సినిమా ఇండ‌స్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి : నవతరం నటుడు రాజ్

0
15
To excel in the film industry, you need talent as well as luck: New era actor Raj
To excel in the film industry, you need talent as well as luck: New era actor Raj

సాధారణ జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సెలబ్రెటీగా మారతాడని ఎవరైనా ఊహించగలరా? సరిగ్గా రాజ్ (రాజశేఖర్) జీవితంలో ఇదే జరిగింది. ఆఫీస్ బాయ్ నుంచి మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అర్జున్ రాంపాల్, రాహుల్ బోస్, నీల్ నితిన్ ముఖేష్, సోహా అలీ ఖాన్, అమలా పాల్, రమ్య కృష్ణ వంటి వారితో కలిసి ర్యాంప్‌పై నడిచి ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగులు విరజిమ్మాడు. అటు తర్వాత ‘స్టార్ మా’ లో ప్రఖ్యాత నటుడు నాగార్జున అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ -6 హౌస్ లోకి ఎంటరై ఆ రియాలిటీ షో ద్వారా అత్యంత వీక్షకాదరణ పొందాడు రాజ్. ‘బిగ్ బాస్’లోకి అడుగుపెట్టిన కంటిస్టెంట్లు ఎందరో సెలబ్రెటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా పేరు తెచ్చుకున్నవారిలో రాజ్ కూడా ఒకరు. ఇప్పుడు అతడి దృష్టి అంతా ఎక్కడెక్కడో విహరిస్తోంది. ఇంద్రధనస్సులాంటి రంగుల ప్రపంచలోకి తొంగి చూస్తోంది. కలలో కూడా అతడి ఆలోచనలన్నీ సిల్వర్ స్క్రీన్ చుట్టే తిరుగుతున్నాయి. ఏదో సాధించాలన్న పట్టుదల, కసి అదే పనిగా ఉసి గొల్పుతోంది. ప్రతీ మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ని ఎలా సాధించాలన్నదే పనిగా పెట్టుకుంటారు. రాజ్ కూడా తన గోల్ ఏంటో.. దానిని ఎలా సాధించాలో పట్టుదలతో ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ ప్రయాణంలో అతడిపై అతడికున్న నమ్మకమే బలంగా మారింది. అదే ఊపుతో ఉత్సాహంగా..హుషారుగా రాజ్ ని ముందుకు సాగేలా చేస్తోంది. రాజ్.. తెలుగు ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు. ‘బిగ్ బాస్’ రియాల్టీ షో ద్వారా తిరుగులేని గుర్తింపును సొంతం చేసుకున్నారు తాజాగా ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ లోని ఆటుపోట్లను కూడా తెలియజేశారు. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇంతకీ రాజ్ ఏం చెప్పాలనుకుంటున్నాడో.. ఏం సాధించాలనుకుంటున్నాడో .. అతడి లక్ష్యం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం….

‘బిగ్ బాస్’ గురించి…

-మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఓ చక్కని అవకాశం. ఆ షో తర్వాత నా జీవితం ఎంతో మారిపోయింది. ఆటోలో తిరిగే నేను విమానాలు ఎక్కాను. ఈ ప్రయాణంలో అన్నీ అద్భుతాలే. నాకు ఇంతటి గుర్తింపు వచ్చేలా చేసిన ‘బిగ్ బాస్’కు జీవితాంతం రుణపడిఉంటాను. ‘బిగ్ బాస్’ సీజన్-6లో కంటిస్టెంట్ గా ఎంటరైన నాకు ఆ రియాలిటీ షో ఎంతటి క్రేజ్ ని తెచ్చిపెట్టిందో మరువలేకుండా ఉన్నా. ‘బిగ్ బాస్’ గురించి నాకు పెద్దగా తెలియదు. సడెన్ గా మంచి అవకాశం వచ్చింది. వెళ్ళాను. కాకపోతే.. అక్కడ జీవితం చాలా రిచ్ గా అనిపించింది. కచ్చితంగా ‘బిగ్ బాస్’లో ఎంతో సంతోషంగా గడిపాను. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నా.

