నరకాసురుడు మంచి వంశం నుంచి వచ్చినవాడే. అతను విష్ణుమూర్తి కుమారుడని పురాణ గాథలు చెబుతున్నాయి. నరకాసురుడిలో కొన్ని చెడు ధోరణులు ఏర్పడ్డాయి. అతనికి మురాసురుడు అనే మిత్రుడున్నాడు. మురాసురుణ్ణి నరకుడు సేనానిగా చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి ఎన్నో యుద్దాలు చేశారు. వేలాది మందిని చంపారు. వారిద్దరినీ ఒకేసారి చంపడం కష్టం. కాబట్టి కృష్ణుడు మొదట మురాసురుణ్ణి చంపాడు. కృష్ణుడికి ‘మురారి’ అనే పేరు రావడానికి కారణం ఇదే! మురాసురుడికి మాయలు తెలుసు. వాటి వల్ల అతని ముందు యుద్ధంలో ఎవరూ నిలబడలేకపోయేవారు. మురాసురుడి వధ తరువాత నరకాసుర వధ తేలికయింది. నరకాసురుణ్ణి విడిచిపెట్టినా అతను పద్ధతుల్ని మార్చుకోడని కృష్ణుడికి తెలుసు. యుద్ధంలో నరకుణ్ణి మృత్యు ముఖానికి తీసుకువచ్చేసరికి, అతనికి జ్ఞానోదయం అయింది. అనవసరంగా చాలా చెడును మూట కట్టుకున్నానని అతను గ్రహించాడు. నువ్వు నన్ను చంపడం లేదు. నాలోని చెడును తొలగిస్తున్నావు. నాకు మంచే చేస్తున్నావు. ఈ విషయం అందరికీ తెలియాలి. నేను పోగు చేసుకున్న దోషాలు నాశనం అవుతున్న ఈ రోజును అందరూ పండుగ చేసుకోవాలి. ఈ రోజు నాకు ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ఆ వెలుగు ప్రతి ఒక్కరూ పొందాలి అని కృష్ణుణ్ణి నరకాసురుడు కోరాడు. ఆ విధంగా ఆ రోజు దీపావళి పండుగ అయింది. ఈ రోజు దేశమంతా వెలుగులతో నిండిపోవాలి. ఆ వెలుగు మనలోని మలినాలను కాల్చెయ్యాలి. దానికోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. నేను నిన్ను చంపబోతు న్నాను అని నరకుడికి కృష్ణుడు చెప్పాడు. మనకు అలా చెప్పేవారు ఎవరూ ఉండరు. మనకు తెలియ కుండానే అది జరిగిపోవొచ్చు. మృత్యువు మనల్ని ఎప్పుడు తీసుకుపోతుందో మనకు చెప్పదు. అది మనిషి రూపంలో రావొచ్చు. మరణానికి కారణం బ్యాక్టీరియా, వైరస్ లేదా మనలోని జీవకణాలూ కావొచ్చు. అప్పటి వరకూ ఎదురు చూడకుండా ఆత్మావలోకనం చేసుకోవాలి. మనలో విషం పోగు చేసుకుంటున్నామా లేదా దివ్యత్వాన్ని వికసింప జేసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. ఎంపిక మన చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరికీ వారి జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని ఎంపికలు ఉంటాయి. జీవితంలో ఎదురుదెబ్బలు తగిలే వరకూ ఎదురుచూడకుండా, అలాంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం మలచుకోవడం సరైన ఎంపిక. కృష్ణుడు తనను తాను ఆ విధంగా మలచు కున్నాడు. కృష్ణుడి చేతిలో దెబ్బతినే పరిస్థితికి దారితీసే మార్గాలను నరకాసురుడు ఎంచుకున్నాడు. వారిలో ఒకరిని దేవుడిగా పూజిస్తాం. మరొకరిని రాక్షసుడిగా అసహ్యించుకుంటాం. అందుకే, సరైన మార్గంలో జీవితాన్ని మలచుకోవాలి. లేదంటే జీవితం తనద్కెన పద్ధతుల్లో మనల్ని మలుస్తుంది. ఈ వాస్తవాన్ని దీపావళి గుర్తు చేస్తుంది. మంచి పుట్టుక కలిగి ఉండి కూడా నరకుడు చెడ్డకు ప్రతినిధిగా మారాడు. మరణించే సమయంలో తన స్థితిని అతను గుర్తించాడు. అది ముందే గుర్తించేవారు మరింత ఉన్నతంగా జీవితాలను మలచుకోగలరు. నిర్దిష్టమైన రీతిలో తనను తాను మలచుకోవడానికి మనిషి ఎంతో శ్రమపడాలి. చాలామంది తమకు నిర్బంధాల్కెపోయిన విషయాలను జీవితపు చివరి క్షణాల వరకూ గ్రహించరు. ముందే వాటి గురించి తెలుసుకోగలిగితే జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. దానికోసం మనలో చైతన్యాన్ని వెలిగించుకోవాలి. ఈ పండుగ సందర్భంగా కాల్చి బూడిద చేయాల్సింది టపాకాయలను కాదు… మనలోని దోషాలనూ, లోపాలనూ! దీపావళి అందించే సందేశం ఇదే!