నాటి పాలకుల పాపమే నేటి కాశ్మీర్‌ హింస : ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహ్మరెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ….

0
26
Today's Kashmir violence is the fault of the previous rulers: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy....
Today's Kashmir violence is the fault of the previous rulers: Special interview with Uppal Assembly BJP spokesperson Ilitam Narasimha Reddy....

”దేశ విభజన తెచ్చి పెట్టిన చిచ్చు ఇంకా రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. మత ప్రాతిపదికన దేశాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్‌ పెద్దలు ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఆనాడు దేశాన్ని విభజించకుండా మహాత్ముడు కూడా అడ్డుకోలేక పోయాడు. కేవలం నెహ్రూకు ప్రధాని పదవి కావాలన్న పట్టుదలతో దేశం ముక్కలైనా ఫర్వాలేదన్న రీతిలో ఆనాడు వ్యవహరించారు. దాని ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నారని ఉప్పల్ అసెంబ్లీ బీజేపీ అధికార ప్రతినిధి ఇలిటం నరసింహారెడ్డి పేర్కొన్నారు. సరిగ్గా దేశ విభజన జరగక పోవడం, కాశ్మీర్‌ విషయంలో నాన్చివేత ధోరణి, 370 అధికరణ, యుద్దాల్లో ఓడిన పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం లాంటివన్నీ ఇవాళ మనకు గుదిబండగా మారాయి. ఆనాడే పటిష్టమైన విధానాలు అవలంబించి ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకుని, పక్కాగా విభజన ఒప్పందాలు చేసుకుని ఉంటే ఇవాళ పాక్‌ తీవ్రవాదం నుంచి ముప్పును ఎదుర్కొని ఉండేవారం కాదు. ఆనాటి పాలకులు దూరదృష్టి లోపం కారణంగా దేశం ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన నరనరాన దేశం కోసం… హిందూ ధర్మపరిరక్షణ కోసం అహర్నిశలు తపించే ఇలిటం నరసింహ్మరెడ్డితో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే…

విద్యార్థిదశలోనే చురుకుగా….

నాటి మెదక్ జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేటలో ఇలిటం రాజారెడ్డి-అండాలమ్మ దంపతులకు 1979 అక్టోబర్ 10న జన్మించిన ఇలిటం నరసింహ్మరెడ్డిది సాధారణ వ్యయసాయ కుటుంబమే. చిన్నప్పటినుంచే హిందూత్వ భావాలను పుణికిపుచ్చుకున్న ఆయన ఆర్.ఎస్.ఎస్ లో క్రీయాశీలకంగా శిక్షణ పొందారు. రావణకాష్ఠల రగులుతున్న తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్రను నిర్వహించారు. విద్యార్థిదశలోనే టీడీపీలో చేరి ఐదేళ్లపాటు తెలుగు యువత అధ్యక్షుడిగా .పనిచేశారు. అంతేకాదు.. కేసీఆర్ పల్లెబాట నుంచి బస్తీబాట పట్ల ఆకర్షితులై కూకట్ పల్లి ఇంచార్జీగానూ బాధ్యతలు చేపట్టి కేసీఆర్ మెప్పును పొందారు. ఆ సమయంలో ఎన్ని అవకాశాలొచ్చినా వదులుకున్నారు. స్వతహాగా హిందూత్వ భావాజాలం మదిలో కొట్టుమిట్టాడుతుండగా 2014లో బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దేశం కోసం..హిందూ ధర్మపరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నారు. ఆ పార్టీలో చేరి పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2015నుంచి స్వఛ్చ భారత్ కన్వీనర్ గా ఉప్పల్ అసెంబ్లీలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించి ఎందరో నాయకుల ప్రశంసలందుకున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఈటల రాజేందర్ విజయానికి ఎంతగానో కృషిచేశారు ఇలిటం నరసింహ్మరెడ్డి.

హిందువులనే లక్ష్యంగా చేసిన దాడి..

కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దయితే స్వాగతించాల్సిన కాంగ్రెస్‌ ఇతర పార్టీలు, ఎంఐఎం వంటి మతఛాందస పార్టీలు సంకుచిత రాజకీయాలు ప్రదర్శించాయి. ఇప్పటికీ ప్రదర్శిస్తున్నాయి. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసినా, మతమార్పిళ్లు చేసినా పట్టించుకోని కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఆర్టికల్‌ 370 గురించి చేసిన ప్రకటనలు ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్నాయని నరసింహ్మరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఉగ్రవాదులకు అండ దక్కుతుందంటే అది మన పార్టీలు అవంబిస్తున్న రాజకీయ వైఖరి అని చెప్పక తప్పదు. తాజాగా కాశ్మీర్‌లో నరమేథం అన్నది కేవలం… ఉగ్రదాడిగా చూడరాదు. పనిగట్టుకుని హిందువులనే లక్ష్యంగా చేసిన దాడి. ఇది ముస్లిం ఉగ్రవాదుల పనే అయినా…ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం దీనిని ఖండించాలి. ఇలాంటి మతఛాందసాన్ని ఒప్పుకోబోమని ఉగ్రవాదులకు సందేశం ఇవ్వాలి. అలా చేయకుంటే వారిని నిజాయితీ లేనివారుగా గుర్తించాలి. ముందుగా మనదేశంలో ఉన్న ముస్లిం పార్టీలు, ఎంఐఎం లాంటి పార్టీలు ఇందుకు బహిరంగా ప్రకటనలు చేసి ఉగ్రవాదుల దుశ్చర్యలను నిలదీయాలి. నిరసించాలి. పాలకపక్షంగా ఉన్న ఫరూక్‌ అబ్దుల్లా పార్టీ, మెహబూబా ముఫ్తీ పార్టీలు కూడా అసవరమైన నిరసన ప్రదర్శనలు చేయాలి. పాక్‌ తీరును ఎండగట్టాలి. కానీ పాక్‌ పాటపాడే వీరు అలా చేస్తారని అనుకోవడం భ్రమే అవుతుంది అని ఆయన తీవ్రంగా కలత చెందారు.

క్షమించరాని నేరం…

కశ్మీర్‌ భూమిపై మరోసారి భారతీయుల ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిని ఏ మాత్రం క్షమించరాని నేరంగా చూడాలి. కాశ్మీర్‌లోనే కాదు..దేశంలో ఉగ్రవాదుల చర్యలను ఉపేక్షించరాదు. శాంతి వచనాలు పలకుతూ పోతే వారికి బుద్ది రాదు అని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్‌ సందర్శించ డానికి వెళ్లిన పర్యాటకులు లక్ష్యంగా ముష్కర మూక జరిపిన దాడిని ఒక్క ఖండనతో వదిలిపెట్టరాదు. కొత్తగా పెళ్లయిన జంటలు ఆనందంగా కాలక్షేపం చేద్దామని వెళితే భర్త కాటికి చేరగా భార్య గూడు చెదరి కన్నీరు మున్నీరయ్యింది. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించిన తీరు ఉగ్రవాదుల రాక్షస కాండకు నిదర్శనంగా చూడాలి. కాందహార్‌ విమానం హైజాక్‌ చేసినప్పుడు కూడా ఇలాగే ఉగ్రమూకలు ఎందరినో పొట్టన పెట్టుకున్నారు. పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ’లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ’ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని స్పష్టమయ్యింది. కాల్పుల అనంతరం సవిూప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది వారికోసం గాలిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ దాడి వెనక పాకిస్థాన్‌ హస్తం ఉందన్నదానికి అనుమానాలు అక్కర్లేదు. మనదేశంలో ఏ దాడి జరిగినా దాని మూలాలు అక్కడే ఉంటున్నాయని ఆయన విమర్శించారు.

లష్కరే తోయిబాకు కొత్త ముసుగు…

పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ’ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (టీఆర్‌ఎఫ్‌)’ కొత్తగా ఏర్పాటైందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత ఈ సంస్థ ఏర్పడింది. తొలుత ఆన్‌లైన్‌లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించేది. ఆ తరువాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని భౌతిక గ్రూపుగా ఏర్పాటైంది. దీని వెనుక పాకిస్థాన్‌ హస్తం ఉందని నరసింహ్మరెడ్డి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐనే టీఆర్‌ఎఫ్‌ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా 2018లో నిషేధిత దేశాల జాబితాలో పాకిస్థాన్‌ను ఆర్థిక చర్యల టాస్క్‌ఫోర్స్‌ చేర్చింది. దీంతో పాక్‌ దిద్దుబాటు- చర్యల్లో భాగంగా టీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయించిందనన్న అనుమానాలు ఉన్నాయి. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎఫ్‌ దాడులకు దిగుతోంది. కశ్మీర్‌ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్‌ చేర్చింది. టీఆర్‌ఎఫ్‌ను సృష్టించింది షేక్‌ సజ్జాద్‌ గుల్‌ అలియాస్‌ షేక్‌ సజ్జాద్‌. అతడు కశ్మీరీ మిలిటెంటు-. శ్రీనగర్‌లో ప్రముఖ జర్నలిస్టు అయిన షుజాత్‌ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018 జూన్‌ 14వ తేదీన హతమార్చడానికి కుట్ర పన్నింది సజ్జాదే. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్‌ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్‌గా పని చేశాడు. టీఆర్‌ఎఫ్‌లో పనిచేసే వారిలో సాజిద్‌ జాట్‌, సలీం రెహ్మానీ ఉన్నారు. వీరిద్దరూ గతంలో లష్కరేలో పనిచేసిన వారే. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్‌ఎఫ్‌ లక్ష్‌యంగా చేసుకుంటుంది. ఆ సంస్థ దాడులు చేసిన వారిలో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు. 2020 ఏప్రిల్‌ 1న నియంత్రణ రేఖ వెంబడి కుప్వారాలోని కేరన్‌ సెక్టార్‌లో నాలుగు రోజులపాటు- ఎదురు కాల్పులు జరిగినప్పుడు తొలిసారిగా టీఆర్‌ఎఫ్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అక్టోబరు 30న దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో ముగ్గురు భాజపా కార్యకర్తలను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు హతమార్చారు. నవంబరు 26న శ్రీనగర్‌కు సవిూపంలోని లాయేపోరా ప్రాంతంలో 2 రాష్టీయ్ర్ర రైఫిల్స్‌పై దాడి చేసిన టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు దానిని చిత్రీకరించారు. ఇద్దరు సైనికులకు కాల్చి చంపారు. 2023 ఫిబ్రవరి 26న పుల్వామాలో సంజయ్‌ శర్మ అనే కశ్మీరీ పండిట్‌ను టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. 2024 అక్టోబరు 20న గండేర్‌బల్‌లోని సోన్‌మార్గ్‌లో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. తమ గురించి చర్చించుకోవాలని, తాము బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఈ ఉగ్రమూక పనిచేస్తోంది. తాజా మారణహోమం కూడా ఇందులో భాగమే అని ఆయన వివరించారు.

