Pottel Movie Review in Telugu : ఆకట్టుకునే ‘పొట్టేల్’

0
62
Pottel Movie Review in Telugu :
Pottel Movie Review in Telugu :

యువ చంద్ర కృష్ణ హీరోగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొట్టేల్’. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ( 25, అక్టోబర్-2024) విడుదలయింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్ పరంగా హడావిడి చేసింది. సినీ ప్రముఖుల ఇళ్లల్లోకి పొట్టేలుని తీసుకొని ప్రచారాన్ని నిర్వహించి సినిమాపై ఎక్కువగానే హైప్ ని క్రియేట్ చేసింది. విజయాన్ని అందుకోవాలని చిత్రసీమకు చెందిన నటీనటులతో సినిమాకు ఆశీర్వాదాలు తీసుకుంది. మరి ఇంత హడావుడి చేసిన ‘పొట్టేల్’ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల మెప్పుని పొందిందో తెలుసుకుందాం…

కథలోకి వెళదాం… మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఓ ఊర్లో 1970, 80వ దశకంలో ఈ కథ సాగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను బలి ఇవ్వాలనేది ఆ ఊరి కట్టుబాటు, ఆచారం. అలాగే, ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని అక్కడి ప్రజలు తెగ గుడ్డిగా నమ్ముతుంటారు. అయితే, ఆ ఊరి పటేల్ (అజయ్)కి మాత్రం చిన్న తనం నుంచి బాలమ్మ పూనదు. ఈ నేపథ్యంలో బాలమ్మ పూనకం ముసుగులో పటేల్ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. మరోవైపు పెద్ద గంగాదరీ ( యువ చంద్ర) తనకి ఇష్టం లేకుండానే చిన్నతనం నుంచే వారసత్వపు వృత్తిగా వచ్చిన గొర్రెలని మేపుతూ కాలం గడుపుతుంటాడు. అందులో భాగంగానే ‘బాలమ్మ’ అమ్మవారి అనుగ్రహంగా ఊరి వాళ్ళు భావించే ‘పొట్టెల్’ని పెద్ద గంగాదరీ పెంచుతుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో పటేల్‌కు వ్యతిరేకంగా పెద్ద గంగాదరీ తన కూతురు సరస్వతిని టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్) సాయంతో ఎలా చదివించాడు ?, అసలు పెద్ద గంగాదరీకి చదువు పై ఎందుకు అంత మమకారం ?, తనకు చదువు లేకపోవడం వల్ల పెద్ద గంగాదరీ జీవితంలో ఏం కోల్పోయాడు ?, ఇంతకీ పెద్ద గంగాదరీ చదువు విషయంలో ఏం సాధించాడు ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిదే…

విశ్లేషణ: కూతురిని చదివించడం కోసం ఓ తండ్రి పడే తపన, ఆవేదన ఈ సినిమాలో ఆకట్టుకుంది.‘పొట్టేల్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా కథా నేపథ్యం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం నాటి కథా నేపథ్యం కాబట్టి, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పాత్రల చిత్రీకరణతో పాటు సెటప్ ను కూడా బాగా డిజైన్ చేశారు. ఈ క్రమంలో పటేల్ కి, హీరోకి మధ్య జరిగే డ్రామా కూడా బాగుంది. తెలంగాణ ప్రాంతంలోని పటేల్‌ వ్యవస్థ కాలం నాటి ఎలిమెంట్స్ ఇప్పటి తరానికి అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. ఐతే, ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ జనరేషన్‌కి చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇలాంటి కథను ఎంచుకున్న దర్శకుడిని అభినందించి తీరాల్సిందే. కాకపోతే, ఆ ప్రయత్నం ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమాకి మరింత మేలు జరిగేది. అదే విధంగా హీరో పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. ఒకప్పుడు తెలంగాణలోని పటేల్‌ వ్యవస్థ వల్ల బడుగుబలహీన వర్గాలు, దళిత ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు?, అప్పట్లో బానిసలుగా ఎంతగా నలిగిపోయేవారో.. ముఖ్యంగా చదువు విషయంలో దళిత వర్గాల పిల్లలు ఎంత అన్యాయానికి గురి అయ్యారో ఈ చిత్రంలో చక్కగా తెరకెక్కించారు. అదేవిధంగా చిన్నారి సెంటిమెంట్‌, బాలమ్మ (అమ్మోరు) ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సినిమాలో ఎమోషన్స్ ని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసిన దర్శకుడు, కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం చాలా స్లోగా నడిపాడు. నిజానికి కథా నేపథ్యం తాలూకు సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ముఖ్యంగా ద్వితీయార్ధం మధ్యలో వచ్చే సన్నివేశాలను ఇంకా బాగా ఆసక్తికరంగా మలిచి ఉండాల్సింది. దర్శకుడు సాహిత్ మోత్కూరి తన సినిమాకు చక్కటి కథానేపథ్యాన్ని ఎంచుకొని.. అంతే చక్కగా నడిపించి ప్రేక్షకుల చేత వాహ్… అనిపించారు. ప్రేక్షకులు మెచ్చే మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సన్నివేశాలను రాసుకోవడంలో మాత్రం తడబడ్డట్టి కనిపించింది. ఆయన తెరకెక్కించిన సన్నివేశాలన్నీ బాగానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలపరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది.
నటీనటుల విషయానికి వస్తే.. యువ చంద్ర క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. అతడి పాత్రని మలిచిన తీరు బాగుంది. తన పాత్రలో యువ చంద్ర కూడా చక్కగా నటించి ప్రేక్షకుల మెప్పును పొందాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన అనన్య నాగళ్ల తన నటనతో ఆద్యంతం ఆకట్టుకుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ బాగా నటించి సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే, ఛత్రపతి శేఖర్, తనస్వి చౌదరి,ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ లతో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకున్న పరిధిమేరకు నటించి మెప్పించారు.

టెక్నీకల్ విషయాలకొస్తే… దర్శకుడి ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు ముందుగా నిర్మాతలను అభినందించాలి. నిర్మాతలు ‘సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితిల నిర్మాణ విలువులు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం, ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ విభాగాలు ఓకే అనిపించాయి. ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేప్రేక్షకులకు ఈ ‘పొట్టేల్’ నచ్చితీరుతుంది.

(చిత్రం: పొట్టేల్, దర్శకత్వం : సాహిత్ మోత్కూరి, విడుదల : 25, అక్టోబర్-2024, రేటింగ్ : 2.5/5, నటీనటులు : యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల , అజయ్, నోయల్, తనస్వీ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్, ప్రియాంక శర్మ తదితరులు. సంగీతం : శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ : మోనిశ్ భూపతి రాజు, ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్, నిర్మాతలు : సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితి)