టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్ రూపొందించిన మన చంద్రన్న పుస్తకం
700 అంశాలతో పాకెట్ సైజ్ పుస్తకం రూపకల్పన
అమరాతి, ఏప్రిల్ 15 :- ‘మన చంద్రన్న అభివృద్ధి-సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ టీ.డీ జనార్థన్ రూపొందించిన ఈ పుస్తకాన్ని మంగళవారం సచివాలయంలో సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసం, యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోషించిన పాత్ర, రాజకీయ అరంగ్రేటం వంటి అంశాలు చిత్రాలతో కూడిన పుస్తకాన్ని రూపొందించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో పోషించిన పాత్రను గురించి పొందుపరిచారు. అలిపిరిలో బాంబు ఘటన, వస్తున్నా మీకోసం పాదయాత్ర, ప్రజా పోరాటాలను గురించి వివరించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన పబ్లిక్ పాలసీలు ఉమ్మడి ఏపీలో ఏ విధంగా ప్రభావం చూపించాయి, దేశంలో ఎటువంటి ముద్ర వేశాయో పుస్తకంలో వివరించారు. వ్యవసాయాభివృద్ధి, నదుల అనుసంధానం ఇలా 700 అంశాలతో పాకెట్ సైజ్ పుస్తకాన్ని రూపొందించారు.