పాక్‌ ఎప్పుడూ పక్కలో బల్లెమే..

భారత్‌లో ఉగ్రదాడులు జరినప్పుడల్లా పాక్‌ బుకాయింపులతో కాలక్షేపం చేస్తుంది. తనకు సంబంధం లేదని చెబుతుంది. ఉగ్రవాదులకు మా దేశంలో స్థానం లేదని చెప్పడం కూడా అలవాటు చేసుకుందని.. ముంబై ఉగ్రదాడుల సమయంలోనూ ఇదే చెప్పింది. అలాగే అజ్మల్‌ కసబ్‌ గురించి వివరాలు చెప్పినా కసబ్‌ మా దేశస్థుడు కాదని బొంకింది. చివరకు కసబ్‌ పుట్టుపూర్వోత్తరాలు బయటపడ్డాక కూడా అదే పాట పాడింది. ఇప్పడు పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పేర్కొంది. మరి ఢిల్లీలోని పాక్‌ రాయబాబరి కార్యాలయంలో కేక్‌ సంబరాలపై ఆ దేశం స్పందించాల్సి ఉంది. ముష్కరులకు పాక్‌ పూర్తి మద్దతు ఇస్తోందన్న వాదనకు కేక్‌ వ్యవహారం పక్కా రుజువుగా నిలిచిందని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు. ఇవన్నీ మరచిపోయి బలూచిస్థాన్‌ ఘటనలను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది. మనం టెర్రరిస్టుల జాబితా సమర్పించినా, వారు పాక్‌లో తిష్టవేసుకుని వున్నా వారిని మాత్రం అప్పగించడం లేదు. హఫీజ్‌ సయీద్‌ లాంటి ఉగ్రవాదులను దాచిపెడుతోంది. వారికి పాలుపోసి పెంచుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే దాడి తరవాత పాక్‌ నాయకులు చేస్తున్న ప్రకటనలు ఆ దేశ కుత్సితాన్ని బయటపెడుతున్నాయి. దాడులను ఏనాడు పాక్‌ ఖండించడం లేదు. ఆధారాలు చూపితే చర్యలు తీసుకోవడం లేదు. సరికదా తాజాగా కూడా పాక్‌ నేతల ప్రకటనలు ఉగ్రవాదులకు ఊతమించ్చేలా, పాక్‌ అండదండలతో వ్యవహారం నడిచినట్లుగా కనిపిస్తోంది. నిజానికి మత ప్రాతిపదికన భారత్‌ను చీల్చుకుని ఏర్పడ్డ పాక్‌ పాలకులు ఏనాడూ నిజాయితీగా లేరు. భారత్‌ను వర్గశతృవుగా చూపించి పబ్బం గడుపుకోవడం, కాశ్మీర్‌ బూచి చూపి ప్రజలను వశపర్చుకోవడం తప్ప..ఆ దేశం సర్వ నాశనం అయినా వారికి పట్టింపు లేదు. ఇదంతా నాటి భారత పాలకులు చేసిన దుర్మార్గపు రాజకీయ క్రీనీడ కారణంగా మనకు సంక్రమించిన రావణకాష్టంగా చెప్పుకోవాలి. దీనికి ఎక్కడో ఓ చోట మందు పెట్టాలి. వ్రణం తీవ్రమయితే కాలు తీసేయాల్సిందే. పాక్‌ కాల్లూచేతులు విరిచేందుకు వెనకాడరాదు. ఇకపోతే పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల విషయంలో దాయాది పాక్‌ దేశ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. బయటకు మాత్రం పహల్గాం టెర్రరిస్ట్‌ దాడితో మాకు సంబంధం లేదని సుద్దాపూస మాటలు మాట్లాడి.. దాడిని ఖండించింది. కానీ పాక్‌ ఉప ప్రధాని వ్యాఖ్యలతో వారి నిజస్వరూపం బట్టబయలైంది. 28 మంది అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసిన నరరూప రాక్షసులను పాక్‌ డిప్యూటీ పీఎం ఇషాక్‌ దార్‌ స్వాతంత్య సమరయోధులతో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలతో పాక్‌ వక్రబుద్ధి ప్రపంచదేశాల ముందు మరోసారి తేటతెల్లమైంది. పహల్గాం ఘటనపై ఇషాక్‌ దార్‌ ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ జిల్లాలో దాడులు చేసిన వారు స్వాతంత్య సమరయోధులు అని అభివర్ణించారు. భారత్‌ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపైన కూడా తనకు తోచిన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో 240 మిలియన్ల మందికి సింధు నది నీరు అవసరం. విూరు ఆ ఒప్పందాన్ని ఆపలేరు. ఒకవేళ ఇండస్‌ ట్రీటీ- రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు సమానం అని హెచ్చరించారు.ఆ దేశం కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కొంటుందని అన్నారు. 28 మందిని మానవత్వం లేకుండా మట్టుబెట్టిన ఉగ్రవాదులను పాక్‌ ప్రధాని ఏకంగా స్వాతంత్ర సమరయోధులతో పోల్చడంపై భారత ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే పాక్‌ అసలైన బుద్ధి అని విమర్శిస్తు న్నారు. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపో షిస్తోంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. పర్యాటకులను మతం ఆధారంగా పరిశీలించి, అడిగి మరీ ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి.