తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచ్ ఫోరం ఆవిర్భావం

0
11
Inception of the Telangana State Tribal Sarpanch Forum
Inception of the Telangana State Tribal Sarpanch Forum

రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా డా. భూక్య సంతోష్ నాయక్

హైదరాబాద్, ఆగస్టు 25: గిరిజన తండాలు, గూడాల సమగ్ర ప్రగతి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి, దానికి ఐదు వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గిరిజన సర్పంచ్‌లకు పూర్తి అధికారాలు, పరిపాలనా స్వేచ్ఛను కల్పించాలని గిరిజన సర్పంచ్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచ్ ఫోరం ఆవిర్భావ సదస్సులో ఆయన మాట్లాడుతూ..గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని..2018 పంచాయతీ చట్టం ముందు ఏ విధంగా అయితే సర్పంచులకు గ్రామాలపై పూర్తి అధికారం ఉందో ఆ విధంగా ఉండాలన్నారు. సర్పంచ్ నెలవారి వేతనం కనీసం 30 వేల రూపాయలకు పెంచాలి.. విధుల్లో మరణించిన సర్పంచ్ కు 50 లక్షల రూపాయలు కేటాయించాలని. ప్రతి తండా గ్రామపంచాయితీలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడంతో పాటు, గిరిజనులకు సబ్సిడీ నిధులు విడుదల చేసి, తండాల్లో ఇందిరమ్మ ఇల్లుని ప్రత్యేకంగా కేటాయించాలన్నారు. ప్రతి తండా గ్రామపంచాయితీకి ప్రైమరీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలి. జీవో నెంబర్.3ని పునరుద్ధరించాలి. తండాల్లో పాఠశాలను ప్రైవేట్ మాదిరిగా అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన కోరారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచాలి. గిరిజన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. గిరిజనులకు క్యాబినేట్ లో స్థానం కల్పించాలి. ఐటీడీఏ గిరిజన గ్రామాల్లో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రతి గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయించి సర్పంచులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. తండాల జనాభా ప్రాతిపదికన నేరుగా గ్రామ పంచాయతీలకే బడ్జెట్ నిధులు విడుదల చేయాలి. రాజ్యాంగబద్ధమైన హక్కుల ప్రకారం గిరిజన తండాలలో స్వయంపాలనను మరింత బలోపేతం చేయాలన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల (రోడ్లు, తాగునీరు, విద్యుత్) కల్పన కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న సర్పంచ్‌లకు అండగా నిలవడానికి ఒక ఉమ్మడి వేదికను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గిరిజన తండాలు , గూడాలలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై ఫోరం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తండాల స్థాయిలోనే గిరిజన హక్కులపై, రాజ్యాంగం కల్పించిన స్వయంపాలన అధికారాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి కనీస పనులను కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు చేయలేకపోతున్నారని.. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి సర్పంచ్‌లను ఆదుకోవడానికి ఫోరం వ్యూహాలు రచిస్తోందన్నారు. సర్పంచ్‌ల అధికారాలను అధికారులు కానీ, స్థానిక రాజకీయ నాయకులు కానీ తొక్కేయాలని చూస్తే వారికి న్యాయపరమైన అండగా నిలవడానికి ఫోరం తరఫున ఒక ‘లీగల్ సెల్’ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులు (రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు) సకాలంలో విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మా లక్ష్యమని అన్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని పెంచాలని, వారికి సామాజిక భద్రత కల్పించాలని ఉమ్మడి వేదిక ద్వారా డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది గిరిజన సర్పంచ్‌లను ఒకే నెట్‌వర్క్ లోకి తీసుకువచ్చి, ఏ ఒక్క సర్పంచ్‌కు సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా స్పందించే వ్యవస్థను నిర్మించడం జరుగుతుందన్నారు. తండాల అభివృద్ధి మనచేతుల్లోనే ఉంది. రాజ్యాంగపరమైన అధికారాలు, బడ్జెట్ సాధనకై మన పోరాటం జరుగుతుందని, సమస్యల పరిష్కారం కోసం మనమంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్ పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముందు తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచ్ ఫోరం లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిరంజీవి, రాంజీ నాయక్, లైలా పరమేష్, సునీత, బానోజీ సతీష్ కుమార్, సుధాకర్ నాయక్, కొర్ర రాజేందర్ నాయక్, మహేందర్, రాంసింగ్ నాయక్ తదితరులు మాట్లాడారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గిరిజన సర్పంచ్ ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా డా. భూక్య సంతోష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాంసింగ్ నాయక్, ఉపాధ్యక్షురాలుగా లైలా పరమేష్, ఉపాధ్యక్షులుగా మహేందర్ నాయక్, జనరల్ సెక్రెటరీలుగా శ్రీను నాయక్, కుమార్ నాయక్, రాష్ట్ర కార్యదర్శిగా కొత్తటి సంధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here