తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రనాట్యం సృష్టికర్త, పేరిణి పునరుద్ధరణ నాట్య గురు పద్మశ్రీ డా. నటరాజ రామకృష్ణ 102వ జయంతి ఉత్సవాలను ఈనెల 21వ తేదీ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల తెలిపారు. మంగళవారం కళాభవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా విశేషాలు ఆమె వెల్లడించారు. సంబంధిత బ్రోచర్ ను డా. అలేఖ్య పుంజాల విడుదల చేశారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్సవాలు ప్రారంభ మవుతాయని, సదస్సు, పత్ర సమర్పణల అనంతరం సాయంత్రం జరిగే వేడుకలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై కళాకారులను సత్కరిస్తారు. ప్రముఖ నాట్య గురువులు, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీతలు డా. కళాకృష్ణ, డా. జొన్నలగడ్డ అనూరాధ, గంధం బసవ శంకర్ తదితరులు అభినయ పూర్వక పత్ర సమర్పణ చేయనున్నారు. ప్రముఖ నాట్య గురువు డా. రమా భరద్వాజ్ నవగ్రహ అవతరణం ప్రదర్శించనున్నారు. నటరాజ రామకృష్ణ శిష్యులు పేరిణి శివ తాండవం, ఆంధ్ర, లాస్య నృత్యాలు ప్రదర్శిస్తారని డా. అలేఖ్య పుంజాల తెలిపారు. నవ జనార్దనం, ఆంధ్ర నాట్యం, పేరిణి శివతాండవ నృత్య వికాసం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహా నాట్య గురువు నటరాజ రామకృష్ణ కు తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న నృత్య నివాళి అని ఆమె అభివర్ణించారు. తారామతి బారాదరి ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత నటరాజ రామకృష్ణ కు దక్కుతుందన్నారు. ఎన్నో నాట్య గ్రంథాలు రచించి తరతరాలకు నాట్య విజ్ఞానాన్ని అందించారని ఆమె కొనియాడారు. ఈ సమావేశంలో సంగీత నాటక అకాడమీ కార్యదర్శి బి. మనోహర్, ఓఎస్డి ఆర్.వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఉచిత ప్రవేశమని, నృత్య కళాకారులు నాట్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.