ముష్కరుల పాశవిక దాడిలో 26మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్‌ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను అణువణువునా శోధిస్తున్నారు. అందరూ నిరాయుధులు.. సామాన్యులు..తమను విడిచిపెట్టాలని బతిమలాడినా ఉగ్రమూకలు పట్టించుకోలేదు. తలకు తూపాకీ గురిపెట్టి అత్యంత కర్శశంగా వారిని కడతేర్చారంటే ఎంతటి మత దురహంకారులో అర్థం చేసుకోవాలి. . కశ్మీర్‌లోని బైసరన్‌ లోయలో జరిగిన ఈ దాడి వెనక లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా..ఉగ్రమూకలను అమాయకుల విూద ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిక ఉగ్రవాదుల బృందం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26 మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లు తోపాటు కశ్మీర్‌లో మద్దతుదారులు మరికొందరు పని చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. పాక్‌ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్‌ సయీద్‌, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎప్పుడైనా టెర్రరిస్టులు పాక్‌ నుంచే వస్తుంటారు. పాక్‌ నుంచే శిక్షణ పొందుతారు. పాక్‌ వారిని ఉసిగొల్పుతుంది. కనుక మనం తీసుకునే చర్యలు ప్రపంచం కూడా హర్షించేలా.. పాక్‌ నడ్డివిరిచేలా ఉండాలి. పాక్‌ ఇక జన్మలో కోలుకోకుండా చేయాలి. దెబ్బకొడితే జీవితాతంతం మరచిపోకుండా చేయాలి. అప్పుడే మనకు ఈ ఉగ్రదాడుల బెడద ఉండదు అని ఆయన అన్నారు.

మతం పేరుతో చంపేస్తుంటే చూస్తూఊరుకోవాలా ?

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉందని.. అధికారం రాష్ట్రం చేతిలోకి వెళ్లగానే ఊచకోత ఘటన జరిగింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులపై కనికరం చూపాల్సిన అవసరం లేదన్నారు నరసింహ్మరెడ్డి. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సందేనని, అందుకు ఎంతటి కఠినమైన చర్యనైనా తీసుకోవాల్సిందేనని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు. అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారు. ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని.. పహల్గామ్‌ ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయని తెలిపారు. షికారుకు వచ్చినట్లు- వచ్చి పర్యాటకులను వేటాడారని.. ఐడీ కార్డులు అడిగి హిందువా, ముస్లింవా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా అమాయకుల ప్రాణాలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దు భద్రత అత్యంత అవసరమన్నారు. నిరాయుధులతో యుద్ధం చేయకూడదని తెలిపారు. ఎంతో నమ్మకంతోనే కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారన్నారు. లక్షలాదిమంది కశ్మీరీ పండిట్లు వలస వెళ్లిపోయారని తెలిపారు. అప్పటి నుంచి కశ్మీర్‌ మండుతూనే ఉందన్నారు. కశ్మీర్‌ భారత్‌లో భాగమే.. ఎప్పటికీ అంతే అని స్పష్టం చేశారు. భారత్‌లో ఉంటూ కొందరు పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్‌పై ప్రేమ ఉన్నవారు ఆ దేశం వెళ్లిపోవచ్చని అన్నారు. మతం అడిగి చంపేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే నమ్మరెందుకని ప్రశ్నించారు. అతిమంచితనం కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కాల్చుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవాలా.. అతి సహనం కూడా ప్రమాదకరమన్నారు. పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించామని గుర్తుచేశారు. ఉగ్రవాదులను ఎదుర్కోవాలంటే ధైర్యంతో కూడుకున్న పని అని అన్నారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశమని.. ఇక్కడ కూడా హిందువులనే టార్గెట్‌ చేస్తే ఎక్కడికి పోవాలని అన్నారు. హత్య చేసి మోదీకి చెప్పుకోండి అన్నారని.. పర్యాటకులు చెబుతున్నారని తెలిపారు.

