ఒక్కో చోట ఒక్కో విధంగా.. దీపావళి!

0
43
Each place has a different way.. Diwali!
Each place has a different way.. Diwali!

దేశ ప్రజలు తమదైన శైలిలో  పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత ప్రజలు తమదైన  సంప్రదాయాలతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో పండుగ జరుపుకునే పద్ధతులే కాదు.. అందుకు గల కారణాలు కూడా వేరు. పండుగ ఎందుకు జరుపుకుంటున్నారనే దానిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ ప్రచారంలో ఉంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఉండగా వరాహస్వామి, భూదేవిలకు అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. తప్పస్సుతో శివుడి చేత వరం పొంది దేవమానవులను చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. నరకాసురుడు తల్లి చేతుల్లోనే చంప బడాలనే వరం పొందిన కారణంగా ఎదురులేని వాడై లోకాలను ముప్పతిప్పలు పెడుతుంటాడు. దీంతో భయాందోళనకు గురైన దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణువేడుతారు. వారికి అభయమిచ్చిన విష్ణువు భూదేవీ సమేతంగా శ్రీ కృష్ణ సత్యభామలుగా భూలోకంలో జన్మిస్తారు. నరకుని దురాగతాలు పెచ్చుమీరిన అనంతరం శ్రీకృష్ణుడు నరకుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. భార్య సత్యభామను వెంటతీసుకెళతాడు. అక్కడి ఇరు వర్గాలకు భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు నరకుడి వరం కారణంగా తల్లి అయిన సత్యభామ చేతిలోనే మరణిస్తాడు. దీంతో అతడి చెరలో ఉన్న దేవమానవులకు విముక్తి దొరకుతుంది. నరకాసురుడు మరణించాడన్న ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన రామచంద్రుడు.. సీతను అపహరించిన రావణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో రావణుడు మరణిస్తాడు. అప్పటికే రాముడి 14 ఏళ్ల వనవాసం ముగుస్తుంది. దీంతో రాముడు.. సీత,లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అయోధ్యకు తిరిగి వెళతాడు. అనంతరం రాముడు పట్టాభిషిక్తుడవుతాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారు. గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి అని పెద్దల ఉవాచ.