. 24కు చేరిన మృతుల సంఖ్య
. 21 మంది అధికారులు సస్పెండ్!
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పుణె కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. కల్తీ మద్యం సేవించి పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 21 మంది అధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది.
భీవండీ కేంద్రంగా నకిలీ మాఫియా
ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 22 మంది నిందితులను అరెస్ట్ చేశారు. భీవండీ కేంద్రంగానే ఈ నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్‌వర్క్ అంతా సాగుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. స్థానికంగా సాగుతున్న కల్తీ మద్యం మాఫియా కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించడంలో, వారిపై తక్షణ చర్యలు తీసుకోవడంలో స్థానిక పోలీసులు పూర్తిగా విఫలమవడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అందుకే అధికారులపై సస్పెన్షన్ వేటు పడిందని తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ మెరుపు దాడులు
ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో అప్రమత్తమైన ఎక్సైజ్ శాఖ మహారాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 4,480 లీటర్ల అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గల నకిలీ మద్యం తయారీ, నిల్వ కేంద్రాలను గుర్తించి తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు కల్తీ మద్యం మహమ్మారికి బలైపోయిన కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నకిలీ మద్యం విక్రేతలతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులందరినీ కఠినంగా శిక్షించాలంటూ బాధితుల బంధువులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కల్తీ మద్యం మాఫియాపై ఉక్కుపాదం మోపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.