కుడితిలో పడ్డ ఎలుకలా కాంగ్రెస్‌ ..

కులగణనపై కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు. పహల్గాం సంఘటనకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ప్రతిస్పందించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా కేబినేట్‌ కులగణన నిర్ణయం తీసుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ఓ రకంగా కులగణనతో మోదీని ఇరుకున పెట్టాలని చూసిన రాహుల్‌ను గట్టి దెబ్బే కొట్టారని అనుకోవాలి. తెలంగాణ రోల్‌ మోడల్‌ అంటూ రాహుల్‌ ఎంతగా వగచినా…ఇక్కడ చేసిన కులగణనతో ఒరిగేదేమీ లేదు. కులగణన చేపట్టామని చెబుతున్న సిఎం రేవంత్‌ రెడ్డి ముందుగా సిఎం సీటును బిసిలకు ఇవ్వలేరు. ఇవ్వాలని రాహుల్‌ కూడా పట్టుబట్టలేరు. అలాగే కులగణన కావాలంటూ గొంతుచించుకుంటున్న రాహుల్‌ తమ కుటుంబంలోని మూడు పార్లమెంట్‌ సీట్లను ముగ్గురు బిసిలకు ఇవ్వలేరు. కేవలం రాజకీయ డ్రామాల కోసం ఏదో ఒక సమస్యను తెరపైకి తేవడం, వాదులాడడం, గొంతు చించుకోవడం తప్ప..నిజంగా పేదలకు మంచి చేయాలన్న ధృఢసంకల్పం కాంగ్రెస్ నాయకుల్లో కొరవడుతోంది. దళితులు, ఆదివాసీలు, బిసిల పేర్లు చెప్పి ఓట్లు దండుకునే యత్నం తప్ప మరోటి కాదు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మధ్యలో కొన్నేళ్లు తప్ప కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా..కులగణనపై నోరు మెదపలేదు. పదేళ్ల యూపిఎ పాలనలో కూడా రాహుల్‌కు ఈ ధ్యాస రాలేదు. మోదీ అధికారంలో రావడం…పాతుకు పోగానే రాజ్యాంగం, కులగణన గుర్తుకు వచ్చి ఊరూవాడా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

తెలంగాణలో అనేక సమస్యలు …

తెలంగాణలో అనేకానేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదు. ఎన్నికల ముందు ప్రస్తావించిన సమస్యలపై పట్టింపు లేదని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు. అవినీతిలో కెసిఆర్‌ మునిగాడని, పదిలక్షల కోట్లు సంపాదించారని పదేపదే పాటపాడుతున్న అధికార కాంగ్రెస్‌ అవినీతిని రుజువు చేయలేక చతికిల పడింది. అందుకే రాజకీయాల్లో ఎవరి ఎజెండాలు వారివే. వాటిని తిప్పికొట్టేందుకు సహజంగానే ఎత్తులు వేస్తుంటారు. కులగణనకు నెహ్రూ వ్యతిరేకమంటూ, రిజర్వేషన్లను రాజీవ్‌గాంధీ లోక్‌సభలోనే వ్యతిరేకిం చారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను ఇందిరాగాంధీయే తొక్కిపట్టారు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ కులగణన గురించి ఆలోచన చేయలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదన్న బిజెపి ప్రశ్నలకు కాంగ్రెస్‌ వద్ద సమాధానం లేదు. కాంగ్రెస్‌ తన విధానాలకు భిన్నంగా కులగణనను ప్రధాన రాజకీయ అజెండాగా మలచుకుని దానిచుట్టే కార్యాచరణను రూపొందించుకుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా, ఎంతో పకడ్బందీగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తిచేశామనీ, దీనికి తామే రోల్‌ మోడల్‌ అని రేవంత్‌రెడ్డి ఇప్పటికీ పదేపదే ప్రచారం చేస్తున్నారు. అందుకే బిజెపి ఓ రకంగా ఎత్తుకు పైఎత్తు వేసిందనే చెప్పాలి. కాంగ్రెస్‌ ఎక్కుపెట్టిన కులగణన అస్త్రంను దెబ్బతీసే ఆలోచనలో భాగంగానే బిజెపి జనగణన-కులగణను ఆమోదించింది. బిజెపిని తక్కువ అంచనా వేసిన రాహుల్‌ తను తీసుకున్న గోతిలో తానే పడ్డారు. బిజెపి ఇలా చేస్తుందని ఊహించవుండరు. కులగణనపై కాంగ్రెస్‌ రాజకీయంగా మరింత విజృంభించకుండా బీజేపీ పావులు కదిపిందని చెప్పాల్సిందేనన్నారు

తెలంగాణ కులగణనపైనా విమర్శలు..

