శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో అపచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో మహా శాంతియాగం చేపట్టారు. పూర్ణాహుతితో శాస్తోక్తర్రగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగింది. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జితసేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. ప్రస్తుతం మహాశాంతియాగం ముగియగా.. పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేపట్టారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం తితిదే ఈవో శ్యామలరావు, ఆలయ అర్చకులు విూడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామి వారికి మహానైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామని అన్నారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారుచేశాం. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో తొలగుతాయని వేణుగోపాల దీక్షితులు అన్నారు. తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడిరచారు. తిరుమల ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో తెలుసో తెలియక జరిగే దోష నివారణకు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఆగస్టులోనే ఆలయంలో అన్న ప్రసాదపోటు, లడ్డూ పోటులో సంప్రోక్షణ చేశాం. అందులోని కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను సమర్పించాం. కల్తీ నెయ్యి వలన ఏమైనా దోషాలు ఉండుంటే కూడా తొలగిపోయాయి. అయినప్పటికీ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా ఆగమశాస్త్ర పండితులు, పెద్దజియ్యంగార్లను సంప్రదించిన తర్వాత సీఎం చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతిహోమం చేపట్టామని అన్నారు. శ్రీవారి ఆలయంలోని యాగబావి వద్ద యాగశాలలో, మూడు హోమగుండాలు (వాస్తు, సభ్యం, పౌండరీక) ఏర్పాటు చేసి శాస్తోక్తర్రగా నిర్వహించామని అన్నారు. అదేవిధంగా అన్ని ఆలయాల్లో పంచగవ్య ప్రోక్షణ చేపట్టామని ఈవో శ్యామలరావు వివరించారు.