CPM Politburo: ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ స్కామ్‌ – విద్యా శాఖ మంత్రి తప్పుకోవాల్సిందే

0
87

సిపిఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌
న్యూఢిల్లీ : అఖిల భారత స్థాయి పోటీ పరీక్షల ప్రక్రియను భ్రష్టు పట్టించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని సిపిఎం పునరుద్ఘాటించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఆదివారం నాడిక్కడ ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. కేంద్రీకృత అఖిలభారత పరీక్షా ప్రక్రియలో ఇటీవల చోటుచేసుకున్న దుష్ట పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. నీట్‌ – యుజి, యుజిసి నెట్‌, ఇప్పుడు నిరవధిక వాయిదా పడ్డ నీట్‌ – పిజి ఇలా ఏది తీసుకున్నా .. అతీగతీ లేకుండా వేచిచూడాల్సిన దుస్థితి నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటి అక్రమాల వల్ల దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన ప్రధాన రంగాల ప్రక్రియలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయని పొలిట్‌బ్యూరో పేర్కొంది. వ్యవస్థలన్నీ ఇలా భ్రష్టు పట్టడానికి ప్రాథమిక నిరూపితమైన అవినీతి ఒక్కటే కారణం కాదని తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలో కేంద్రీకరణ, వ్యాపారీకరణ, మతతత్వీకరణ ప్రధానం కావడం వల్లే ప్రస్తుత వినాశకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని సిపిఎం పేర్కొంది. వ్యాపం కుంభకోణం తరహాలోనే దీనిని మసిపూసి మారేడు కాయ చేసేందుకు, తన తప్పిదాలన్నిటినీ కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంలోని కొత్త ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారణ అయిన పరీక్షల కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించినట్లు కనిపిస్తోందని విమర్శించింది.
ఉన్నత విద్యా వ్యవస్థలో కేంద్రం అనుసరించిన విధానపర నిర్ణయాల ఘోర వైఫల్యాన్ని పరీక్షల వ్యవస్థలు కుప్పకూలిపోవడం ప్రతిబింబిస్తోందని, దీనికి ప్రభుత్వం యావత్తూ బాధ్యత వహించాలని, ప్రత్యేకించి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.
సువిశాలమైన, వైవిద్యమైన భారత్‌ వంటి దేశంలో ఉన్నత విద్యా పరిపాలనను కేంద్రీకరించడం ఏమాత్రం పొసగదని, కేంద్రీకృత విధానాన్ని తక్షణమే వికేంద్రీకరించాలని కోరింది. ఇందులో మొదటి అడుగుగా కేంద్రీకృత నీట్‌ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. వృత్తి విద్యా సంస్థల్లో ప్రవేశాలను నియంత్రించేందుకు ప్రతి రాష్ట్రం తనకు అనువైన ప్రత్యేక ప్రక్రియలను, విధానాలను అనుసరించి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు అనుమతించి తీరాలని పొలిట్‌ బ్యూరో డిమాండ్‌ చేసింది.