కులంతో పాటు ఉద్యోగ, విద్య, ఆస్తుల వివరాలను పక్కాగా సేకరించి వాటిని బహిరంగపరిస్తే అసలు రంగు బయటపడుతుంది. ఒక్క కులంతోనే సరిపుచ్చకుండా సామాజికంగా వారి అర్థిక స్థిగతులను కూడా వెలికి తీస్తే మంచిది. అప్పుడు కుల జనాభాను బట్టి ఉద్యోగాలు, పదవులు ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న డిమాండ్‌కు అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే మారిన ప్రపంచ పరిస్థితుల్లో కులాల ఆధారంగా వారి ఆర్థిక సామాజిక పరిస్థితిని నిర్వచించలేని రోజులు ఇవి. కుల రిజర్వేషన్లు వచ్చినా అవి కేవలం..ప్రభుత్వ ఉద్యోగాలకూ, ప్రభుత్వ విద్యాసంస్థలకూ మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రైవేటు రంగానికి కూడా రిజర్వేషన్లను వర్తింపచేయాలనే డిమాండు ఉధృతమైనా ఆచరించడానికి ఆయా సంస్థలు సిద్దంగా లేవు. అలా చేస్తే వారు బిచాణా ఎత్తేస్తారు. నిజానికి కులాలకు ఎంతవరకూ రిజర్వేషన్లు ఉండాలన్న విషయంపై రాజకీయంగా ఇప్పటివరకూ ఏకాభిప్రాయం లేదు. కులజనాభాను బట్టి వాటాలు నిర్ణయించి, ఉద్యోగావకాశాలు ఇవ్వాలనే డిమాండ్‌ వస్తే..అది రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముందుగా రాజకీయంగా పదవులను ఇవ్వాలని కోరుతారు. సిఎంలు మొదలు మంత్రుల వరకు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారు చాపచుట్టేసి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. రాజకీయ రిజర్వేషన్లు లేకుండా మిగతా చోట్ల డిమాండ్‌ అన్నది సాధ్యం కాదు. అందుకే కేవలం కులాల లెక్కలు సేకరించడంతో పాటు, ఆర్థిక స్థితిగతులను కూడా పక్కాగా తేలిస్తేనే ఏయే కులాల్లో ఎంతమంది పేదలు ఉన్నారో తేలుతుంది. జనాభా సేకరణలో కులలెక్కలు చేపట్టడం మొదలయితే ఇక ప్రతిసారీ ఇది కొనసాగించాల్సి ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో పదేళ్లక్రితం వందకోట్లకు పైగా ఖర్చుపెట్టి చేసిన కులగణనపై ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. ఇప్పటికీ ఆ కుల నివేదికను బయటపెట్టలేక పోతున్నారు. కర్ణాటకలో రెండు ప్రధాన కులాలైన వక్కలిగలు, లింగాయతులు తమ జనాభాను తక్కువగా చూపించారని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. తెలంగాణ కులగణనపైనా విమర్శలు ఉన్నాయి. చాలాందిని లెక్కల్లోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కులగణన ద్వారా ఏం సాధిస్తారో కాంగ్రెస్‌ చెప్పగలగాలి. పార్టీపరంగా అమలుచేయగలగాలి. అప్పుడే డిమాండ్‌కు అర్థం ఉంటుంది. మొత్తంగా కులగణన చేపట్టాలన్న నిర్ణయంతో కాంగ్రెస్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యిందనే చెప్పాలి అని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు.

కెసిఆర్‌కు ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం ఉందా..?

