మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఐఈఈ)లోని ప్లాట్ నెం.165లో ఉన్న అంబికా ఇండస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయన వ్యర్థాలు, విషపూరిత వాయువుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)కి స్థానిక నివాసి జి. శివ లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
పరిశ్రమ నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలు, దుర్వాసన వెదజల్లే విషవాయువుల ప్రభావంతో పరిసర ప్రాంత ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మవ్యాధులు, కంటి మంటలు, అలర్జీ సమస్యలతో బాధపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియల అనంతరం వెలువడే వ్యర్థాలను నిబంధనల మేరకు శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాత్రి వేళల్లో కాలుష్య ప్రభావం మరింత అధికంగా ఉండటంతో ప్రజలు ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు.
కాలుష్య ప్రభావంతో వందలాది కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని, భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నదా లేదా అన్న విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
అంబికా ఇండస్ట్రీస్‌లో తక్షణమే తనిఖీలు నిర్వహించి గాలి, నీటి నమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని, కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని జి. శివ టీజీపీసీబీ అధికారులను కోరారు. స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.






