పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌
కంటిమీద కునుకులేకుండా పోలవరం విలీన గ్రామాల ప్రజలు
ఇప్పటికే పలువురు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన వైనం
ప్రజాశక్తి-యంత్రాంగం : భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. అనేక చోట్ల రోడ్లకు గండ్లు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం విలీన ప్రాంతాల్లో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అల్లూరి జిల్లా చింతూరు వద్ద శబరి నది 22 అడుగులకు చేరింది. చింతూరు మండలంలోని సోకిలేరు, చీకటి వాగు, చంద్రవంక వాగు, కొయ్యూరు వాగులు పొంగడంతో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొయగురు వాగు వరద ధాటికి 362 నెంబరు రహదారి కోతకు గురైంది. దీంతో, ఆంధ్రా-ఒడిశాల మధ్య రవాణా స్తంభించింది. రాజవొమ్మంగి, మారేడుమిల్లి, ఎటపాక, జికె.వీధి మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

గుట్టలపై తాత్కాలిక నివాసాలు
అల్లూరి జిల్లా విఆర్‌.పురం మండలం గోదావరి పరివాహక గ్రామాలైన తుమ్మలేరు పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాలు, శ్రీరామగిరి పంచాయతీలోని నాలుగు గ్రామాల ప్రజలు ముంపు భయంతో ఇప్పటికే గుట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. తక్షణమే బరకాలు, సోలార్‌ లైట్లు, మంచినీరు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు, కిరోసిన్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒడ్డుగూడెం గ్రామస్తులు మైదాన ప్రాంతమైన రేఖపల్లికి సామాన్లతో వెళ్లిపోయారు.

గర్భిణులు, వ్యాధిగ్రస్తుల బాధలు వర్ణనాతీతం
అల్లూరి జిల్లా జికె.వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ కోరపల్లి గ్రామానికి చెందిన కొర్ర లక్ష్మి శనివారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా ఆశా కార్యకర్త సహకారంతో ఆస్పత్రికి బయలుదేరారు. డి.అగ్రహారం వద్ద వాగు కల్వర్టుపై నుండి ప్రవహిస్తుండడంతో అంబులెన్స్‌ రాలేకపోయింది. దీంతో, ఆశా కార్యకర్త, బంధువులు కలిసి ఆమెను నడిపించుకుంటూ వాగు దాటించారు. చింతూరు మండలం కొండపల్లికి చెందిన ఇద్దరు నిండు గర్భిణులను చింతూరు ఐటిడిఎ పిఒ కావూరి చైతన్య ఆదేశాల మేరకు పడవలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కూనవరం మండలం కోతులగుట్ట సిహెచ్‌సికి 15 మందిని, చింతూరు హాస్పిటల్‌కి 28 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదపుటంచున వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు
ఏలూరు జిల్లాలోని విలీన మండలాల్లో రహదారులు నీట మునిగాయి. దీంతో, దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలు, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న వరద నీటితో గోదావరి ఉధృతి పెరుగుతోంది. దీంతో, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద నీటిమట్టం 30.600 మీటర్లకు చేరింది. దీంతో, దిగువకు 5.87 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 35.20 అడుగులకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 8.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. 4.09 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్‌ డ్యామ్‌ వద్ద 28 మీటర్ల నుంచి 30 మీటర్లకుపైగా నీటిమట్టం చేరింది. దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో 40 వేల ఎకరాలకు దెబ్బ
పశ్చిమగోదావరి జిల్లాలో 32,427 ఎకరాల్లో వరి నాట్లు, 2,751 ఎకరాల్లో నారు మడులు దెబ్బతిన్నాయి. 20 మండలాల పరిధిలోని 263 గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. 17,557 మంది రైతులు బాధితులయ్యారు. ఏలూరు జిల్లాలో 4,094 ఎకరాల్లో వరి నాట్లు, 196 ఎకరాల్లో నారు మడులు దెబ్బతిన్నాయి. 146 గ్రామాల పరిధిలో 3,580 మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. శనివారం ఏలూరు జిల్లాలో 98.6 మిల్లిమీటర్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 34.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.

ముంచెత్తిన ఎర్ర కాలువ
అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని వర్షాలకు పంటలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉండ్రాజవరం ఎర్ర కాలువ నీరు గట్లు తెంచుకుని చేలను ముంచెత్తింది. అధికారులు గండిని తాత్కాలికంగా పూడ్చి వేశారు. కోటిపల్లి రేవులో పడవ ప్రయాణాలు నిలిపివేశారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద పంట కాలువ వైపు కుంగిన ఏటి గట్టును జిల్లా కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ పరిశీలించారు. ఏటిగట్టును గ్రావెల్‌తో నింపాలని ఆదేశించారు. నిడదవోలు, నల్లజర్లలో పునరావాస కేంద్రాలను కలెక్టర్‌ పి.ప్రశాంతి తనిఖీ చేశారు. తాళ్లపూడిలో కొవ్వాడ కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. గోపాలపురం మండలంలో సుమారు 11 ఇళ్లు వరద నీటికి ధ్వంసమయ్యాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో పంట పొలాలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలేరు, ఈస్ట్‌ డెల్టా పరిధిలో కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కోటనందూరులో వర్షాలకు నర్సీపట్నం ప్రధాన రహదారిలో భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విశాఖలో 9 విమానాల సర్వీసులు రద్దు
భారీ వర్షాల కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 9 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నరుకు వెళ్లే ప్రయాణికులు సహకరించాలని కోరారు.

ఒకరు మృతి, మరొకరు గల్లంతు
వేర్వేరు ఘటనల్లో ఒక మహిళ మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. రంపచోడవరం మండలం మడిచర్ల గ్రామంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు కూలి కడబాల లక్ష్మి (43) మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామానికి చెందిన యువకుడు పసుపులేటి వంశీకృష్ణ కొవ్వూరు ఈరేనమ్మరేవు వద్ద గోదావరిలో కాలకృత్యాలకు వెళ్లి కాలుజారి గల్లంతయ్యారు. ఆయన వారం రోజుల్లో ఆస్ట్రేలియాకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లాల్సి ఉంది.