ఏపీ మళ్లీ వైసిపిదే అధికారం
జగన్ రెండోసారి సిఎంగా ప్రమాణం ఖాయం
తిరుమలలో మంత్రి రోజా వెల్లడి
తిరుమల : ఏపీలో ఎన్డీయే కూటమిదే అధికారమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే తామే గెలవబోతున్నామంటూ వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కానే కాదని అంటున్నారు. మంత్రి ఆర్కే రోజా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అధికారం జగన్‌దేనని అన్నారు. ఆదివారం మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి రోజా వివరించారు. జనం మరోసారి వైసీపీకి పట్టం కట్టారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయంపై కొందరు నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలు రాబట్టారని ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో.. అదేవిధంగా వైసీపీ గెలుపును ఆపలేరని రోజా స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్ సంబంధం లేదని మంత్రి రోజా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయం అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.