ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం సాధించాలన్న పట్టుదల కనిపిస్తోంది. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేయడం, సుంకాలు పెంచడం, వివిధ దేశాల్లో జోక్యం చేసుకోవడం వంటివన్నీ ఆయన దూకుడు వ్యవహారాన్ని కనబరుస్తున్నారు. వీసా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చూస్తున్నాడు. తమగడ్డపై పిల్లను కంటే అమెరికా పౌరసత్వం రాకుండా ఆదేశాలు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మాటల్లో, చేతల్లో తన లక్ష్యం ఆధిపత్యం అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. ఎక్కడా కూడా అయన రాజీ ధోరణి వ్యక్తం చేయడం లేదు. సుంకాల తగ్గింపు కుదరదని మోదీకి మొహం మీదే చెప్పేశాడు. తన దేశ హితమే ముందు అన్న విధంగా అమెరికా ఫస్ట్ సిద్దాంతాన్ని ప్రకటించుకున్నాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు వాణిజ్యం మీద దృష్టి సారించినట్లుగా కనిపిస్తున్నది. ప్రధానంగా సుంకాల మీద దృష్టి కేంద్రీకరించాడు. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపాలని కోరుతూనే, గాజాపై కబ్జాకు ఉపక్రమించే పరిస్థితి చూస్తున్నాం. దశాబ్దాలుగా భారతదేశంలో ఇతర దేశాల జోక్యం అంగీకరించని ఇండియాకు చైనా ఉన్న వివాదం పరిష్కరిస్తామని కూడా పేర్కొన్నాడు. గతంలో ఒబామా కాలంలో ఇదే విషయం ప్రస్తావనకు వస్తే, అప్పటి పీఎం మన్మోహన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు. ఏ దేశంతోనైనా నేరుగా చర్చించి తన సమస్యను తాను పరిష్కరించుకునే సత్తా ఇండియాకు ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ’గాజా’ మీద ఇజ్రాయెల్ యుద్దాన్ని అక్కడి ప్రధాని నెతన్యాహును ఒప్పించి ఆపించానని చెప్పాడు. షరతుల ప్రకారం హమాస్ వద్ద, అటు ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఇరుపక్షాల ఖైదీలను విడతలవారీగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజా మీద యాజమాన్య హక్కు తనకు ఉంటుందని అక్కడ సముద్రపు ఒడ్డున రిసార్టులు, ఇతర ఏర్పాట్లు చేస్తామని, అందుకు గాజాను ఖాళీ చేయాలని ట్రంప్ తెలిపాడు. ట్రంప్ ప్రకటన నెతన్యాహుకు ఆమోదమే. ఎందుకంటే గాజా నుంచి జనాన్ని ఖాళీ చేయించడమే ఆయన లక్ష్యం. ఇక్కడ వీరిద్దరి ఉద్దేశం ఒక్కటే అని తేలిపోయింది. క్రమంలో హమాస్ తమ వద్ద ఉన్న, అఖరి ఆయుధమైన ఖైదీల విడుదల విషయంలో కొంత ఆలస్యం చేయడమేకాక యుద్ధం, దాడులు మళ్ళీ గాజా ఖాళీ చేయించే విషయంలో నెతన్యాహు, ట్రంప్ కలిసి దాడి చేసే అవకాశం ఉందని అప్రమత్తం అవుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు తాము గాజా విడిచి ఎటు పోతామని బాధితులు ఆందోళన చెందుతున్నారు. హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ ఖైదీలను విడుదల చేయాలని ట్రంప్ వార్నింగ్ జారీ చేశాడు. దీంతో మళ్ళీ గాజా మీద దాడి తప్పదా అనే పరిస్థితి నెలకొన్నది.కొన్నిచోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వొస్తున్నాయి. ఇప్పటికే గాజాలో పాలస్తీనీయులు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 92 శాతం గృహాలు, 70 శాతం పెద్ద భవనాలు, ఆసుపత్రులు నేలమట్టం అయ్యాయి. నిరాశ్రయులు ఉండడానికి షెల్టర్ లేదు. గాజా పునర్‌నిర్మాణానికి పదిహేను ఏండ్లకు పైగా పడుతుంది. అయితే, యుద్ధం, బాంబుల వల్ల భూమి పనికి రాకుండా అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గాజాను కబ్జా చేసే పనిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు. అయితే, తాజాగా ట్రంప్ మాటలను చైనా ఖండిస్తూ ముమ్మాటికీ గాజా పాలస్తీనా ప్రజలదే అని పేర్కొంది. ట్రంప్ ఆలోచన ప్రపంచ దేశాలలోని మెజారిటీ ప్రజలు విమర్శిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ వ్యవహారం ప్రపంచంపైన ఆధిపత్యం సాధించే దిశగా కొనసాగుతోంది. వాణిజ్యంలోనూ అమెరికా నవంబర్ వన్‌గా రాణించాలని తహతహలాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు ఏం చేస్తాయో వేచిచూడాలి. