్ని, ప్రాభవాన్ని చాటిచెప్పాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదే : కేంద్రమంత్రి బండి సంజయ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర బీజేపీదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తే.. బీజేపీ మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిలబడి పార్లమెంట్‌లో సహకరించడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం బీజేపీ మొదటి నుంచి రాజీలేని పోరాటం చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాలన అంతా కలెక్షన్లు, కమీషన్ల మీదే నడుస్తోందని ఆరోపించారు. పాలన చేతకాక, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్న రేవంత్ సర్కార్‌పై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటపడి నిజమైన అభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా చూస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రూ. 8 లక్షల కోట్ల అప్పులు తీరాలన్నా, నిధులు సద్వినియోగం కావాలన్నా డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిధుల దారిమళ్లింపు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో పక్క రాష్ట్రాలను చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అవినీతి పాలన నడుస్తోందని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కేంద్రం నుంచి నిధులు తెచ్చి నిజాయితీగా పనిచేసే బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు.
డిమాండ్లు నెరవేర్చకపోతే భూ ఉద్యమం చేస్తాం : కవిత
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని రాబోయే ఆగస్టు 6వ తేదీన ఆయన జయంతి నాటికి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, స్వరాష్ట్ర కల సాకారమై 12 ఏళ్లు పూర్తవుతున్నా ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ విగ్రహం పెట్టకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ఒకవేళ రేవంత్‌రెడ్డి సర్కార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోతే, తమకు అనుమతి ఇస్తే తామే స్వయంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ వీరులను, నాయకుల సేవలను ఈ ప్రభుత్వం సముచితంగా స్మరించుకోవాలని, ఉద్యమకారులకు తగిన గౌరవం ఇస్తూ వారి స్ఫూర్తిని భావితరాలకు చేరవేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని ఆమె హితవు పలికారు.తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు జులై 2వ తేదీలోగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కవిత గడువు విధించారు. ఈ లోగా వారి డిమాండ్లు నెరవేర్చని పక్షంలో ఉప్పల్ భగాయత్ వేదికగా భారీ భూ ఉద్యమం చేపడతామని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే అక్కడ ‘వంటా-వార్పు’ కార్యక్రమానికి సైతం వెనుకాడబోమని ఆమె హెచ్చరించారు. అమరవీరుల త్యాగాలను విస్మరించవద్దని, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగానే రాష్ట్రంలో పాలన సాగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారి వారసత్వాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.





