ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ వేడుక

0
5
'Mad Square' grand victory celebration
'Mad Square' grand victory celebration

నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న ఈ చిత్రం, భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “అభిమాన సోదరులందరికీ నమస్కారం. చాలాకాలం అయిపోయింది మిమ్మల్ని ఇలా కలిసి. ఈరోజు నాగవంశీ పుణ్యాన మనం ఇలా కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. మనకు ఎన్నో బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి వచ్చి మనల్ని నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటకు వెళ్ళిపోదాం కదా అనే ఆలోచన మన అందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు ఇక్కడ. మ్యాడ్ 2 తో ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ కి కంగ్రాచులేషన్స్. ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ గా అంతకంటే గొప్పగా ప్రేక్షకులను రంజింపజేయడం చాలా కష్టం. కానీ కళ్యాణ్ అది సాధించగలిగాడు. ఎందుకంటే ఆయనది స్వచ్ఛమైన హృదయం. మీ గుండె ఆ స్వచ్ఛతను ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన గొప్ప గుణం అది. చాలా ప్యూర్ గా కథను రాయగలగాలి. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, మీ కెరీర్ లో అభివృద్ధి చెందాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కంగ్రాట్స్. ముఖ్యంగా ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గారు అద్భుతంగా నటించారు. ఒక క్యారెక్టర్ ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానిని నిజమైన పర్ఫామెన్స్ యాక్టర్ ఇవ్వగలిగినప్పుడు ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్ గా నాకు తెలుసు. ఈ సినిమాకి పిల్లర్ లా నిలిచిన మురళీధర్ గారికి కంగ్రాట్స్. అలాగే ఆంథోనీ. సినిమా చూస్తూ, అతను ఎంటర్ అయినప్పుడు నేను కూడా చప్పట్లు కొట్టాను. మ్యాడ్-1 లో ఆంథోనీ అంటే దేంతోని అంటారు. నేను మరిచిపోలేని క్యారెక్టర్ అది. ఒక కామెడీ చేయగలిగిన క్యారెక్టర్ ని ఒక మాస్ హీరోలా ఎంట్రీ ఇవ్వడం బాగుంది. లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది. నన్ను అందరూ అడుగుతుంటారు రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే ఇన్నోసెంట్ గా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. ఆయనలో ఆ ఇన్నోసెన్స్ లేకపోతే ఈ సినిమాలో కామెడీ ఇంతలా వర్కౌట్ అయ్యేది కాదు. సంగీత్ ని, వాళ్ళన్నయ్య సంతోష్ ని చూస్తే.. నాకు వాళ్ళ గారు శోభన్ గారే గుర్తుకొస్తారు. నేను శోభన్ గారిని ఒకసారి కలిశాను. ఆయనంత హంబుల్ గా ఉండే మనిషిని నేను మళ్ళీ చూడలేదు. శోభన్ గారు మన మధ్యే ఉండి, సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడుతున్నారు అనుకుంటున్నాను. మీరు ఇలాగే మీ దర్శకుడిని నమ్ముకుంటూ ముందుకి వెళ్లిపోండి. సంగీత్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ 1లో రామ్ నితిన్ యంగ్ గా ఉన్నాడు, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాడు. కెమెరా ముందు నిల్చోవడం అంత తేలిక కాదు. మ్యాడ్ లో రామ్ నితిన్ అద్భుతంగా నటించాడు. కామెడీ పలికించడం యాక్టర్ కి చాలా కష్టం. అందుకే నేను అదుర్స్-2 చేయడానికి ఆలోచిస్తున్నాను. రామ్ నితిన్ కి మంచి భవిష్యత్ ఉంది. నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. నేను నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. మంచి దర్శకులు, మంచి నిర్మాతలతో పని చేశాడు కాబట్టే నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు. అలాగే సినిమాలో సత్యం రాజేష్, కార్తికేయ కామెడీకి కూడా బాగా నవ్వుకున్నాను. బ్రహ్మానందం గారు, ఎం.ఎస్. నారాయణ గారు, ధర్మవరం గారి తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడు సునీల్. భాష మీద పట్టు ఉంది. అలాగే కింద స్థాయి నుంచి ఎదుగుకుంటూ ఇక్కడికి వచ్చాడు. చాలా కాలం తర్వాత సునీల్ కామెడీ చూసి మళ్ళీ నవ్వుకున్నాను. సునీల్ విభిన్న పాత్రలతో అలరిస్తున్నాడు. కానీ, నవ్వించడానికే అతను పుట్టాడని నేను నమ్ముతాను. సంగీత దర్శకుడు భీమ్స్ గారికి, గీత రచయిత కాసర్ల శ్యామ్ గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. అత్తారింటికి దారేదిలో ఒక డైలాగ్ ఉంటుంది. మీ వెనకాల కనబడని ఒక శక్తి ఉంది అని, వీళ్ళందరి వెనుక ఆ కనబడని శక్తే మా నాగవంశీ. సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. మాట కఠినంగా ఉంటుంది కానీ, మనసు చాలా మంచిది. ఆ మంచితనమే తనని కాపాడుతుంది. వంశీతో త్వరలో ఒక సినిమా చేయబోతున్నాను. మా చినబాబు గారి చిన్నితల్లి హారిక నిర్మాతగా మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. మ్యాడ్ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్నగారితో చెప్పాను. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటాను.” అన్నారు.
ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. ముందుగా మ్యాడ్ టీంకి యాక్టర్లకి, టెక్నీషియన్స్ కి అందరికీ పేరుపేరునా కంగ్రాచులేషన్స్. మన ఇంటి ఫంక్షన్ లో మన వాళ్ళని మనమే పొగొడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి, ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాకటి నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే ‘జైంట్'(Jaint) గుర్తొస్తుంది. ఆయన నిజంగానే జైంట్.” అన్నారు.
చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, “మా ఈవెంట్ కి వచ్చిన బావ(ఎన్టీఆర్) గారి అభిమానులు థాంక్యూ సో మచ్. నాకు జనతా గ్యారేజ్ లోని ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఒక బలముంది. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. మా మ్యాడ్-1 షూటింగ్ పూర్తయింది. కానీ అప్పటికి సినిమాపై బజ్ లేదు. అప్పుడు బావగారు ట్రైలర్ లాంచ్ చేశారు. కావాల్సినంత బజ్ వచ్చింది. మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మ్యాడ్-2 తో వచ్చాము. థాంక్యూ సో మచ్ బావ(ఎన్టీఆర్). మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసి నటనలో పరిణితి కనబరిచావని బావగారు అన్నారు. దానికి కారణం మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు. షూట్ లో ఒక మెంటర్ గా ఉన్నారు. అలాగే నా సహ నటులు నాకెంతో సపోర్ట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి థాంక్స్.” అన్నారు.
చిత్ర కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, “ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. మ్యాడ్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా లాంచ్ అయినప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలిగింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి వచ్చినందుకు మళ్ళీ థాంక్స్. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు
చిత్ర కథానాయకుడు రామ్ నితిన్‌ మాట్లాడుతూ, “నేను సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మొదట కలిసిన స్టార్ ఎన్టీఆర్ గారు. మా మ్యాడ్ ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. అది ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు.” అన్నారు.
చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, “ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. నేను ముగ్గురికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలపాలి. నాగవంశీ గారు లేకపోతే నేను లేను, చినబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, ఎడిటర్ నవీన్ నూలి గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. అలాగే, ఈ సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా థాంక్స్.” అన్నారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, “మ్యాడ్ ని పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని విడుదలకు ముందు చెప్పాను. మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి, నిర్మాతలు హారిక గారికి, నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్యూ సో మచ్. ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారు ఈ వేడుకకి రావడం సంతోషంగా ఉంది.” అన్నారు.
ప్రముఖ నటుడు సునీల్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో నేను పోషించిన మ్యాక్స్ పాత్ర మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా ఈ జనరేషన్ ని కూడా నవ్వించే అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు.” అన్నారు.
ఈ వేడుకలో నటీనటులు ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, విష్ణు ఓఐ, సత్యం రాజేష్, కార్తికేయ, ఆంథోనీ రవి, రామ్ ప్రసాద్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here