లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సైలు

0
179

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కుషాయిగూడకు చెందిన భరత్ రెడ్డి అనే వ్యక్తి తనకు చెందిన భూమికి సంబంధించి మరో వ్యక్తి భూ సమస్యపై గొడవలో బాగంగా రెవెన్యూ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులపై భరత్ రెడ్డి హైకోర్టుకు వెళ్లడంతో అతనిపై ఉన్న కేసుల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. అయితే ఇందులో ఓ కేసుకు సంబంధించి భరత్ రెడ్డి పై కేసు పూర్తిగా తొలగించడానికి గాను మధ్యవర్తి ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామిలు మూడు లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకుని అన్ని మాట్లాడుకున్న తర్వాత శుక్రవారం నాడు భరత్ రెడ్డి కుషాయిగూడలోని తన కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా మూడు లక్షలు రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్సై షఫీ, సీఐ వీరాస్వామి, మధ్యవర్తి ఉపేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.కుషాయిగూడ పోలీస్ స్టేషన్ తో పాటు సీఐ వీరస్వామి
నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కేసులో ఎవరి ప్రమేయమున్నా
వదిలిపెట్టబోమన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ,
అవినీతి అధికారులపై నేరుగా
1064 టోల్ ఫ్రీ ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ ఆనంద్
కుమార్ తెలిపారు.