సురవరం ప్రతాప్ రెడ్డి జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భావితరాలకు స్ఫూర్తి కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి అన్నారు మంగళవారం సాయంత్రం బషీర్ బాగ్, దేశోద్దారక భవన్ లో, సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ నిర్వహించిన ప్రతాప రెడ్డి 128వ జయంతి వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక చైతన్యం కోసం నిర్మొహమాటంగా, నిర్భయంగా రచనలు అందించిన ఘనత ప్రతాప్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ సభకు గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, చరిత్ర పరిశోధికుడిగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా, కవిగా, సామాజిక ఉద్యమకారుడిగా, బహుబాషా కోవిదుడిగా సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి ఓ వ్యక్తి కాదని, సామాజిక శక్తి అని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యానికి ప్రతాప రెడ్డి ప్రతిరూపమని ఆయన కొనియాడారు. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర పండితుడు ఓ వ్యాసంలో ఎగతాళి చేస్తే, 354మంది కవులతో కూడిన గోల్కొండ కవుల సంపుటిని ప్రచురించి తెలంగాణ సాహిత్య ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన సాహితీవేత్త సురవరం ప్రతాప రెడ్డి అని విరాహత్ అలీ అన్నారు. గోల్కొండ పత్రికతో తెలంగాణ మాగాణంలో అక్షర సేద్యం చేసిన గొప్ప పాత్రికేయులు సురవరమేనని ఆయన స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన ప్రతాప్ రెడ్డి సాహిత్య ట్రస్ట్ చైర్మన్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి నామకరణం చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సురవరం పుష్పలతా రెడ్డి, ప్రతాపరెడ్డి కుమారుడు సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్టు ఉదయవర్లుకు సురవరం పురస్కారం
సీనియర్ పాత్రికేయులు తిరునగిరి ఉదయవర్లుకు సురవరం ప్రతాపరెడ్డి 2024 స్మారక పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా ప్రధానం చేశారు.