సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన సినిమా ‘జాక్’. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా పాటలకు మంచి బజ్ కూడా వచ్చింది. చిత్ర యూనిట్ చాలా యూనిక్ గా ఈ సినిమా ప్రమోషన్స్ ను చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. సిద్ధూ జొన్నలగడ్డ పూర్తి స్థాయి యాక్షన్ సీన్స్ తో నటించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రవిప్రకాష్, రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ చిత్రంతో సిద్ధూ జొన్నలగడ్డ ఏమాత్రం ఆకట్టుకున్నారో చూద్దం పదండి.
కథ: పాబ్లో నెరోడా అలియాస్ జాక్(సిద్ధూ జొన్నలగడ్డ) ఏం చేయకుండా తిరుగుతూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడు అని తండ్రి ప్రసాద్(నరేష్) ఒక డిటెక్టివ్ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చి కనిపెట్టమంటాడు. దీంతో ఆ డిటెక్టివ్ ఏజెన్సీ ఓనర్ కూతురు అఫ్జానా(వైష్ణవి చైతన్య) తన టీంతో జాక్ వెనక తిరుగుతూ ఉంటుంది. జాక్ ని ట్రాప్ చేసి ఏం చేస్తున్నాడో కనుక్కోవాలనుకుంటుంది. జాక్ రా ఏజెంట్ గా జాబ్ చేయాలనుకుంటాడు. రా ఇంటర్వ్యూకి కూడా వెళ్తాడు. అతనికి ఇంకా జాబ్ రిజల్ట్ రాకపోవడంతో తనే ఒక రా ఏజెంట్ లా ఫీల్ అయి ఒక ఉగ్రవాద చర్యను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక టెర్రరిస్ట్ తో పాటు అనుకోకుండా రా ఆఫీసర్ మనోజ్(ప్రకాష్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు. ఇవేమీ తెలియని అఫ్జానా అనుకోకుండా ఆ టెర్రరిస్ట్ ని తప్పిస్తుంది. దీంతో రా ఆఫీసర్స్ జాక్ ని పట్టుకుంటారు. అసలు జాక్ ఎందుకు రా ఆఫీసర్ అవ్వాలి అనుకుంటాడు? ఉగ్రవాదులు ఏం చేయబోతున్నారు? రా ఆఫీసర్ మనోజ్ ఎవర్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు? అఫ్జానా జాక్ ఏం చేస్తాడో కనిపెట్టిందా? ప్రసాద్ కి తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుస్తుందా? జాక్ ఉగ్రవాద చర్యని కనుక్కుంటాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ.. సిద్ధూ జొన్నలగడ్డ సినిమాలు అంటే కామెడీతో పక్కా హైదరాబాదీ స్టైల్ లో ఉంటాయని తెలిసిందే. ఈ జాక్ కూడా హైదరాబాదీ స్టైల్ లో సిద్ధూ మార్క్ తోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో సిద్ధూ ఫుల్ గానే నవ్విస్తాడు. టెర్రరిస్ట్ లని తనే సొంతంగా పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సస్పెన్స్ అనిపిస్తునే నవ్విస్తాయి కూడా. సెకండ్ హాఫ్ లో అసలు మెయిన్ టెర్రరిస్ట్ ని పట్టుకోడానికి జాక్, రా ఆఫీసర్స్ చేసే ప్రయత్నాలు కాస్త సీరియస్ గా కామెడీగానే సాగుతాయి.
అయితే రా అనే ఒక గొప్ప సంస్థని, అందులో పని చేసే ఆఫీసర్స్ ని జాక్ సినిమాలో సినిమాటిక్ లిబర్టీతో ప్రేక్షకులను నవ్వించడానికి కాస్త కామెడీని జొప్పించి చూపించారు దర్శకుడు. రా వాళ్ళు ఏం చేయలేరు, అంతా హీరోనే చేయగలడు అని ఓ సినిమాటిక్ లిబర్టీలో చూపించడం కాస్త ఫన్నీగా అనిపించినా… ఎంటర్టైనింగ్ గా వుంటుంది. మామూలుగానే సిద్ధూ సినిమాలు హైదరాబాద్ హిందీ మిక్స్ అయి ఉండి నవ్విస్తాయి. ఇందులో కూడా హిందీ భాషలోని డైలాగులతో, హీరోయిన్ కూడా ముస్లిం పాత్ర కావడంతో ఆమెతో హిందీ డైలాగులతో చేసే కామెడీ అంతా మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాని ఒక స్పై థ్రిల్లర్ లా సీరియస్ గా తీయొచ్చు. కానీ సిద్ధూ తన స్టైల్ మిస్ అవ్వకూడదు అని కామెడీని జోడించాడు. ఇందులోని ట్విస్ట్ లు బాగా మెప్పిస్తాయి. సినిమాలో అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఒక రెగ్యులర్ స్పై సినిమాని కామెడీగా చూపించే ప్రయత్నం చేసారు. బొమ్మరిల్లు భాస్కర్ మార్క్ కు… సిద్ధూ జొన్నలగడ్డ మార్క్ కూడా తోడు కావడంతో మోర్ ఎంటర్టైనింగ్ గా ఆకట్టుకుంటుంది.
సిద్దు తన రెగ్యులర్ టిల్లు స్టైల్ లోనే ఈ సినిమాలో కూడా మెప్పించాడు. వైష్ణవి చైతన్య డిటెక్టివ్ పాత్రలో ఆకట్టుకుంటుంది. ప్రకాష్ రాజ్ సీరియస్ రా ఆఫీసర్ పాత్రలో బాగా మెప్పించారు. సీనియర్ నరేష్ కూడా యూట్యూబర్ గా కాసేపు నవ్విస్తారు. బ్రహ్మాజి పాత్ర కూడా కాసేపు ఆకట్టుకుంటాడు. నెగిటివ్ రోల్ లో రాహుల్ దేవ్ కాసేపు కనిపించి పర్వాలేదనిపించారు. బిగ్ బాస్ అలీ నెగిటివ్ పాత్రలో మెప్పించాడు. నటుడు రవి ప్రకాష్ తదితర నటీనటులు వారి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగున్నాయి. చాలా వరకు రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేసారు. నెపాల్, ఓల్డ్ సిటీ ఎపిసోడ్స్ బాగా ఆకట్టుకుంటుంది. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మెప్పిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ కథ, డైరెక్షన్ అతని స్టైల్ కి భిన్నంగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఇలాంటి జోనర్స్ ఇష్టపడే వాళ్లు ఓసారి చూసేయండి.
రేటింగ్: 3.25