రాజకీయాల్లో విమర్శలే కాదు..ఆత్మవిమర్శలూ అవసరం. ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగితేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుంది. ఎంతసేపు ఎదుటి పార్టీని తిడుతూ రాజకీయ పబ్బం గడపుకోవడం ద్వారా లక్ష్యం నెనరవేరదని నరసింహ్మరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో చేసిన పాపాలకు, వస్తున్న విమర్శలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలంగాణను అద్భుతంగా అభివృద్ది చేశామని చెబుతున్న బిఆర్‌ఎస్‌ నేతలు ఈ డబ్బాకొట్టుకునే విధానాన్ని మానుకోవాలి. ప్రధానంగా కాళేశ్వరం వల్ల లక్షకోట్లు గంగపాలయ్యాయి. అందులో కెసిఆర్‌ కుటుంబానికి ఎంత ముట్టిందనేది వారికి తెలుసు. అలాగే ధరణితో రైతులను, ప్రజలను ఆగం చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ, సామాన్యుల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. వేలాది ఎకరాలు అప్పనగా ఎందరికో కట్టబెట్టారు. ఎన్నో భూములను తెగనమ్మారు. మియాపూర్‌ భూములపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నయీం డైరీని మల్లన్నసాగర్‌లో కలిపేశారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ల పేరుతో పేదల భూములను, ఇళ్లను గుంజుకుని వారిని రోడ్డున పడేసి, కుక్కకు బొక్కేసినట్లు కొంత పడేశారు. వారు గౌరవంగా బతికేలా చేయలేదు. వారి ఉసురు తీసుకున్న తీరు ప్రజలందరికీ తెలుసు. లిక్కర్‌ బిజినెస్‌లో కవిత తలదూర్చి తెలంగాణ పరువు తీసారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తమ దొడ్లో కలుపుకున్నారు. ఇకపోతే తాహతుకు మించి అప్పులు చేసి, అభివృద్ది చేశాని నమ్మించి, బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణను చేశారు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్న పచ్చి నిజాలు. వీటికి సాక్ష్యాలు అక్కర్లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి దగుల్బాజీ పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేసారో గుర్తించాలి. ఇక అసెంబ్లీకి సైతం రాకుండా చట్టసభలను అవమానిస్తూ ఫాంహౌజుకే పరిమితం కావడం వెనకాల ఉన్న మతలబు ఏమిటో కూడా చెప్పాలి. అన్నింటి కంటే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం ఎట్లా అప్పుల పాలైందో కూడా తెలియజేయాలి. కనీసం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి ఎట్లా తన నాయకత్వంలో తీసుకెళ్లారో వివరించాలి. అంతేకాదు తెలంగాణ కోసం తమ విలువైన ప్రాణాలను బలిదానమిచ్చిన 1300 మంది అమరవీరుల కుటుంబాలకు ఏం చేశారో చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలోని ముఖ్యమైన లక్ష్యాల్లో ఒకటి ఉద్యోగాల భర్తీ. యూనివర్సిటీల్లో కనీసం ఒక్క కొలువునైనా ఎందుకు భర్తీ చేయలేకపోయారో చెప్పాలి. తమ జేబులు నింపడానికి, తమ కుటుంబ నేతల కడుపు నింపడానికి జరిగిన ప్రాజెక్టుల అవినీతి విూద వివరణ ఇవ్వాలి. బిఆర్‌ఎస్‌ ఉత్థాన పతనాలు గుణపాఠం కావాలి. బిఆర్‌ఎస్‌ తన ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. అనేక చీకటి కోణాలు.. . కుంభకోణాలకు కారణభూత మయ్యింది. నేలవిడిచి సాము చేసిందన్న చందంగా అసలు పాలన గాలికి వదిలి స్వార్థ రాజకీయాల కోసం చేయని తప్పు లేదు. ప్రజాసంఘాలు, కవులు, రచయితలు, కళాకారులు, విద్యావంతులు అంతా కలసి నడిపిస్తేనే టిఆర్‌ఎస్‌ నడిచింది. కానీ ఇదంతా తన ఒంటిచేతి చలవని, తానే అసలుసిసలు పోరాటాన్ని చేసానని కెసిఆర్‌ చెప్పడం మానుకోవాలి. తెలంగాణ యావత్తూ వెంటన నడిస్తేనే కెసిఆర్‌ పని సులభం అయ్యింది. మలిదశ ఉద్యమానికి అనేకమంది పునాదులు వేశారు. తెలంగాణ జనసభ వంటి సంఘాలు, మారోజు వీరన్న, గాదె ఇన్నయ్య, కొండా లక్ష్‌మణ్‌ బాపూజీ, కేశవరావు జాదవ్‌, పాశం యాదగిరి, కొల్లూరి చిరంజీవి, ప్రొ. జయశంకర్‌, ప్రొ. బియ్యాల జనార్ధన్‌, బెల్లి లలిత వంటి వ్యక్తులు తెలంగాణ ఆకాంక్షను కాపాడడానికి శక్తిమేరకు కృషి చేశారు. ఉద్యమానికి రాజకీయ ప్రతిపత్తి లభించడం అనేది రెండవసారి కేసీఆర్‌ రూపంలోనే లభించినా…. ప్రజల్లో రగులుకుంటున్న ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష అన్న ఉద్యమ వేడిని కేసీఆర్‌ ఉపయోగించుకున్నారు. ఇవన్నీ కూడా కాదనలేని సత్యాలు. ఇవన్నీ విస్మరించి గత పదేళ్ల అధికారంలో ఉన్న కాలంలో కెసిఆర్‌, ఆయన చంచాలు వీరందరినీ విస్మరించి తామే వీరులం, శూరులం అని ఉద్యమకారులను చులకన చేశారు. 