'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం


   గత లోక్సభ చిట్టచివరి సమావేశాలలో అత్యంత నిర్లక్ష్యంగా అప్రజాస్వామిక పద్ధతిలో ఆమోదించిన మూడు నూతన చట్టాలు జూలై 1 నుంచి దేశమంతటా అమలులోకి వచ్చేలా బీజేపీ గట్టి చర్యలు తీసుకున్నది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే మూడు గత చట్టాల స్థానాన్ని భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినయం అనే ఈ మూడు చట్టాలు ఆక్రమించాయి. ఎలాంటి సన్నాహాలు, చర్చ, వాదనలు లేకుండానే మొత్తం న్యాయ వ్యవస్థ ప్రధాన మార్పులకు లోనుకావడం చూస్తే బుర్ర తిరిగే వ్యవహారం తప్ప మరొకటి కాదు. 

బీజేపీ పని తీరుపైన విధానాలపైన ఓటర్లు తీర్పు ఇచ్చిన తర్వాత, పార్లమెంటులో మెజార్టీ రాకుండా పోయిన తర్వాత ఆ పార్టీలో ఏ మార్పు లేదని దీన్నిబట్టి స్పష్టమవుతుంది. హిందీలో మాత్రమే నామకరణం చేయబడిన ఈ మూడు చట్టాలపై లోక్సభలో లోతైన చర్చ జరిగిందే లేదు. ఏదో మొక్కుబడి కోసం వాటిని సెలెక్ట్ కమిటీకి పంపి సభ ముందు పెట్టి క్షణాల మీద ఆమోదించేశారు. అసలు ఆ సమయంలో సభలో ప్రతిపక్ష సభ్యులు వుండే అవకాశమే లేకుండా చేయబడింది. ఎందుకంటే వారిలో 148 మందిని సస్పెండ్ చేసినందున సభలో పాల్గొనే అవకాశం లేదు. న్యాయవ్యవస్థ అన్ని స్థాయిల్లోనూ వుండే న్యాయవాద బృందాలు, సభ్యులు, ఆఖరుకు పోలీసులు ఈ కొత్త చట్టాల గురించి పెద్దగా తెలియలేదు. అందువల్ల వాటి అమలు సహజంగానే వాటికి ఏ విధమైన వ్యాఖ్యానమివ్వాలి, అమలు చేయాలి అనే తీవ్రమైన సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ చట్టాలను అమలులోకి తేవడంతోపాటు దానికి సమాంతరంగా మరో నేర న్యాయవ్యవస్థ ఉనికిలోకి వస్తుంది.

ఏమంటే జూలై ఒకటవ తేదీకి ముందు ఏదైనా నేరం చేసిన ఒక వ్యక్తికి అప్పుడున్న విస్తారమైన నేర చట్టాల ప్రకారమే విచారించవలసి వుంటుంది. అదే నేరం గనక జూలై 1 తర్వాత జరిగినట్టయితే ఈ సరికొత్త విస్తారమైన చట్టాల మేరకు విచారించవలసి వస్తుంది. అంటే దీని అర్థం ఏమంటే ఒక సమాంతర న్యాయవ్యవస్థ ఏర్పరచడం, ఒకే సమయంలో రెండు రకాల చట్టాలు అమలులోకి రావడం జరుగుతుందన్నమాట. దాంతో ఏ చట్టాన్ని వర్తింపచేయాలనే వివాదం రావడం సహజంగా జరుగుతుంది. ఉదాహరణకు జూలై ఒకటవ తేదీ ముందు ఎఫ్ఎఆర్ లో నేరారోపణకు గురైన వారు తమను పాత చట్టాల ప్రకారం విచారించాలని కోరవచ్చు. కానీ ప్రాసిక్యూషన్ వారిని కొత్త చట్టాల ప్రకారం విచారణకు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. వాజ్యాలు చాలా సంక్లిష్టంగా మారిపోతాయి.

