సర్ఫరాజ్‌ సెంచరీపై పలువురు క్రికెటర్లు ప్రశంసలు

0
28
Many cricketers praised Sarfaraz's century
Many cricketers praised Sarfaraz's century

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మధ్య శనివారం జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ అద్భుత సెంచరీ సాధించాడు. నాలుగో రోజు బెంగళూరు స్టేడియంలో 110 బంతుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్‌.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీతో రాణించిన సర్ఫరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శతకం సాధించడంపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, ఆస్ట్రేలియా మాజీ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. అతడిని అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘సర్ఫరాజ్‌ ఖాన్‌.. జట్టుకి అవసరమైనప్పుడు ఇలాంటి ఒక ఇన్నింగ్స్‌ ఆడి నీ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయం’ అని సచిన్‌ పోస్ట్‌ చేశాడు. మరోవైపు.. డేవిడ్‌ వార్నర్‌ కూడా ‘‘బాగా ఆడావు సర్ఫరాజ్‌. నువ్వు చేసిన హార్డ్‌ వర్క్‌ కనిపిస్తోంది. సెంచరీ చేయడం చాలా గొప్ప విషయం’ అని వార్నర్‌ ఇన్‌స్టాస్టోరీలో షేర్‌ చేశాడు. 2024 ఫిబ్రవరిలో సర్ఫరాజ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన ఘనతను సాధించాడు. అంతకుముందు మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు.. అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అతను 51 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 69.09 అద్భుతమైన సగటుతో 4422 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. అతన్ని భారత దేశవాళీ క్రికెట్‌లో ‘డాన్‌ బ్రాడ్‌మన్‌’ అని కూడా పిలుస్తారు.