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసీచేయగానే ట్రంప్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో ఒకటి- పారిస్ ఒప్పందం నుంచి మళ్లీ బయటకు రావడం. పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడతానంటూ తొలి రోజు ప్రసంగంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ట్రంప్.. భూతాపానికి ముకుతాడు వేసేందుకు 190కి పైగా దేశాలు ఒక్కతాటిపైకి వొచ్చి కుదుర్చుకున్న ఒడంబడికనుంచి వైదొలగడం ఎలాంటి సంకేతాలనిస్తుంది? అమెరికాకు తొలిసారి అధ్యక్షుడయ్యాక ట్రంప్ ఈ ఒప్పందంనుంచి వైదొలగడంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి. కీలకమైన పారిస్ ఒప్పందం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకున్న బైడెన్, తాను అధికారంలోకి వొచ్చాక 2021లో మళ్లీ ఒప్పందంలో అమెరికాను చేర్చారు. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అని నిర్ద్వంద్వంగా, నిస్సంకోచంగా వాదించే ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కాగానే ఈ ఒప్పందాన్ని కాలరాచేందుకు ఉద్యుక్తుడయ్యారు. అంతేకాదు, కొవిడ్ వ్యాప్తి సమయంలో బాధ్యతారహితంగా ప్రవర్తించిందనే ఆగ్రహంతో ప్రపంచ ఆరోగ్య సంస్థనుంచి కూడా వైదొలగుతూ ఆయన నిర్ణయం తీసుకోవడం తెంపరితనం కాక మరేమిటి? కృత్రిమ మేధ విస్తరిస్తే మనవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, బైడెన్ ప్రభుత్వం దీని విస్తరణపై విధించిన ఆంక్షలను తాజాగా ట్రంప్ తొలగించారు. కీలకమైన అంశాలపై లోతైన అధ్యయనం, విస్తృతమైన చర్చలు.. ఏవీ లేకుండా వచ్చీరాగానే కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయడం ఆయన తొందరపాటుకు నిదర్శనమనే చెప్పాలి. పదవిలోకి రాకముందే హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలికారనే ఘనతను ట్రంప్ దక్కించుకున్నారు. ఆయన హెచ్చరికలవల్లే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ దిగి వొచ్చారని విశ్వసించేవారు ఎంతోమంది ఉన్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి కూడా ట్రంప్ చరమాంకం పలుకుతారని ఆయన అనుయాయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమే అనుకున్న పక్షంలో, ఒకవైపు యుద్ధ విరమణకు కృషి చేస్తూ, మరోవైపు గ్రీన్లాండ్ , పనామా కాలువనూ స్వాధీనం చేసుకుంటామంటూ తొలిరోజే రెచ్చగొట్టే వ్యాఖ్య లు చేసిన ట్రంప్ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ప్రశ్న. తొలిసారి మాదిరిగానే ఈసారి కూడా ట్రంప్ ప్రసంగం దూకుడుగా, తన మద్దతుదారులు, దేశప్రజలలో ఉత్సాహం నింపేదిగా సాగింది. ‘అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది. మునుపెన్నడూ లేనంత దృఢమైన, పటిష్ఠమైన, అసాధారణమైన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతా’నంటూ ఆయన అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రతినబూనారు. మొదటిసారికంటే ఈ తడవ మరింత శక్తిమంతమైన నేతగా ట్రంప్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలోనూ, సెనేట్లోనూ మెజారిటీ బలం రిపబ్లికన్ పార్టీదే కావడం ఇందుకు కారణం. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాల విషయానికొస్తే మోదీ – జో బైడెన్ హయాంలో ఇరుదేశాల మధ్య బంధం మున్నెన్నడూ లేనంతగా బలోపేతమైందనేది జగద్విదితం. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడన్న నానుడిని నిజం చేస్తూ ఇరు దేశాలకూ పక్కలో బల్లెంలా మారిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు బలపడటానికి కారణమైంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలు విధిస్తోందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, భారత్ ఉత్పత్తులపైనా అదే విధంగా సుంకాలు విధించే అవకాశం ఉండవొచ్చు. అంతమాత్రానికే, ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడతాయని భావించరాదు.
*