విజయ దశమి : శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ

0
34
Vijaya Dashami: A festival that emphasizes the worship of Shakti
Vijaya Dashami: A festival that emphasizes the worship of Shakti
  • పండగల్లో దసరాకు విశిష్ట స్థానం !

హిందువుల అతి ముఖ్యమైన పండుగ దసరా. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి, తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి, తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి.
హిందువులు జరుపుకునే పండగలలో దసరా పండగకు విశిష్ట స్థానం ఉంది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు లేక శరన్నవరాత్రులు అని అంటారు. ఈ దసరా ఉత్సవాన్ని నవరాత్రులుగా తొమ్మిది రోజులు పాటు జరుపుకుని.. 10వ రోజున దసరా లేదా విజయదశమిగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు శక్తిస్వరూపిణి అయిన దుర్గాదేవి అవతారాలను అంటే నవదుర్గలను అత్యంత భక్తీ శ్రద్దలతో పూజిస్తారు. ఈ దేవీ నవరాత్రులలో చివరి మూడు రోజులు, దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిగా జరుపుకుంటూ విద్యార్ధులు పుస్తకాలూ, పెన్నులను పూజిస్తే, శ్రామికులు తమ పనిముట్లను పూజిస్తారు. ఇక క్షత్రియులు ఆయుధ పూజ చేసి.. అమ్మవారి కృపకు పాత్రులవుతారు. దుర్గాదేవి మహిషాసురమర్దనిగా అవతరించి రాక్షసుని విూదకు దండెత్తి విజయం సాధించింది. అంతేకాదు రాముడు రావణ సంహారం చేసింది దసరానే.. కనుక పూర్వం రాజులు తమ దండయాత్రకు దసరా పండగానే శుభ ముహార్తంగా ఎంచుకునే వారని తెలుస్తోంది. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో హెచ్చుగా ఉంటుంది. దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.’పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ’మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషా సురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్దాన మయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితు డైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు.
దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషా సురుని తరఫున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో అమ్మ తలపడినది. ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు.ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము కాబట్టి మహిషాసుర మర్ధనిని కొలిచే దసరా పర్వదినంగా ప్రజలచే కొనియాడబడింది. ఉత్తరభారతంలో దసరాను రావణ దహనంగా నిర్వహిస్తారు. దక్షిణాన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపుగా నిర్వహిస్తారు. ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.