బడీ ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే పద్ధతి అమలులో విఫలం
ప్రభుత్వ విద్యాసంస్థల పై ఉండాల్సిన శ్రద్ధ…. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ఉండటం సిగ్గు చేటు
ఏ ఐ వై ఎఫ్ ఆరోపణలపై డీఈఓ బహిరంగ చర్చకు సిద్ధమా..?
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్
విద్యాశాఖ నిబంధనలను భేఖాతరు చేస్తూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా ఓపెనింగ్ పర్మిషన్స్ ఇస్తున్న మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారిపై విచారణ జరిపి, సస్పెండ్ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతంకై ఉండాల్సిన శ్రద్ధ…. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ఉండటం సిగ్గు చేటని ఆరోపిస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏ ఐ వై ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ లు సంయుక్తంగా మాట్లాడుతూ విద్యాశాఖ నిబంధనలను పాటించాల్సిన సదరు విద్యాశాఖ అధికారులు ఆ నిబంధనలను ఉల్లంగిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల కు అనుకూలంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యాసంవత్స రానికి సంబంధించి ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా (Opening Permission)లతో పుట్టుకోచ్చాయన్నారు.సుమారు వందలాది నూతన పాఠశాలలకు ఓపెనింగ్ పర్మిషన్స్ ఇచ్చారన్నారు. పాఠశాలను ఏర్పాటు చేయాలంటే పాఠశాల నిబంధనల ప్రకారం “తనిఖీఫీజు, అగ్నిమాపక శాఖ NOC, ట్రాఫిక్ పోలీసుల క్లియరెన్స్, శానిటరీ సర్టిఫికేట్, పాఠశాల భవన పటిష్టత ధృవ పత్రం, ఆట స్థలం తదితర అనుమతి పత్రాలు ఉంటేనే గుర్తింపు ఇస్తారు. కానీ, పైన తెలిపిన పత్రాలు సమర్పించకున్నా మేడ్చల్ జిల్లా DEO విచ్చల విడిగా opening permission’s ఇచ్చినదని, పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టకుండానే అధికార దుర్వనియోగానికి పాల్పడినదని వారు ఆరోపించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని పాఠశాలలు వందల్లో ఉన్నాయని, 10వ తరగతి వరకు పాఠశాలలకు అనుమతులు లేకున్నా చర్యలు తీసుకోవడం లో డీఈఓ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 10వ తరగతి నామినల్ రోల్స్ విషయంలో కాసులకు కక్కుర్తి పడి అనుమతులు లేని పాఠశాలలకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వాస్తవమని వారు ఉద్ఘటించారు. నామినల్ రోల్స్ విషయంలో ఒక్కో విద్యార్థి నుండి రెండు వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత నెల 31వ తేదీన డీఈఓ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠశాల పేరుతో ముద్రించిన నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్ మరియు స్టేషనరీ వంటి వాటిని పాఠశాలలో విక్రయాలను జరపొద్దని సెర్క్యూలర్ విడుదల చేశారు. కానీ, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. విక్రయాలు జరుపుతున్న పాఠశాలలపై ఫిర్యాదు చేస్తే, ఆయా పాఠాశాలల యాజమాన్యం కు ముందుగానే సమాచారాన్ని అందజేసి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా మన ఊరు-మన బడి – అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయడంలో విఫలం చెందారన్నారు.డీఈఓ కు ప్రభుత్వ విద్యాసంస్థలపై ఉండాల్సిన శ్రద్ధ…అనధికార ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ ఉండటం శోచనీయమన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సదరు డీఈఓ పూర్తి స్థాయి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పధకం కింద ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన జరగలేదని, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, పాఠశాలలకు రంగులు, మరుగుదొడ్ల మరమ్మతులు పనులు నోచుకోలేదని అన్నారు.
ఏ ఐ వై ఎఫ్ ఆరోపణలపై డీఈఓ బహిరంగ చర్చకు సిద్ధమా అని వారు ప్రశ్నించారు. ఒకవేళ భాధ్యతయుతంగా నిబంధనల మేరకే పనిచేస్తే 2024 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలకు ఓపెనింగ్ అనుమతులు ఇచ్చారో జాబితా విడుదల చేయాలని, అమ్మ ఆదర్శ పాఠశాల పధకం క్రింద ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా డీఈఓ పై విచారణ జరిపించి, సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి బాబు, కిరణ్, అజీమ్ పాషా, హస్మాత్ తదితరులు పాల్గొన్నారు.