అబ్కారి శాఖలో పదవీ విరమణ పొందిన తరువాత కళా రంగం లో విశేష సేవలు అందిస్తూ, మరోవైపు సామాజిక బాధ్యతగా జన్మభూమికి, నిరుపేదలకు సాయం అందిస్తూ మంచి గుర్తింపు పొందారని రిటైర్డ్ సర్కిల్ ఇన్-స్పెక్టర్ ఎం.ఎ. హమీద్ ను అమెరికా నుంచి విచ్చేసిన కళాపోషకులు, విద్యావేత్త రవి కొండబోలు అభినందించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హమీద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆత్మీయ మిత్రులు, సహచర ఉద్యోగులు, వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. యువకళావాహిని ఉపాధ్యక్షులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కళా వికాసం కోసం కృషి చేయడం స్ఫూర్తిదాయకం అని అల్లం నారాయణ ప్రశంసించారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు సమాజానికి వారికి ఇష్టమైన రంగంలో సేవలు అందించాలని ఆయన కోరారు. ఎం. ఎ. హమీద్ మాట్లాడుతూ కళారంగం తనకు సంతృప్తిని ఇస్తుందని, అందుకే యువకళావాహిని ద్వారా తన వంతు బాధ్యతగా సేవలు అందిస్తున్నానని, చివరి వరకు సేవలు కొనసాగిస్తానని చెప్పారు. మంచి స్నేహితులు లభించడం, తనను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. యువకళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. రసమయి డా. ఎం. కె. రాము, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ మద్దాలి రఘురాం, సీనియర్ పాత్రికేయులు డా. మహ్మద్ రఫీ, మహ్మద్ షరీఫ్, ఎం. డి. అబ్దుల్, సినీ విశ్లేషకులు ఎస్. వి. రామారావు, సినీ నటులు సుబ్బరాయ శర్మ, లయన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, జివిఆర్ ఆరాధన గుదిబండి వెంకటరెడ్డి, ఆరాధన లోకం కృష్ణయ్య, తెలంగాణ సారస్వత పరిషత్ డా. జె. చెన్నయ్య, కథక్ కళాక్షేత్ర అంజుబాబు, కలయిక ఫౌండేషన్ చేరాల నారాయణ, మధు, పి. వెంకటదాస్, ఎఫ్డిసి ఖాన్, విజయ్ కుమార్, జె. రాధాకృష్ణ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. యువకళావాహిని కార్యదర్శి జి. మల్లికార్జునరావు పర్యవేక్షించారు.