ఓపెనర్‌గా రోహిత్‌ వద్దు: మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ కొత్త ప్రతిపాదన

0
54
No Rohit as opener: Former cricketer Wasim Jaffer's new proposal
No Rohit as opener: Former cricketer Wasim Jaffer's new proposal

రో నాలుగు రోజుల్లో మహా సమరం ప్రారంభం కానుంది. జూన్‌ 2న నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్‌ కప్‌కు అమెరికా-వెస్టిండీస్‌ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్‌ పొట్టి ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో యూఎస్‌ఏలో అడుగుపెట్టింది. అగ్రరాజ్యలో కఠోర సాధన చేస్తూ టీమిండియా చెమటోడుస్తుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతూ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మెగాటోర్నీలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగొద్దని మాజీ క్రికెటర్‌ వసీమ్‌ జాఫర్‌ సూచించాడు. రోహిత్‌కు బదులుగా యశస్వీ జైస్వాల్‌తో కలిసి విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా రోహిత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని అన్నాడు. జట్టు ఆరంభానికి తగ్గట్లుగా సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి రోహిత్‌ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ స్పిన్‌లో ఎంతో బాగా ఆడగలడని, కాబట్టి నాలుగో స్థానంలో వస్తే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని వసీమ్‌ జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. ట్విటర్‌ వేదికగా తన సలహాలు వివరించాడు. ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి ఓపెనర్‌గా సత్తాచాటాడు. 15 మ్యాచ్‌ల్లో 61 సగటు, 154 స్ట్రైక్‌రేటుతో 741 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. అయితే ఓపెనర్‌గా కోహ్లి ఓకే అని, కానీ రోహిత్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం సరైన ఆలోచన కాదని జాఫర్‌ ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా రోహిత్‌ ఓపెనర్‌గా రావడమే కరెక్ట్‌ అని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాగా, గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.