సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగియడంతో ఇరు తెలుగు రాష్టాల్ల్రో మళ్లీ రాజకీయ సందడి మొదలయ్యింది. వచ్చేది స్థానిక ఎన్నికల కాలం కావడంతో ఛోటామోటా నేతలు ఇప్పటికే హడావిడి చేస్తున్నారు. ఎపిలో కొత్తగా ఎంపికయిన ఎమ్మెల్యేలు కూడా గ్రామాల బాట పడుతున్నారు. ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. దీంతో తెలంగాణతో పాటు ఎపిలోనూ రాజకీయ సందడి మొదలయ్యింది. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీల సందడి జోరుగా కనిపించింది. అయితే అది ప్రచారమే కావడం వల్ల ఇప్పుడు అసలుసిసలుగా రాజకీయం ఉండబోతున్నది. ఇచ్చిన హావిూల మేరకు ప్రజలు కూడా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రజలకు దన్యవాద కార్యక్రమాలల్లో ఉన్నారు. జిల్లాల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో పేరిట ప్రజల్లోకి వెళ్లి తమ వాణిని వినిపిస్తు న్నాయి. తెలంగాణ మొత్తం అభివృద్ది చెందిందన్న ప్రచారంతో ప్రజలను బురిడీ కొట్టించిన బిఆర్‌ఎస్ నేతలు గ్రామాల్లో తలెత్తుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు జనంలో ఉండాలన్న అధికార పక్షం ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తమ ప్రభుత్వాల పాలన, పార్టీ కార్యక్రమాలు, లక్ష్యాలు, పనితీరును వివరించడానికి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపై వివరిస్తూ బీజేపీ నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. గెలిచిన వారు ఎపిలో ప్రజలను నేరుగా కలుసుకునేలా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ ఎంపిలు ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నారు.