అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!

0
94

అనంత్‌-రాధికా మర్చంట్‌ ఎంగేజిమెంట్‌ ఏడు నెలల క్రితం జరగగా..
జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు.

ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకను యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రముఖులతో ముంబయి వీధులు నిండిపోయాయి. ఏడు నెలల ముందునుంచే మొదలైన ఈ వేడుకలోభాగంగా అనంత్‌-రాధికా మర్చంట్‌లు జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. అతిథులకు ఆహ్వానాలు, విందు, వినోద కార్యక్రమాలు, రూ.వందల కోట్ల ఖర్చుతో ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు.. ఇలా ఎంగేజ్‌మెంట్‌ మొదలు వివాహ వైభోగం కనులపండువగా సాగిన తీరును పరిశీలిస్తే..

ముకేశ్‌-నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్‌కు, విరెన్‌-శైలా మర్చంట్ దంపతుల కుమర్తె రాధికల మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది.
డిసెంబర్‌ 29, 2023న అనంత్‌-రాధికల నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.
జనవరి 18, 2024న ‘మెహందీ’ నిర్వహించారు. మరుసటిరోజు ఏర్పాటుచేసిన ఎంగేజ్‌మెంట్‌ పార్టీ బాలీవుడ్‌ తారలతో మెరిసిపోయింది. షారుఖ్‌, సల్మాన్‌, ఆమీర్‌ఖాన్‌లతో పాటు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె వంటి పలువురు అగ్ర తారలు తమ స్టెప్పులతో అలరించారు.
ప్రీ వెడ్డింగ్‌ పేరుతో అంబానీ కుటుంబం అనేక కార్యక్రమాలు నిర్వహించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మార్చిలో నిర్వహించిన వేడుకలో 1200 ప్రముఖులు పాల్గొన్నారు. 100 మంది షెఫ్‌లతో 500 రకాల వంటలు, బాలీవుడ్‌ పాటలకు నృత్యాలు, బాణాసంచాతో జిగేల్‌మనిపించాయి.

ప్రపంచ టెక్‌ దిగ్గజాలైన బిల్‌గేట్స్‌, మార్క్‌ జూకర్‌బర్గ్‌, ఇవాంక ట్రంప్‌ దంపతులు, కెనడా, స్వీడన్‌, ఖతర్‌ మాజీ ప్రధానులు, భూటాన్‌ రాణి తదితర ప్రముఖులతో పాటు రిహానా ప్రదర్శనతో కార్యక్రమం ఘనంగా సాగింది. దీనికంటే ముందు జామ్‌నగర్‌ సమీపంలో దాదాపు 50 వేల మంది స్థానికులకు భారీ విందు ఇచ్చారు.

ప్రీ వెడ్డింగ్‌లో భాగంగా ఇటలీలో ఓ లగ్జరీ క్రూజ్‌లో నాలుగురోజుల పాటు వేడుక నిర్వహించారు. మే నెలలో జరిగిన ఈవెంట్‌లో ప్రముఖ అమెరికన్‌ గాయని కేటీ పెర్రీ, ఇటలీకి చెందిన అంధ గాయకుడు ఆండ్రియా బోసెలీ వంటి ప్రముఖలు ప్రదర్శనలు ఇచ్చారు.

పెళ్లి వేడుకల్లో భాగంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముంబయి సమీపంలోని పాల్‌గఢ్‌లో పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు వివాహం జరిపించారు. వారికి భారీ కానుకలు అందజేశారు.

జులై 5న ఏర్పాటుచేసిన ‘సంగీత్‌’లో జస్టిన్‌ బీబర్‌ ప్రదర్శన ఆకట్టుకొంది. జులై 8న కుటుంబసభ్యులు, సమీప బంధువుల నడుమ ‘హల్దీ’ వేడుక చేశారు.

జులై 12న జరిగిన అనంత్‌-రాధికల వివాహానికి జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికైంది. దాదాపు 16వేల మంది సామర్థ్యం కలిగిన ఈ కేంద్రాన్ని అలంకరించిన తీరు ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

జామ్‌నగర్‌ నుంచి జెనోవా (ఇటలీ) వరకు 134 రోజుల పాటు కొనసాగిన ప్రీ వెడ్డింగ్‌ వేడుకల కోసం అంబానీ కుటుంబం ఎంత ఖర్చు పెట్టిందనే విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలయ్యింది. సుమారు రూ.1200 కోట్లు వరకు ఖర్చు పెట్టి ఉండవచ్చని బ్రిటన్‌ వార్తా సంస్థ డైలీ మెయిల్‌ కథనంలో అంచనా వేసింది. కేవలం వంటల కోసమే రూ.210 కోట్ల ఖర్చు చేసినట్లు పలు కథనాలు వెల్లడించాయి.