సాధించాలనుకుంటున్న లక్ష్యం…

-ఒక నటుడిగా చాలా సినిమాల్లో నటించాలని ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది. కాకపోతే..అన్నీ కుదరాలి కదా. అవకాశాలు రావాలి. దర్శకులు మనకోసం ఒక పాత్ర రాసుకోవాలి. అలా రాసుకున్న పాత్రలో మనం ఇమిడిపోవాలి. ఆ పాత్రకు జీవం పోసేలా నటించాలి. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడి దృష్టి మరలకుండా చేయడం అతిపెద్ద సవాల్. ప్రస్తుతం ఫిలిం మేకర్స్ అందరూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు మనం సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్తే .. ఇంటర్వెల్ లో తినడానికి పెద్దగా ఆప్షన్స్ ఉండేవికావు. అయితే.. పాప్ కార్న్ లేదంటే సమోస. ఇప్పుడు మనకు కావాల్సినన్ని ఉన్నాయి. అప్పట్లో కుటుంబంతో కలిసి సినిమా చూడటమనేది ఎంతో వైవిధ్యంగా ఉండేది. థియేటర్ కు వెళ్లిన దగ్గరినుంచి పార్కింగ్, జనాలను తోసుకుంటూ టికెట్ కొనడం, మన ఫ్యామిలినీ ఎవరూ నెట్టకుండా రక్షణగా నిలిబడటం, ఇంటర్వెల్ లో పాప్ కార్న్ తీసుకురావడం వరకూ ఎన్నో దశలు ఉండేవి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదొక అద్భుతమైన అనుభూతి అనిపించేది. ప్రస్తుతం థియేటర్ లో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి ఇంటర్వెల్ లో మన దగ్గరికీ మెనూ వస్తుంది. థియేటర్లో కూర్చోని ఉంటే సడెన్ గా ఏదో ఒక పక్క మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఉంటుంది. నచ్చిన ఆహారం అందించడానికి మెనూ కార్డుతో థియేటర్ సిబ్బంది వస్తారు. పాప్ కార్న్ నుంచి పానీపూరీ వరకూ అన్నీ తీసుకొస్తున్నారు. పానీపూరి వస్తే అది ఏ పానీతో చేశారో చూడటానికి మళ్ళీ ఫ్లాష్ లైట్ వేస్తారు. మనం సినిమా చూడాలంటే వీటన్నింటినీ భరించాలి. ఇదే సమయంలో మూవీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయినా మనతో వచ్చిన తల్లిదండ్రులు ‘మనీ వేస్ట్’ అంటూ ఏదో ఒకటి మాట్లాడటం మొదలు పెడతారు. సినిమా క్లైమాక్స్ కు వచ్చే సరికి పార్కింగ్ ఏరియా నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఒక్కరు లేచి సినిమా చూస్తున్న మిగిలిన వారికి అడ్డంగా వెళ్తూ ఇబ్బంది కలిగిస్తారు. ఇన్ని ఇబ్బందులమధ్య సినిమా ఏ మాత్రం మెప్పించకపోయినా ప్రేక్షకులు అస్సలు క్షమించరు. అందుకే మనం చేసే సినిమా ఏదైనా అందరికీ నచ్చేలా.. ప్రతీ ఒక్కరూ మెచ్చేలా ఉండాలి . అలాగే ప్రస్తుతం చిన్నారులు సినిమా చూసేలా చేయడం అన్నింటికన్నా పెద్ద సమస్య. దానికి కూడా అధిగమించాలి. అప్పుడే నటుడిగా మనం ఎదుగుతాం. స్టోరీ సెలక్షన్స్ కు ప్రత్యేకంగా ఫార్ములా ఏం లేదు. ఏ కథనైనా ప్రేక్షకుడి కోణంలో చూడాలి. ‘వీడు ఏదైనా చెయ్యగలడు’ అనే పేరు తెచ్చుకోవాలనుంది. ఆడియన్స్‌ కూడా ఏ సినిమాని ఆ సినిమాగానే చూస్తారు. వారికి వినోదాన్ని పంచడమే లక్ష్యం కావాలి. ప్రతి నటుడి కెరీర్ లో ఒక ప్రత్యేక పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి పాత్రలో నటించాలన్నదే నా ముందున్న ప్రధాన లక్ష్యం.

విమర్శల గురించి…

-ప్రశంసలను ఏ విధంగా స్వీకరిస్తామో అదే విధంగా విమర్శలనూ స్వాగతించాలి. మొదట్లో విమర్శలు వచ్చినప్పుడు బాధగా అనిపించేది. వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అనుకునేవాడిని. సోషల్ మీడియాలో ఇప్పటితో పోలిస్తే అప్పట్లో ఇంకా ఎక్కువగా కామెంట్స్ వచ్చేవి అలాంటి కామెంట్స్ ని సరదాగా తీసుకోవడం నేర్చుకున్నాను.

