నిజానికి ఆయన్ని కలిసేంత వరకు నాకు ప్రత్యేకంగా ఫెవరెట్ హీరోలంటూ ఎవరూ లేరు! నేను అప్పటి వరకు సినిమాలు చూడటమే తక్కువ! ఎప్పుడైనా మూడ్ వస్తే బాలీవుడ్ సినిమాలు చూసే వాడ్ని! అందుకే హైదరాబాద్ కు ఏ బాలీవుడ్ తార వచ్చినా అప్పటి జ్యోతిచిత్ర ఎడిటర్లు వెంకట్రావు గారు లేదా మోహన్ కుమార్ గారు ఇంటర్వ్యూ చేసి రాసే ఛాన్స్ నాకే ఇచ్చే వారు! కానీ, అతన్ని కలసిన తరువాత తెలుగు సినిమాపై ఆసక్తి పెరిగింది! అతనే డేరింగ్ డాషింగ్ హీరో నటశేఖర కృష్ణ ఘట్టమనేని!
ఆంధ్రజ్యోతి లాక్ అవుట్ తరువాత మరుసటి రోజు అంటే 2001 జనవరి 1న మోహన్ కుమార్ గారు ఆటో లో ఎస్ ఆర్ నగర్ లో వున్న మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకెళ్లారు! అది పద్మాలయ స్టూడియో! ఏదో షూటింగ్ కవరేజ్ కు తీసుకొచ్చారేమో అనుకున్న! నేరుగా అక్కడ ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు! హాల్లో సోఫాలో కూర్చున్నాం! అరగంట తరువాత మిలమిల మెరిసే అందగాడు నల్ల కళ్లద్దాలు పెట్టుకుని మా ముందుకు వచ్చారు. అతడే డేరింగ్ డైనమేట్ సూపర్ స్టార్ కృష్ణ! పరిచయాలు అయ్యాక బ్రేక్ ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం అన్నారు!
కృష్ణ గారు పెద్దగా మాట్లాడకపోయినా అన్నీ మోహన్ కుమార్ మాట్లాడేస్తున్నారు! రేపటి నుంచి నీ ఉద్యోగం ఇక్కడే! నీ టీలు, టిఫిన్లు, లంచ్ అన్నీ ఇక్కడే అని చెప్పారు. బయటకు వచ్చాక ఏం చేయాలి అన్నాను మోహన్ కుమార్ తో! “పిచ్చోడా… ఏం చేయక్కర లేదు! ఆయనతో మాట్లాడు, అయన మాట్లాడితే విను”… అదే నీ ఉద్యోగం అన్నారు! ఇంకొకరు అయితే ఎగిరి గంతేసే వారు! నాకు సినిమా పిచ్చి లేదు కాబట్టి, ఉద్యోగం తప్పనిసరి కాబట్టి అయిష్టంగా అంగీకరించాను!
మరుసటి రోజు పది గంటలకు వెళ్ళాను. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆంధ్రజ్యోతి లో జీతం ఎంత ఇచ్చారు అని అడిగారు కృష్ణ గారు. చెప్పాను, వెంటనే అక్కడెవరినో పిలిచి “ఇతను రోజూ వస్తారు, నువ్వు కూర్చునే గదిలో ఈయనకు ఒక కుర్చీ వెయ్, ఎక్కువగా ఈయన నాతో ఉంటారు, నేను లేనప్పుడు నీ దగ్గర కూర్చుంటారు, ప్రతి నెల ఒకటో తేదీ ఇంత జీతం ఇచ్చేయ్ అన్నారు! ఆయన చెప్పిన ఆ జీతం విని నాకు మతి పోయినంత పని అయ్యింది! ఆంధ్రజ్యోతి లో నా జీతం కన్నా ఐదింతలు ఎక్కువ!
రోజూ నేను చేసే పని కూడా ఏం లేదు! న్యూస్ పేపర్స్ లో ఏమైనా ఆసక్తికర విశేషాలు ఉంటే చదివి వినిపించడం, ఆయన మాట్లాడేది వినడం, పిచ్చా పాటి మాట్లాడుకోవడం, ఆయనతో కలసి తినడం… ఇదే నా ఉద్యోగం!
ఎన్నో విశేషాలు పంచుకున్నారు కాని, చాలా తక్కువ మాట్లాడే వారు! ఎక్కువ వింటారు! నెగటివిటీ దగ్గరకు రానివ్వరు, వినరు! ఒకవేళ ఎవరి గురించి అయినా చెబుతున్నా మనకెందుకులెండి, వారి కర్మ అని కట్ చేస్తారు! ఇక ఆయనతో సినిమాల గురించి మాట్లాడటానికి తెలుగు సినిమా గురించి స్టడీ చేయడం, తెలుగు సినిమాలు చూడటం మొదలుపెట్టాను! తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది! అందుకే నా ఫెవరెట్ హీరో కౌబోయ్ కృష్ణ అని చెప్పుకునే వాడ్ని!
“కృష్ణ మనసులో మాటలు” అని పుస్తకం రాయాలనిపిస్తూనే వుంది కానీ, ముందుకు కదల్లేదు! నేనొకసారి మీ జీవితంలో మీరు ఇబ్బంది పడిన అత్యంత దారుణమైన విషయం చెప్పండి అనడిగాను! నేనెక్కడో షూటింగ్ బిజీలో ఉంటే నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేను నాదెండ్ల భాస్కరరావును అభినందిస్తూ ఈనాడు పత్రికలో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అది చూసి అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఫోన్ చేశారు. అది నాకు తెలియకుండా చేసిన పెద్ద డ్యామేజ్! నాదెండ్ల భాస్కరరావు గారు స్వయంగా చెప్పి వేయించుకున్నారని తరువాత తెలిసింది. అప్పట్లో ఖండన కూడా ఇచ్చాను అని వివరించారు. రాజకీయ రంగం నుంచి దూరంగా జరగడానికి కారణం అనడిగితే… ఏలూరు ప్రజలు ఎంపి గా ఓడించడం బాగా కలచి వేసిందని, రాజీవ్ గాంధీ హత్య తో అసలు రాజకీయాలు అంటే విరక్తి కలిగిందని చెప్పారు! ఇలాంటివి చాలా విశేషాలు ఉన్నాయి! అవన్నీ పుస్తకంలో పొందుపరుస్తాను!
కొన్నాళ్ళ తరువాత పద్మాలయ యానిమేషన్స్ లో స్క్రిప్ట్ రైటర్ గా ఆయనే చేర్పించారు. అక్కడ నుంచి వార్తలో చేరాను. జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా ఇంటర్వ్యూ చేశాను. ఇక దాదాపు అందరు తెలుగు నటులను ఇంటర్వ్యూలు చేయడం, అలాగే డైరీ లో ఒక పేజీ అని ఒక రోజంతా ఆయా నటులతో ఉండటం.. అలా తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది! అది బలంగా పెనవేసుకు పోయింది! దీనంతటికీ కారణం నా హీరో నటశేఖర కృష్ణ గారే! హీరోలలో నిజమైన హీరో! నిజ జీవితంలో నటించని ఒకే ఒక్క హీరో! మనసున్న సూపర్ హీరో కృష్ణ ఘట్టమనేని! ఇవాళ ఆ మహానుభావుడి 81వ జయంతి! ఘన నివాళులు.
– డా. మహ్మద్ రఫీ