‘ఉద్వేగం’ మూవీ రివ్యూ : ఆకట్టుకునే కోర్టు డ్రామా!

0
31
'Udvegam' Movie Review: Impressive court drama!
'Udvegam' Movie Review: Impressive court drama!

(చిత్రం :ఉద్వేగం, రేటింగ్: 3.5/5 , నటీనటులు: త్రిగుణ్, దీప్సిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేష్, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు. సంగీతం: కార్తిక్ కొడగండ్ల, సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్, ఎడిటర్: జశ్వీన్ ప్రభు, నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు, బ్యానర్స్: కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్, దర్శకుడు: మహిపాల్ రెడ్డి, పీఆర్ఓ: హరీష్, దినేష్)

జి. శంకర్, ఎల్. మధు నిర్మాణ సారథ్యంలో కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై వచ్చిన చిత్రం ‘ఉద్వేగం’. త్రిగుణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ కోర్టు డ్రామాకు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ అయ్యంగార్, పరుచూరి గోపాలకృష్ణ, సురేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం, మంచి అంచనాలతో థియేటర్లలో అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…

కథ: వృత్తిరీత్యా లాయర్ అయిన మహీంద్రా (త్రిగుణ్) తనదైన శైలిలో క్రిమినల్ కేసులను డీల్ చేస్తుంటాడు. న్యాయ వృత్తినే జీవితంగా భావించే మహీంద్రా లైఫ్ లో ప్రేయసి అమ్ములు (దీప్షిక) కూడా ప్రధాన భాగం. మహీంద్రా జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో, గ్యాంగ్ రేప్ కేసు ఒకటి విచారణ కోసం అతని దగ్గరకు వస్తుంది. మొదట కేసును టేకప్ చేయడానికి మహీంద్రా ఒప్పుకోడు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల కేసుని టేకప్ చేస్తాడు. ఆ కేసులో A2 అయిన సంపత్ అనే నిందితుడి కోసం వాదించడానికి మహీంద్రా రంగంలోకి దిగుతాడు. మరోవైపు ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) అమ్మాయి వైపు నుండి ఈ కేసును వాదిస్తాడు. అసలు ఈ కేసు కారణంగా మహీంద్రా వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఈ గ్యాంగ్ రేప్ కేసుని మహీంద్రా ఎలా డీల్ చేశాడు? సంపత్ ని ఆధారాలతో కేసు నుంచి బయట పడేయగలిగడా? చివరికి అసలు ఏం జరిగింది? అనేది కథ.

విశ్లేషణ: దర్శకుడు చాలా తెలివిగా క్రిస్పీ రన్ టైమ్ మరియు అదిరిపోయే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమాని రూపొందించాడు. కొన్ని సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. ట్విస్ట్ లు మరియు కథనంలో ఉన్న వేగం కారణంగా ప్రేక్షకులు సినిమాకి కనెక్ట్ అయ్యి, చివరి వరకు ఎంతో ఆసక్తితో ట్రావెల్ అవుతారు. ఉద్వేగం సినిమా అనేది క్రైమ్, ఎమోషన్స్ మేళవింపుతో రూపొందిన పర్ఫెక్ట్ కోర్టు డ్రామా. సాధారణంగా ఈ తరహా కోర్టు డ్రామా సినిమాల్లో బాధిత అమ్మాయి తరపున హీరో కేసు వాదించడం చూస్తుంటాం. కానీ ఇందులో బాధిత అమ్మాయి తరపున కాకుండా, A2 నిందితుడు తరపున హీరో కేసు వాదించడం అనేది కొత్త పాయింట్. దాంతో చూసే ప్రేక్షకులు.. ఓ వైపు అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూనే, మరోవైపు హీరో గెలవాలని కోరుకుంటారు. దాంతో సినిమా చూస్తున్నప్పుడు ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. అదే ఉద్వేగం సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమవుతుంది కానీ, కథలోకి వెళ్ళే కొద్దీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 20 నిమిషాల తర్వాత నుంచి.. సినిమా అసలు ఎక్కడా డౌన్ అవకుండా, చివరివరకూ అదే టెంపో మెయింటైన్ చేసింది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా పండాయి. అలాగే త్రిగుణ్, దీప్షిక మధ్య వచ్చే సన్నివేశాలు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండటంతో బాగా వర్కవుట్ అయ్యాయి. నిజ జీవితంతో పోల్చుకుంటూ, ప్రేక్షకులు ఆ సన్నివేశాలకి బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది. ఆకట్టుకునే కథా కథనాలు, ఊహకందని మలుపులతో కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ‘ఉద్వేగం’ చిత్రం, ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది.

ఎవరెలా చేశారంటే… త్రిగుణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ బాగుంది. యువ లాయర్ గా జీవించాడు. నటనలోనూ ఎంతో పరిణితి కనబరిచాడు. దీప్షిక తన పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. త్రిగుణ్ తో కలిసి ఉన్న ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు. జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ బాగానే నవ్వులు పంచారు. ఇక లాయర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు శివకృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు: దర్శకుడు మహిపాల్ రెడ్డి ఈ కోర్టు డ్రామాను ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నీట్ గా, ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు. తనదైన స్క్రీన్ ప్లే, నేరేషన్ తో ప్రేక్షకులను చివరి వరకు కథతో ప్రయాణం చేసేలా చేయగలిగారు. జి.వి. అజయ్ కుమార్ కెమెరా పనితనం బాగానే ఉంది. జశ్వీన్ ప్రభు ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. మ్యూజిక్ డైరక్టర్ గా కార్తిక్ కొడగండ్ల డీసెంట్ జాబ్ చేశారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.