ప్రస్తుతం మనం సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు చూస్తూ విస్తుపోతున్నాం. ఇక దొంగతనాలంటారా వాటికి అంతేలేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ క్షణాల్లో దొంగలు వీరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టం వచ్చినంత దోచేసుకుంటున్నారు. మోసపోయిన ప్రజలు న్యాయం కోసం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వద్దాం.. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా.. ఏ నోటవిన్నా నా మొబైల్ ఫోన్ పోయింది.. ఎవరో ఎత్తుకెళ్లారు .. ఎక్కడో పడిపోయింది.. దొరకడంలేదు అంటూ సదరు వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా మొబైల్ ఫోన్ ఇప్పించండంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసుకులు రికవరీ వేటలో తమవంతో పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బండ్లగూడలో జరిగింది. బండ్లగూడలోని రాజీవ్ స్వగృహలో నివాసముంటున్న సంజయ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్ ఒకటి మంగళవారం బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ సమీపంలో చోరీ జరిగింది. మొబైల్ ఫోన్ ఎవరు ఎత్తుకెళ్లారోనంటూ వెతికినా ఫలితం లేకుండా పోవడంతో గురువారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుడు సంజయ్ కుమార్ ఫిర్యాదు స్వీకరించిన సి.ఐ సూర్యనాయక్ , ఎస్.ఐ రమేష్, హిమబిందు (ఉమెన్ పోలీస్ ) చాకచక్యంతో 24 గంటల్లో మొబైల్ ఫోన్ రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. ఫోన్ దొరికిన ఆనందంలో సి.ఐ సూర్యనాయక్ , హిమబిందులకు బాధితుడు సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటల్లో మొబైల్ ఫోన్ రికవరీ చేసి అందించడం ఎంతో ఆనందమేసిందని బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు.