దసరా రోజున లోహ పరికరాలను, ఆయుధాలను పూజించే సాంప్రదాయం ఉంది. ఆధునిక కాలంలో వాహనాలను కూడా పూజిస్తున్నారు. వాహనాలను శుభ్రం చేసి దసరా రోజు పూలదండ వేసి పూజలు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, బరాక్స్‌లలో కూడా ఆయుధాలను పూజించడం ఆనవాయితీగా మారింది. దీనికి కూడా దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని .. అందుకనే దసరా రోజున లోహపరికరాలని పూజించే ఆనవాయతీ వచ్చిందని చెబుతారు. దుర్గ అంటే దుర్గములను తొలగించేది అని అర్ధం. దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. పురాణాల ప్రకారం దుర్గ అంటే అర్ధం ఏమిటంటే దుర్ అంటే ద్ణుఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్యర్ర మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది. కనుక దుర్గను ఆరాధించడం వలన దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రాక్షసుల బాధలు దరిచేరవు అని నమ్మకం. అందుకనే నవ రాత్రులు తొమ్మిది రోజుల్లో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను.. తర్వాత మూడు రోజులు లక్ష్మి రూపాయలను ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులు సరస్వతి దేవి రూపాలను ఆరాధించి జ్ఞానాన్ని పొందుతారని పెద్దల నమ్మకం. ఈ తొమ్మిది రోజులు దుర్గసహస్రనామ పారాయణము అత్యంత ఫలవంతం. అంతేకాదు ‘దుం’ అనే బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. ఈ దుర్గాష్టమి సోమవారం రోజున వస్తే అత్యంత శ్రేష్టమైన రోజుగా భావిస్తారు. దసరా నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనది తిది నవమి. ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కనుక ‘సిద్ధదా’ అని నవమికి పేరు. ఈ మహర్నవమి రోజున దేవి ఉపాసకులు అంతవరకు తాము చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తారు. ఇలా చేయడం వలన సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ మహర్నవమి రోజున క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులతో పాటు కులవృత్తులవారు తమ తమ ఆయుధాలను, పని ముట్లను పూజిస్తారు.
విజయదశమి: దసరా నవరాత్రులలో చివరి రోజు విజయ దశమిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ దశమికి శ్రవణా నక్షత్రంతో కలిస్తే విజయా అనే సంకేతం అని అర్ధం. అందుకనే దీనికి ’విజయదశమి అనే పేరు వచ్చింది. ఇలా నవరాత్రులు భక్తీ శ్రద్దలతో అమ్మవారిని పూజించి అమ్మ దయకు పాత్రులవుతారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భావిస్తారు అమ్మవారి భక్తులు .