2001లో జలవిహార్‌ వేదికగా రాజకీయ పార్టీకి అంకురార్పణ చేశాక అది ముందుకు నడిచిందంటే…ప్రజల అందడదండలతోనే అన్నది విస్మరించరాదు. కెసిఆర్‌ తన స్వార్థ రాజకీయాలకు తెలంగాణను వాడుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా జయశంకర్‌ సార్‌ లాంటి వారు కెసిఆర్‌ను నమ్మి నడిపించారు. మలిదశ ఉద్యమం ఊరూరికి విస్తరించి తెలంగాణ ఆకాంక్ష మరింత పదునెక్కగలిగిందంటే అందుకు..ప్రజల్లో ఉన్న ప్రత్యేక ఆకాంక్ష మాత్రమే. ఆ సమయంలో కెసిఆర్‌ ఉన్నా మరొకరు ఉన్నా తెలంగాణ ఉద్యమం ముందుకు సాగేది. అయితే ఉద్యమ గమ్యాన్ని ముద్దాడేలా చేసిన ప్రజలను విస్మరించి, స్వార్థచింతనతో పాలన సాగించడం వల్లనే ప్రజలు బిఆర్‌ఎస్‌ను దూరం పెట్టారు. దీనిపై కెసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణ కోసం గులాబీ జెండాను ప్రజలే నిలబెట్టారన్న విషయాన్ని విస్మరించి నేలవిడిచి సాము చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, జీవితాలు బాగుపడతాయని సబ్బండవర్గాలు ఆశించి భంగపడ్డాయి. ప్రజలంతా ఇంతటి అంకితభావంతో అండగా నిలిస్తే… కేసీఆర్‌ మాత్రం పక్కా రాజకీయ నేతగా ఆలోచించారు. తను, తన కుటుంబమే తెలంగాణ అని భావించారు. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ శక్తి అవసరం అన్న ఆలోచన నుండి కేసీఆర్‌ యూటర్న్‌ తీసుకోవడం తెలంగాణ రాకముందే మొదలైంది. దళితుణ్ణే ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి తప్పాడు. మాట తప్పడం అనేది అధికారంలోకి వచ్చాక నిత్యకృత్యంగా మారింది. తెలంగాణ పేగుబందాన్ని తెంపుకుని అధికారం కోసం జాతీయ రాజకీయాలంటూ కొత్త పోకడలకు పోయారు. ఉట్టికి ఎగలేనమ్మ..ఆకాశానికి ఎగిరిందన్న సామెత ను రుజువు చేశారు. తెలంగాణ అంతా బంగారం అయ్యిందన్న ప్రచారం మొదలు పెట్టారు. ధనిక రాష్ట్రం అన్నారు. రియల్‌ రంగంలో అడుగులు వేశారు. పార్టీ పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చుకొని దేశ రాజకీయాలవైపు అర్రులు చాచి, దారుణంగా విఫలమయ్యారు. ఇంత రాజకీయ దురాశ ఉంటే ప్రజలు మాత్రం వేరుగా ఎందుకు ఆలోచిస్తారు. అందుకే కర్రుకాల్చి వాతపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కకుండా చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింతగా వాతలు పెట్టారు. ఇవన్నీ ఆలోచన చేసుకుని ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏడాదిన్నర కాకుండానే కాంగ్రెస్‌ విూద అగ్గివిూద గుగ్గిలంలా లేస్తే..ప్రజలు గతాన్ని మరచి పోరు. తప్పిదానలు నెమరు వేసుకునే సమయమిది. అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ రాచరికపు పోకడలకు బీజం వేశారు. తనను కలవడమంటేనే…రాజును కలిసేంత అన్న తీరుతో వ్యవహరించారు. రాజును కలిసే డోర్లు మూసుకు పోయాయి. సిఎంను కలవాల్సిన పనేముందని యువరాజు ఆక్షేపించారు. ఉద్యమం ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ తన జాగీరు అన్నట్లుగా నిరంకుశ పోకడలకు పోయి ఇవాళ నీతుల చెబితే వినడానికి ప్రజలు సిద్దంగా లేరు. దేశంలో మోదీ ప్రభుత్వం ప్రజాభిమానాన్ని మెండుగా చూరగొంటున్నది. దేశానికి మోదీ రక్షణగా ఉన్నారు. ఇక తెలంగాణాలో వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వమే. ఆ మంచి తరుణం కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కు శ్రీరామరక్ష బీజేపీ నాయకత్వమే.. అంటూ తన సుదీర్ఘ ఇంటర్వ్యూని ముగించారు ఇలిటం నరసింహ్మరెడ్డి.