హారతులు..లక్ష్మీ పూజలు.. నోములు, వ్రతాలు…
ప్రతీ ఏటా ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. దీపాల వెలుగుల కారణంగా చీడపీడలు, పురుగూ పుట్రా, అడవి జంతువుల భయం ఉండదన్న భావన కూడా ఉంది. నరకాసురుడు మరణించిన రోజుగా నరకచతుర్దశినీ, దీపావళినీ వేడుక చేసుకుంటాం. ఈ పండుగ నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పండుగను నరకాసుర వధకు సంకేతంగా కాదు, మన లోపల ఉన్న దోషాలను తొలగించుకోవడానికి ఒక సంకల్పంగా జరుపుకోవాలి. అప్పుడే అది నిజమైన దీపావళి అవుతుంది. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. అమావాస్య కనుక ప్రపంచమంతా చీకట్లు ఆవరించి ఉంటాయి. ఈ చీకట్లను పారదోలేందుకు దీపాలు వెలిగించాలన్న ఆలోచనతోనే దీపావళి జరుపుతారు. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. మనచుట్టూ ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధ పెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణు మూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. దీపావళి పండుగ అంటే ప్రముఖంగా గుర్తొచ్చేవి పట్టుబట్టలు, పిండివంటలు, బాణాసంచా, దీపాల కాంతులు.
హారతులు..లక్ష్మీ పూజలు.. నోములు, వ్రతాలు…
చతుర్దశి నాడు వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. ఈ దీపాలు లక్ష్మీకటాక్షం కలిగించడంతోపాటు పితృదేవతలకు నరకబాధను విముక్తిచేస్తాయని నమ్మకం. దీపావళి నాడు హారతులు ప్రధానమైన వేడుక. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇస్తారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ పక్రియ గురువారం సూర్యోదయానికి ముందుచేసుకోవాలని సిద్దాంతులు సెలవిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కుదరని పక్షంలో, వర్జ్యం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చు. ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి ఒకేరోజు జరుపుకోనున్నారు. అమావాస్య తిథి గురువారం పరివ్యాప్తమై ఉన్నందున గురువారం ఉదయం హారతులు, సాయంతరం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో హారతులు, లక్ష్మీపూజలు ఒకేరోజు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు కలిసి వచ్చాయి. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి గురువారమే చేసుకోవాలి. నోముల విషయంలోనూ పండితులు పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్మీపూజలకు ఎలాగైతే సాయంత్రం అమావాస్య ఉండాలన్న నియమం ఉన్నదో.. నోములు నిర్వహించాలంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని చెప్తున్నారు. దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైంది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. గురువారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి కొత్తబట్టలు, కానుకలు సమర్పించే సంప్రదాయం తెలుగువారికి ఉంది.