  • మరో యాభై ఏళ్లు అస్పష్టత

చట్టాలకు సుప్రీంకోర్టు భాష్యం చెబుతూ వచ్చింది. సీఆర్పీసీకి 1973లో చేసిన సవరణలు ఇప్పుడే కొంత నిశ్చిత రూపం సంతరించుకున్నాయి. ఈ కొత్త చట్టాలకు ఆ విధమైన స్థిరత్వం రావాలంటే మరో యాభై ఏళ్లు పడుతుంది. దేశంలోని వేలాది మంది మేజిస్ట్రేట్లు ఈ కొత్త చట్టాలకు వేర్వేరు పద్ధతుల్లో తమవైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఏది నిలబడుతుందో ఊహించుకోవచ్చు. ఈ రకరకాల వ్యాఖ్యానాలు, ఆలస్యాల వల్ల నిందితులు విపరీతమైన సమస్యలకు గురవడం తథ్యం. ఆ
నిందితులు గనక కస్టడీలో వుండేట్టయితే అతడు లేక ఆమె సమస్యలు మరింత జటిలంగా పరిణమిస్తాయి. చట్టం నిర్దేశించే పద్ధతి వల్ల తప్ప మరే విధంగానూ ఒక పౌరుడి ప్రాణాలకు, స్వేచ్ఛకు ఆటంకం రాకూడదని 21వ అధికరణం హామీని స్తుంది. కాని ఇక్కడ అసలు చట్టం ఏమిటి అన్నదే వివాదమైన ప్పుడు దాన్ని అమలు చేయడం కూడా కష్టతరమవుతుంది. ఈ కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయనే దానిపైనే అనిశ్చితిని, అస్పష్ట తను తెచ్చిపెడతాయి. ఈ నూతన చట్టాలు వచ్చిన తర్వాత నేర కేసులు 30 శాతం ఎక్కువగా జాప్యం జరుగుతుందని సీనియర్ లాయర్లు చెబుతున్నారు. వేల మందికి, ప్రత్యేకంగా వనరులు లేని వారికి న్యాయం నిరాకరించబడటానికి ఇది దారి తీస్తుంది. అసలు కేసుల పెండింగ్పై దీని ప్రభావం ఏమిటనేది లెక్క కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిన దాఖలాలే కనిపించవు. ఎందుకంటే దాన్ని సర్కారు ఖాతరు చేయదల్చుకోలేదు. అనువాదం చేయడానికి, అమలు చేయడానికి సంబంధించిన సమస్యలు ఎలాగూ తప్పవు గనక అనివార్య చిక్కులుగా వదిలేయవచ్చు. కాని ఈ నూతన చట్టాలలో కొన్ని సెక్షన్లు అత్యంత నిరంకుశమైనవి, మరికొన్ని సెక్షన్లు న్యాయం అందించడంలో అవరోధాలు సృష్టించేవిగా వున్నాయి.

  • పోలీసులకు నిరంకుశాధికారాలు

న్యాయాన్ని చేరుకోవడంలో మొదటి అడుగు ఎఫ్ఆర్. ఈ కొత్త చట్టాల కింద మూడు నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశమున్న ఏదైనా నేరానికి సంబంధించిన ఎఫ్ఎఆర్ 14 రోజుల వరకూ జాగు చేయొచ్చు. ఈ విషయానికి సంబంధించిన వివిధ కోణాలను అధ్యయనం చేయడంలో స్టేషన్ హౌస్ అధికారి ఆలోచనలు కొనసాగించవచ్చు. బాధితులైన అతడు/ఆమె తమ ఫిర్యాదును ఉపసంహరించాలంటూ ఈ కాలంలో ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది పోలీసులలోనూ అవినీతికి దారితీయొచ్చు. తమను తాము కాపాడుకోవడానికి రకరకాలైన పద్ధతులకు పాల్పడే అవకాశం అతడు / ఆమెకు లభించవచ్చు. ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిన మార్పుల వల్ల పేదలు, బలహీనులు న్యాయం పొందే హక్కుకు అంత్యంత తీవ్రమైన హాని కలుగుతుంది. వారిప్పటికే అనేక విధాల న్యాయం పొందే హక్కును ఉపయోగించుకోలేకపోతున్నారు. అలాగే ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీసులు గత చట్టంలో పేర్కొన్న 15 రోజుల కాల పరిమితిని మించి అధికకాలంపాటు రిమాండ్లో ఉంచాలని కోరవచ్చు. తరచూ నేరాలు చేసేవాళ్లకు (ఇదో కొత్త తరహా విభజన) ఈ కొత్త చట్టం ప్రకారం సంకెళ్లు కూడా వేయొచ్చు. పేదలు, బలహీనులకూ, అణచివేయబడిన వారికి, ప్రభుత్వ ప్రయోజనాలకు హాని కలిగించే వారుగా పోలీసులు భావించే వాళ్లకు న్యాయాన్ని నిరాకరించే అధికారం మరింత పెరుగుతుంది.

