క్యాన్సర్‌ను జయించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధీరవనిత చురుకంటి సుమతి ‘పునర్నవి’ స్ఫూర్తిదాయక డాక్యుమెంటరీని వీక్షించి అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

0
3
Churukanti Sumathi ‘Punarnavi’ – the courageous woman who conquered cancer and scaled the highest peaks.
Churukanti Sumathi ‘Punarnavi’ – the courageous woman who conquered cancer and scaled the highest peaks.

హైదరాబాద్, ఆగస్టు 25, 2026: క్యాన్సర్‌ను జయించి, ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా మలచుకొని జీవితంలో అత్యున్నత విజయాలను సాధించిన ధీరవనిత శ్రీమతి చురుకంటి సుమతి నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన స్ఫూర్తిదాయక డాక్యుమెంటరీ ‘పునర్నవి’ ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆగస్టు 25న, సుమతి గారి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి డాక్యుమెంటరీని వీక్షించారు. క్యాన్సర్‌ను జయించిన ఒక మహిళ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకొని అందాల పోటీల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు ఎదిగిన జీవన ప్రయాణాన్ని చిత్రరూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి స్ఫూర్తిదాయక చిత్రాలు క్యాన్సర్‌తో పోరాడుతున్న వారిలో కొత్త ఆశను, ధైర్యాన్ని నింపుతాయని ప్రశంసిస్తూ, నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్ గారిని అభినందించారు.

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో, సంతోష్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందిన ‘పునర్నవి’ కేవలం ఒక మహిళ విజయగాథ మాత్రమే కాదు. ప్రాణాంతక వ్యాధి ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా, సంకల్పాన్ని శక్తిగా మార్చుకుంటే జీవితం మళ్లీ వికసిస్తుందనే బలమైన సందేశాన్ని అందించే స్ఫూర్తిదాయక జీవన చిత్రణ.

క్యాన్సర్‌ను ఎదుర్కొని విజయవంతంగా జయించిన అనంతరం సుమతి గారు తన ప్రయాణాన్ని అక్కడితో ఆపలేదు. జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చుకుంటూ మిసెస్ ఇండియా, మిసెస్ తెలంగాణ వంటి వేదికలపై తన ప్రతిభను చాటారు. మరోవైపు షటిల్ బ్యాడ్మింటన్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

కొరియా, స్పెయిన్, కేరళ, గోవా తదితర ప్రాంతాల్లో జరిగిన క్రీడా పోటీల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి, భారత త్రివర్ణ పతాకాన్ని తన భుజాలపై గర్వంగా ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకప్పుడు క్యాన్సర్‌తో పోరాడిన మహిళే ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గౌరవాన్ని చాటడం ఆమె అసాధారణ ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలిచింది.

“క్యాన్సర్ జీవితం మీద పడిన చీకటి నీడ మాత్రమే… ఆత్మవిశ్వాసం వెలిగితే ఆ చీకటిని దాటి కొత్త ఉదయాన్ని చూడవచ్చు. భయాన్ని జయించి, సంకల్పంతో ముందుకు సాగితే క్యాన్సర్‌ను మాత్రమే కాదు, జీవితంలోని అత్యున్నత శిఖరాలను కూడా అధిరోహించవచ్చు” అనే మానవీయ, స్ఫూర్తిదాయక సందేశమే ‘పునర్నవి’ ప్రధాన కథాంశం.

సుమతి గారి జీవితంలోని బాధ, పోరాటం, మనోధైర్యం, పునరుత్థానం, అందాల వేదికలపై సాధించిన గుర్తింపు, క్రీడారంగంలో అందుకున్న విజయాలను భావోద్వేగభరితంగా ఈ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. ముఖ్యంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలు భయపడకుండా, సుమతి గారి జీవన ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనే సామాజిక సందేశాన్ని ఈ చిత్రం అందిస్తోంది.

ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్, ఎడిటింగ్ బిటావరం శ్రీమన్నారాయణ నిర్వహించారు. చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలను సారథి స్టూడియోస్‌లో పూర్తి చేశారు.

‘పునర్నవి’ డాక్యుమెంటరీని గోవా ఇండియన్ పనోరమా ఫిల్మ్ ఫెస్టివల్కు పంపించామని, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్, అవార్డుల పరిశీలనకు కూడా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత, దర్శకుడు డా. భీమగాని సుధాకర్ గౌడ్ తెలిపారు.

ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన మేధావులు, వైద్యులు, కళా-సినీ ప్రముఖులు డాక్యుమెంటరీని వీక్షించి ప్రశంసించారు. క్యాన్సర్‌ను జయించి జీవితాన్ని విజయాల వైపు మలచుకున్న సుమతి గారి జీవన ప్రస్థానాన్ని సమాజానికి స్ఫూర్తిగా నిలిచేలా చిత్రీకరించిన విధానాన్ని వారు అభినందించారు.

క్యాన్సర్ ఆమె అడుగులను ఆపలేకపోయింది…
కష్టాలు ఆమె సంకల్పాన్ని కూల్చలేకపోయాయి…
పోరాటమే ఆమెకు కొత్త ప్రాణం పోసింది…
విజయమే ఆమె జీవితానికి కొత్త చిరునామా అయింది…
ఆ పునర్జన్మలాంటి విజయ ప్రస్థానమే ‘పునర్నవి’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here