సెలబ్రెటీలపై వచ్చే ట్రోలింగ్ ల గురించి…

-నేను ట్రోలింగ్ లను అస్సలు పట్టించుకోను . పక్కవారు నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనం నాశనం అవుతాం. ఒకరిని మార్చాలని ఎప్పుడూ భావించకూడదు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ట్రోలింగ్ చేయడంవల్ల వాళ్లకు ఏం ఆనందం కలుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఈ విషయంలో ఎవరినీ నిందించను. ఈ ట్రోలింగ్ లతో సెలబ్రెటీలు ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

చేయాలనుకుంటున్న పాత్రలు ….

  • అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలనుంది. ఈ జీవితంలో సునామీలాంటి ఒత్తిడికిలోనైన సందర్భాలున్నాయి. ఒక సముద్రాన్ని ఈదుతున్న ఇండస్ట్రీలో నిలబడటం. ఎంతో ముఖ్యం. ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ మనం వెనక్కే వెళ్లాల్సి వస్తుంది. వర్క్ ని ప్రేమించే నేను నటుడిగా నిలదొక్కుకోవాలంటే నాకు ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలి. అలా దొరికినప్పుడు నేను ప్రేక్షకులను నటనతో విశేషంగా ఆకట్టుకుంటానన్ననమ్మకం నాకు ఉంది. మిగిలినది ఆ దేవుడి దయ. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. వేటికీ మినహాయింపు ఏమీ లేదు. విజయాలు.. అపజయాలు సమస్యలు ఇలా అన్నీ పలకరించాయి. నటుడిగా రాబోయే భవిష్యత్తు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇప్పుడు మరింత పరిణతితో ఉన్నా. నా బలాలు .. బలహీనతలను అర్థం చేసుకున్నా. గడిచిన ఏళ్లు నాకు ఒక అనుభవంలాంటివి. టాలీవుడ్ హీరోలు రోజురోజుకి అప్‌డేట్ అవుతున్నారు. మూస‌ధార‌ణిలో కాకుండా స‌రికొత్త క‌థాంశంతో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్నారు. టాలీవుడ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి చేర‌డంతో మ‌న హీరోల‌తో సినిమాలు చేసేందుకు ఇత‌ర ఇండ‌స్ట్రీల‌కి చెందిన ద‌ర్శ‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. ముఖ్యంగా త‌మిళ ద‌ర్శ‌కులు ఈ మ‌ధ్య టాలీవుడ్ హీరోల‌ని టార్గెట్ చేస్తూ వారితో బ‌డా ప్రాజెక్టులు చేసేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నారు. సినిమా ఇండ‌స్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉండాలి . కొంద‌రు ద‌ర్శ‌కుల ద‌గ్గ‌ర మంచి క‌థ‌లు ఉన్నా కూడా స్టార్ హీరోల డేట్స్ దొర‌క్క ఇబ్బందులు ప‌డుతుంటారు. ఒక‌వేళ దొరికినా కూడా ఏవో అవాంత‌రాలు వ‌చ్చి ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోతుంటాయి.

ప్రేక్షకులే దేవుళ్ళు…

-నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాలనుకుంటున్న. ప్రేక్షకుల మదిలో ఎల్లకాలం గుర్తుండిపోయే పాత్రల్నే చేయాలనుకుంటున్నా. కథానాయకుడి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తే మరింత ఒత్తిడి ఉంటుంది. ఆ సినిమా విజయం కోసం నా వంతు కష్టపడి పనిచేస్తా. అయినా కూడా సక్సెస్ మన చేతుల్లో ఉండదు. ప్రస్తుతం ఆ దిశగా నేను నా వృత్తినే ప్రేమించాలనుకుంటున్నా. నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. నా కెరీర్ లోని ప్రతి దశను ఆస్వాదించాలనుకుం టున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందాలనుంది. ప్రేక్షకులే దేవుళ్ళు. ఇండస్ట్రీ ప్రోత్సాహం.. ప్రేక్షకుల ఆదరణ నాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. (రాజ్.. మెయిల్ ఐడి [email protected] & కాంటాక్ట్ నంబర్: 9000808908)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here