ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించే జాతీయ పురస్కారం తులసి సమ్మాన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవ రాజ్ భట్ ను ఎంపిక చేయడం విశేషం. తులసి సమ్మాన్ జాతీయ పురస్కారంతో రాఘవ రాజ్ భట్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ సి. పటేల్ ఘనంగా సత్కరించారు. భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళలకు ఆయన అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది. తెలుగు జానపద కళాబ్రహ్మ డా. గోపాల్ రాజ్ భట్ వారసుడు రాఘవ రాజ్ భట్. భారతీయ జానపద కళలను పరిరక్షిస్తూ పరివ్యాప్తి చేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల లో ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. కథక్, జానపద కళలకు అంకితమై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పద్మవిభూషణ్ పండిట్ బిర్జు మహారాజ్ దగ్గర శిష్యరికం చేసి ఉత్తరాది కథక్ నృత్యాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృత ప్రాచుర్యము కల్పించారు. వారి భార్య మంగళ భట్ కూడా ప్రముఖ కథక్ నాట్యగురుగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇరువురు ఆర్టిస్టిక్ డైరెక్టర్లు గా, కథక్ నాట్యగురువులుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ, సిసిఆర్టీ, ఐసీసీఆర్ సంస్థల గుర్తింపు పొంది గత మూడున్నర దశాబ్దాలుగా వేలాది ప్రదర్శనలు ఇచ్చినట్లు రాఘవ రాజ్ భట్ తెలిపారు. తన తండ్రి గోపాల్ రాజ్ భట్ కు ఈ పురస్కారం అంకితం అని, ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం కళారంగానికి అంకితమై కళల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.