  • 124ఎ మరింత తీవ్రరూపంలో..

ఈ నూతన చట్టాలలో అత్యంత ప్రమాదకరమైన మరో అంశమేమంటే 124 ఎ మరో రూపంలో ప్రత్యక్షం కావడం. రాజద్రోహాన్ని నిర్వచించే ఐపీసీ 124 ఎ సెక్షన్ను సుప్రీం కోర్టు ఇప్పటికే కొట్టివేసింది. కానీ భారతీయ న్యాయసంహితలో 152వ సెక్షన్ మళ్లీ ప్రత్యక్షమవుతోంది. ఇంతకు ముందట మూల చట్టం 124 2 లో లేని విధంగా ఇందులో భారత సార్వ భౌమత్వం, సమగ్రత అనే ప్రస్తావనలు అదనంగా చేర్చబడ్డాయి. సీనియర్ లాయర్లు చెప్పే ప్రకారం చట్టంలో ఇది వరకు లేని ‘జాతి వ్యతిరేక చర్య’ అనే అంశం కొత్తగా జొప్పించబడింది. సహజంగానే ఇది వాక్ స్వాతంత్రాన్ని భావ వ్యక్తీకరణను అసమ్మతి హక్కును తీవ్రస్థాయిలో దెబ్బ తీస్తుంది. వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ కొత్త చట్టాలు తీసుకురాక ముందే ఈ ప్రభుత్వం అసమ్మతిదారుల పట్ల వ్యవహరించిన తీరు చాలా దూకుడుగా అన్యాయంగా వుండింది. ఇక ఈ కొత్త చట్టాలతో పరిస్థితి ఇంకా దిగజారుతుంది. అంతేగాక ప్రస్తుతం ఉపా చట్టం కింద వున్న అనేక నేరాలను ఈ కొత్త నేరచట్టంలో పొందు పరిచారు. అంటే నిందితుడు వాస్తవంలో కొత్తనేర చట్టంలో ఉపా కింద ఎన్ఐఏ, కొత్త నేర చట్టం కింద పోలీసులు పెట్టే రెండు రకాల చార్జిషీట్లు ఎదుర్కొనవలసి వుంటుంది. చివరకు ఒకే శిక్ష విధించినా ఈ ఈ మొత్తం ప్రక్రియే తీవ్ర శిక్షలా నడుస్తుంది. పైగా ఉపా కింద దర్యాప్తు చేసేది స్థానిక పోలీసు కన్నా పైస్థాయి అధికారి కాగా కొత్త చట్టంలో మామూలు పోలీసు స్టేషన్కి టెర్రరిజంపై దర్యాప్తు చేసే హక్కు వుంటుంది. ఉపా కింద విచారణ జరిపేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం. కాగా కొత్త చట్టంలో ఒక సాధారణ పోలీసు అధికారి ఎవరినైనా టెర్రరిజం పేరిట దర్యాప్తు జరిపే అధికారం పొందడం ఇంకా ఆందోళన కలిగించే విషయం.

  • నిలిపే వరకూ పోరాటం

ఈ నూతన చట్టాలపై గట్టిగా పోరాడాల్సి వుంది. దేశవ్యాపితంగా న్యాయవాద సంఘాలు నిరసనలు, కోర్టులబహిష్కరణకు సన్నాహాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టునుఉద్దేశించి పిటిషన్లపై వేలాది మంది సంతకాలు చేసి పంపారు.
ఈ చట్టాల గురించిన సమాచారం మరింత విస్తృతంగా తెలిసే కొద్దీ నిరసనలూ వ్యతిరేకత పెరుగుతూనే వుంటాయి.ప్రజాభిప్రాయం నిర్మించడం ద్వారా ఎన్డీఏ సర్కారుపై ఒత్తిడి
తెచ్చి ఈ కొత్త చట్టాల అమలును నిలుపు చేయవలసిన పరిస్థితి తీసుకురావాలి. వాటిని తాజాగా మరోసారి సమీక్షించాలి.

ఎందుకంటే ఈ చట్టాలు దేశంలోని పౌరులందరి జీవితాలకూ స్వేచ్ఛకు ప్రమాదకరంగా పరిణమించనున్నాయి. వాటిని
ఇప్పుడున్న రూపంలో ఆమోదించే ప్రసక్తే వుండకూడదు.